Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాడులో ఓటున్నోళ్లు.. ఎంత అదృష్ట‌వంతులంటే!!

మీకు త‌మిళ‌నాడులో ఓటు హ‌క్కు ఉందా? అయితే.. మీ అంత అదృష్ట వంతులు మ‌రొక‌రు లేర‌నే చెప్పాలి.

By:  Garuda Media   |   25 March 2026 7:00 AM IST
త‌మిళ‌నాడులో ఓటున్నోళ్లు.. ఎంత అదృష్ట‌వంతులంటే!!
X

మీకు త‌మిళ‌నాడులో ఓటు హ‌క్కు ఉందా? అయితే.. మీ అంత అదృష్ట వంతులు మ‌రొక‌రు లేర‌నే చెప్పాలి. ఎందుకంటే.. ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల సీజ‌న్‌లో ఇటు అధికార డీఎంకే కూట‌మి.. అటు ప్ర‌తిప‌క్ష అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూట‌ములు ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లులు కురిపిస్తున్నాయి. అంతేనా.. తాను ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతాన‌ని చెప్పిన‌.. త‌మిళ వెట్రి క‌ళ‌గం పార్టీ(టీవీకే ) అధినేత, ద‌ళ‌ప‌తి విజ‌య్ కూడా ఉచిత హామీల వ‌ర్షం కురిపించారు. దీంతో ఓటు ఎవ‌రికి వేశార‌న్న‌ది ముఖ్యం కాదు.. ఎవ‌రికి వేసినా.. వ‌రాల జ‌ల్లు కురుస్తుంద‌న్న‌ది ఖాయం!.

తాజాగా ఎన్డీయే కూట‌మి వంతు..

ఇటీవ‌ల టీవీకే ప‌లు ఉచితాలు ప్ర‌క‌టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బ‌స్సు అంద‌రికీ కల్పిస్తామంది. అలానే.. పింఛ‌నును 2000 చేస్తామ‌ని చెప్పింది. ఇక‌, ఇత‌ర‌త్రా హామీలు కూడా ప్ర‌క‌టించింది. ఇప్పుడు టీవీకేకు త‌ల‌ద‌న్నేలా అన్నాడీఎంకే(మాజీ సీఎం జ‌య‌ల‌లిత పార్టీ) కూడా ఉచిత హామీల వ‌ర్షం కురిపించింది. త‌మ‌కు ఓటేసి గెలిపిస్తే.. ప్ర‌తి కుటుంబానికీ.. 10 వేల చొప్పున ఖాతాల్లో వేస్తామ‌ని చెప్ప‌డం కీల‌కంగా మారింది. అంతేకాదు.. పురుషులు, మ‌హిళ‌లు, పిల్లలు అనే తేడా లేకుండా ఆర్టీసీ బ‌స్సుల్లో `ఎక్క‌డ నుంచి ఎక్క‌డ‌కైనా..` ఉచితంగా ప్ర‌యాణంచేయొచ్చ‌ని పేర్కొంది.

ఉచిత ఫ్రిజ్‌లు..

అంతేకాదు... రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి కుటుంబానికీ.. ఉచితంగా ఫ్రిజ్‌లు పంపిణీ చేస్తామ‌ని అన్నాడీఎంకే చీఫ్ , మాజీ సీఎం ప‌ళ‌ని స్వామి చాలా సంతోషంగా ప్ర‌క‌టించారు. ఇక్క‌డితోనూ ఆయ‌న ఆగ‌లేదు.. ఏడాదికి ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను అందిస్తామ‌న్నారు. అంతేనా.. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే మ‌హిళ‌ల‌కు.. వారు కొనే ద్విచ‌క్ర వాహ‌నాల‌పై 25 వేల రూపాయ‌ల రాయితీ(సొమ్మును ఖాతాల్లో) ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు విద్యకు సంబంధించి కుటుంబాలు చేసిన రుణాల‌ను పూర్తిగా మాఫీ చేస్తామ‌న‌ని తెలిపారు.

వారికి అన్నీ ఫ్రీ..

రాష్ట్రంలో రేష‌న్ కార్డు ఉన్న వారికి ఉప్పు, పప్పు.. మంచినూనె స‌హా.. బియ్యంతోపాటు అన్నీ ఫ్రీగా ఇస్తామ‌ని చెప్పారు. ఇక‌, కీల‌కంగా మారిన మ‌రోహామీ ఏంటంటే.. తెలంగాణ సంప్ర‌దాయ వేడుక జ‌ల్లిక‌ట్టులో ఏదైనా ప్ర‌మాద‌వ శాత్తు మృతి చెందిన వారి కుటుంబాల‌కు..(వారిని యోధులుగా పేర్కొన్నారు) 10 ల‌క్ష‌ల రూపాయ‌ల మేర‌కు సాయం చేస్తామ‌ని కీల‌క హామీ ప్ర‌క‌టించారు. ఇక‌, నెల నెలా వృద్ధులు, వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌ల‌కు..ఇచ్చే ప్ర‌స్తుత 1500 రూపాయ‌ల పింఛ‌నును 2000ల‌కు పెంచుతామ‌న్నారు. ఇదీ.. త‌మిళ‌నాడులో హామీల వ‌ర‌ద‌.

కొస‌మెరుపు..

చిత్రం ఏంటంటే.. ప్ర‌స్తుత అప్పుల్లో ద‌క్షిణాది రాష్ట్రాల్లో త‌మిళ‌నాడు తొలి మూడు స్థానాల్లో ఉండ‌డం గ‌మ‌నార్హం.