ఎన్నికలు జరిగి పదేళ్లు.. పదవీ కాలం ముగిసి ఐదేళ్లు.. కట్ చేస్తే.. నువ్వే విన్నర్ అన్న కోర్టు
2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రాధాపురం నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థి అప్పావు, ఏఐఏడీఎంకే అభ్యర్థి ఇన్బనాథన్ ల మధ్య హోరాహోరీ పోరు నడిచింది.
By: Tupaki Political Desk | 6 Jun 2026 11:47 AM ISTరాజకీయాల్లో గెలుపోటములు అనేవి క్షణాల్లో మారిపోతుంటాయి. కానీ, ఒక అభ్యర్థి ఓడిపోయినట్లు ప్రకటించిన పదేళ్ల తర్వాత.. ‘కాదు కాదు.. అతనే గెలిచాడు’ అంటూ కోర్టు తీర్పు ఇస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్ తమిళనాడు రాజకీయాల్లో జరిగింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగిందంటే..?
2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రాధాపురం నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థి అప్పావు, ఏఐఏడీఎంకే అభ్యర్థి ఇన్బనాథన్ ల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. కౌంటింగ్ ముగిశాక కేవలం 49 ఓట్ల స్వల్ప తేడాతో ఇన్బనాథన్ గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్ పెట్టాలని డీఎంకే అభ్యర్థి అప్పావు అప్పట్లోనే గట్టిగా పోరాడారు. కానీ అధికారులు వినలేదు.
పదేళ్ల సుదీర్ఘ పోరాటం..
అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పావు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు కోర్టులో సాగుతూనే ఉంది. ఈ లోపు ఆ ఐదేళ్ల అసెంబ్లీ పదవీ కాలం కూడా ముగిసిపోయింది. ఆ తర్వాత 2021లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ కోర్టు తీర్పు వెలువడలేదు. ఆ తర్వాత కూడా మరో ఐదేళ్లు గడిచినా కోర్టులో కేసు విచారణలో ఉండిపోయింది. 2016 ఎన్నికల తర్వాత రెండు ప్రభుత్వాలు మారి తాజా ఎన్నికల్లో టీవీకే గెలిచింది. అప్పట్లో డీఎంకే తరఫున పోటీ చేసిన అప్పావు ప్రస్తుతం టీవీకే తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా కూడా బాధ్యతలు చేపట్టారు.
తప్పు ఎక్కడ జరిగింది
డీఎంకే అభ్యర్థి అప్పావు, అన్నాడీఎంకే అభ్యర్థి ఇన్బదురై చేతిలో 49 ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీనిని అప్పావు కోర్టులో సవాల్ చేశారు. మొత్తం 203 పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల అధికారులు తిరస్కరించడాన్ని చట్ట విరుద్ధమని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల అధికారులు తిరస్కరించిన 203 పోస్టల్ ఓట్లలో 153 తనకే పోలైనట్లు వివరించారు. వీటిని కలుపుకుంటే 103 ఓట్లతో తానే గెలిచినట్లు అవుతుందని కోర్టుకు నివేదించారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ధృవీకరించిన పోస్టల్ ఓట్లు చెల్లవని ఎన్నికల అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల తాను గెలిచినా ఓడిపోయినట్లు డిక్లేర్ చేశారని ఆరోపించారు.
తీర్పు వచ్చింది కానీ.. పదవి లేదు!
ఇక తొలుత అప్పావు హైకోర్టులో కేసు వేయగా, ఆయన పిటిషన్ ను సమర్థిస్తూ పోస్టల్ బ్యాలెట్లను ధృవీకరించే అధికారం ప్రధానోపాధ్యాయులకు ఉందని 2019లో హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై అన్నాడీఎంకే అభ్యర్థి సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, హైకోర్టు తీర్పుపై స్టే విధించారు. ఆ తర్వాత పలు వాయిదాలు అనంతరం ఈ పిటిషన్ పై విచారణ కొనసాగించాలని గత నెల 26న సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇక సుప్రీం సూచనలతో విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్ డీఎంకే అభ్యర్థి అప్పావు గెలిచినట్లు తీర్పు వెలువరించారు.
సుప్రీం తీర్పునే అమలు చేయరా?
ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ పట్ల తీవ్రమైన పరిహాసంగా ఈ కేసును అభివర్ణించారు. ఎన్నికల పిటిషన్లలో జాప్యం చేయకూడదని గతంలోనే సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ఉటంకించారు. న్యాయస్థానాలు తమ సొంత పరిశీలనలనే విస్మరిస్తే ఎలా? ఇలానే కొనసాగితే మన దేశం నిరంకుశ దేశాల సరసన చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల పిటిషన్లలో జాప్యం ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు.
