Begin typing your search above and press return to search.

ఆమె అవినీతి పాపం.. రిటైర్ అయ్యే రోజు పండింది

ఎంత తప్పించుకు తిరిగినా.. చేసిన తప్పునకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న వాదనకు నిలువెత్తు రూపంగా తమిళనాడులో తాజాగా చోటు చేసుకున్న ఘటనను చెప్పాలి.

By:  Tupaki Desk   |   1 Jun 2025 10:14 AM IST
ఆమె అవినీతి పాపం.. రిటైర్ అయ్యే రోజు పండింది
X

తప్పు చేసినోడికి శిక్ష తప్పదు. ఎంత తప్పించుకు తిరిగినా.. చేసిన తప్పునకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న వాదనకు నిలువెత్తు రూపంగా తమిళనాడులో తాజాగా చోటు చేసుకున్న ఘటనను చెప్పాలి. విపరీతమైన అవినీతిని మూటకట్టుకోవటమే కాదు.. తప్పుడు పనులు చేయటంలో ఆమెకు ఆమే సాటి అన్నట్లుగా వ్యవహరించే మహిళా అధికారి ఒకరు రిటైర్మెంట్ రోజున సస్పెండ్ అయిన సంచలన ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

తమిళనాడులోని తెన్కాశి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యురాలిగా పని చేసే శ్రీపద్మావతి కాసుల కక్కుర్తి ఎంత ఎక్కువ అంటే.. తెలిసినోళ్లంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. చివరకు ఆకుకూర కట్ట కొనుగోలు విషయంలోనూ అవినీతికి పాల్పడటం గమనార్హం. రూ.25 విలువ చేసే ఆకుకూర కట్టను రూ.80చొప్పున కొన్నట్లుగా తప్పుడు లెక్కలు చూపించేవాళ్లు.

అయితే.. ఆమె అత్యాశ ఎక్కువ కాలం బయటకు రాకుండా ఉండలేదు. ఆమె తప్పుడు పనులు వెలుగు చూశాయి. ఇదిలా ఉండగా.. కొద్ది నెలల క్రితం తెన్కాశి ఆసుపత్రి నుంచి ఆమె తూత్తుకూడి ప్రభుత్వ ఆసుపత్రి పాలనా అధికారిగా బదిలీ అయ్యారు. శనివారం ఆమె రిటైర్ కావాల్సి ఉండగా..ఆమె మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు.

తాజాగా బదిలీ మీద వచ్చిన సందర్భంగా.. ఆమె గతంలో పని చేసిన చోటు నుంచి ఎలాంటి ఆరోపణలు లేవన్న ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని తూత్తుకూడి అధికారులు ఆమెను కోరారు. అయితే.. గతంలో పని చేసిన చోట ఆమె మీద ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. అక్కడి నుంచి నో డ్యూస్ సర్టిఫికేట్ తెచ్చే వీలు లేకపోవటంతో.. నకిలీ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించారు. ఆమె ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన తూత్తుకూడి వైద్యాదికారులు క్రాస్ చేశారు. ఈ సందర్భంగా శ్రీపద్మావతి తప్పుడు పత్రాన్ని సమర్పించారన్న విషయం వెలుగు చూసింది. దీంతో.. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రిటైర్ అయ్యే రోజునే సస్పెండ్ అయిన ఘనతను సొంతం చేసుకున్నారు. చేసిన పాపాలు ఊరికే పోవు కదా?