భారీ నెంబర్ తో కాంగ్రెస్...స్టాలిన్ షాక్
తమిళనాడులో ఇండియా కూటమి రాజకీయం రసకందాయంలో పడింది. నిజానికి ఇక్కడ లోకల్ లీడర్ షిప్ అయితే డీఎంకేతో కలసి నడిచేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు అని ప్రచారం సాగుతోంది.
By: Satya P | 18 Feb 2026 9:18 AM ISTతమిళనాడులో ఇండియా కూటమి రాజకీయం రసకందాయంలో పడింది. నిజానికి ఇక్కడ లోకల్ లీడర్ షిప్ అయితే డీఎంకేతో కలసి నడిచేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు అని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన తమిళ దళపతి విజయ్ టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని కూడా కోరుతోంది. తమ మనసులోని ఆలోచనలు హైకమాండ్ చెవిలో స్థానిక కాంగ్రెస్ పెద్దలు చేరవేశారు. ఇదిలా ఉంటే 2021 ఎన్నికల్లో 234 సీట్లు కలిగిన తమిళనాడు అసెంబ్లీలో 25 సీట్లకు కాంగ్రెస్ పోటీ చేస్తే 18 సీట్లు గెలుచుకుంది.
మంత్రి పదవులు లేవు :
ఇక చూస్తే స్టాలిన్ ప్రభుత్వంలో 18 మంది ఉన్న కాంగ్రెస్ కి మంత్రి పదవులు ఇవ్వకుండానే అయిదేళ్ళ పాలన పూర్తి చేశారు. దాంతో కాంగ్రెస్ నేతలలో అసంతృప్తి ఏర్పడింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే విజయ్ పార్టీతో పొత్తులు పెట్టుకుంటే అధికారంలో వాటా కోరవచ్చు అన్నది వారి ఉద్దేశ్యంగా ఉంది అని అంటున్నారు. ఈ క్రమంలో హైకమాండ్ అయితే వారి మాట వినేలా లేదని అంటున్నారు. దాంతో కొత్త రాగం అందుకున్నారు. ఎక్కువ సీట్లు తమకు కావాలని పోటీ చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈసారి ఏకంగా నలభై సీట్లు కావాలని కాంగ్రెస్ కోరుతోంది. స్థానికంగా ఉన్న పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఈ డిమాండ్ పెట్టారని అంటున్నారు.
పెంచేది లేదా :
ఒక వైపు విజయ్ పార్టీ ఉండడంతో కాంగ్రెస్ కి ఆప్షన్లు పెరిగాయి అని అంటున్నారు. అందుకే ఎక్కువ సీట్లు కావాలని స్టాలిని ముందు ప్రతిపాదన పెట్టారని అంటున్నారు. దానికి స్టాలిన్ అయితే అంగీకరించేది లేదని అంటున్నారు. మహా అయితే ఈసారి పాతికకు మరో అయిదు కలిపి ముప్పై సీట్లు ఇవ్వవచ్చు కానీ 40 సీట్లు అంటే నో చాన్స్ అని అంటున్నారు. ఇక మంత్రి వర్గంలో కాంగ్రెస్ వారికి ప్లేస్ అన్నది కూడా స్టాలిన్ ముందే తేల్చేశారు తాము కాంగ్రెస్ సహా మిత్రులతో పోటీ చేస్తామని అయితే సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాని అర్ధం కేబినెట్ లో డీఎంకే వారే ఉంటారు అని స్పష్టం చేయడమే అని అంటున్నారు.
నోరు ఎత్త వద్దు :
ఇంకో వైపు చూస్తే డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్ జాతీయ అగ్ర నేత కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. డీఎంకే కాంగ్రెస్ కి పాత మిత్రుడని కేసీ వేణుగోపాల్ గుర్తు చేశారు. డీఎంకే మీద స్థానిక పై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించడం విశేషం. ఏ ఒక్క తమిళ నేత కూడా డీఎంకేను విమర్శించొద్దు అని ఆయన అన్నారు. దీనిని బట్టి చూస్తే హైకమాండ్ డీఎంకే విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఉంటే లోకల్ లీడర్స్ మాత్రం గుర్రుగా ఉన్నారని అంటున్నారు. మరి ఈ పొత్తులు ఎత్తులు బంధాలు ఏ విధంగా ఎన్నికల్లో పనిచేస్తాయో చూడాల్సి ఉంది.
