మోడీతో సీఎం విజయ్...ఢిల్లీ టూర్ ఇంట్రెస్టింగ్
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి అధికారిక పర్యటనగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు.
By: Satya P | 27 May 2026 12:46 PM ISTతమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి అధికారిక పర్యటనగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. బుధవారం ఢిల్లీ వెళ్ళిన ఆయన ఢిల్లీలో బిజీ బిజీగా గడపబోతున్నారు. ఢిల్లీ టూర్ లో విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన జరిపే ఉన్నత స్థాయి సమావేశం మీదనే అందరి దృష్టి ఉంది. మోడీతో విజయ్ తొలి మీటింగ్ కావడంతో ఏమి మాట్లాడుతారు, ఏ అంశాలు ఈ ఇద్దరి మధ్యన ప్రస్తావనకు వస్తాయన్నది ఆసక్తిని రేపుతోంది. మోడీతో విజయ్ భేటీ ప్రధానమంత్రి నివాసంలో సాయంత్రం 4:30 గంటలకు జరగనుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఆర్థిక సమస్యల మీదనే :
ఇక విజయ్ ప్రధాని మోడీని కలసి తమిళనాడుకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు నిధులు ప్రాజెక్టులు ఇతర సమస్యల మీద పూర్తిగా చర్చిస్తారు అని అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల మీద ఆయన మోడీకి వివరిస్తారు అని అంటున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని సమస్యల మీద ఇతర విషయాల మీద ముఖ్యమైన డిమాండ్లను వివరిస్తూ ముఖ్యమంత్రి విజయ్ ఒక సవివరమైన వినతిపత్రాన్ని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించనున్నారని తెలుస్తోంది.
మోడీతో చర్చించేవి ఇవే :
ఇక తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని మోదీతో చర్చించనున్న ప్రధానాంశాలు ఇవే అని అంటున్నారు. అందులో ఆర్థిక కేటాయింపులు ముఖ్య పాత్ర పోషించబోతున్నాయి. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న కేంద్ర నిధులు, అలాగే జీఎస్టీ పరిహారాన్ని త్వరగా విడుదల చేయాలని కోరడం, అలాగే, విద్యా నిధులు కింద సమగ్ర శిక్షా అభియాన్ కోసం కేటాయించిన నిధుల విడుదల కోరడం, జాతీయ విద్యా విధానంపై మోడీతో ముఖ్యమంత్రి విజయ్ చర్చించడం వంటివి ఉంటాయి. అలాగే మౌలిక సదుపాయాల విషయనికి వస్తే కనుక కోయంబత్తూరు మదురైలలో ప్రధాన మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రాన్ని అనుమతులు కోరడం, అలాగే, కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదించిన మేకెదాటు జలాశయ ప్రాజెక్టును తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాని తెలియ చేయడం వంటివి ఉంటాయి. ఇక తమిళ మత్స్యకారుల హక్కులను పరిరక్షించడానికి శ్రీలంక నావికాదళం నిర్బంధించిన వారిని విడుదల చేయించడానికి కేంద్ర జోక్యం కూడా విజయ్ ఈ సందర్భంగా కోరుతారని అంటున్నారు.
రాష్ట్రపతితో సహా :
ఇక ఇదే పర్యటనలో ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో వరస భేటీలు వేయనున్నారు. ఇక ఈ అధికారిక పర్యటనలు పూర్తి చేసుకున్న తరువాత ఆయన కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, అగ్ర నేత రాహుల్ గాంధీలతో సమావేశం అవుతారు. ఇక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో తిరువళ్లువర్ విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి విజయ్ ప్రారంభించనున్నారని అధికార వర్గాల సమాచారంగా ఉంది. మొత్తానికి విజయ్ ఢిల్లీ టూర్ అయితే ఆసక్తిని పెంచుతోంది అని చెప్పాలి. .
