ఎమ్మెల్యేలు అందరకీ కార్లు, నిర్వహణ కోసం రూ.75 వేలు : సీఎం విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ రోజుకొక సంచనల నిర్ణయంతో పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు.
By: Tupaki Desk | 19 Aug 2026 3:40 PM ISTతమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ రోజుకొక సంచనల నిర్ణయంతో పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష భేదం లేకుండా మొత్తం 234 మంది శాసనసభ్యులకు ప్రభుత్వ ఖర్చుతో కార్లు సమకూరుస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా, ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఎమ్మెల్యేలకు వాహనాలు కేటాయిస్తామని ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలకు కార్లు ఇవ్వడం ద్వారా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలు అవుతుందని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లో అనేక సంచలనాలకు తెర తీసిన సీఎం విజయ్ బుధవారం ఎవరూ ఊహించని ప్రకటన చేశారు. తమకు వ్యక్తిగత వాహనాలు లేకపోవడం వల్ల నియోజకవర్గాల్లో పర్యటించడం కష్టంగా ఉందని, ప్రజా సమస్యలు తెలుసుకోలేకపోతున్నామని మిత్రపక్షం వీసీకే ఎమ్మెల్యే జోతిమణి అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే తెలియజేసిన సమస్యపై స్పందించిన ముఖ్యమంత్రి విజయ్ వెనువెంటనే రాష్ట్రంలో 234 మంది ఎమ్మెల్యేలకు కొత్త కార్లు అందజేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా నెలవారీ ఇంధన ఖర్చులు, డ్రైవర్ జీతం కింద రూ.75 వేలు అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కార్యాలయాల నిర్వహణకు రూ.25 వేలు చెల్లిస్తామని ప్రకటించారు.
ఎమ్మెల్యేలకు అధికారిక వాహనాలు, నిర్వహణ కోసం నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి దళపతి విజయ్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఈ తరహా సౌకర్యం కల్పించలేదని చెబుతున్నారు. పార్లమెంటు సభ్యులకు కూడా ప్రభుత్వ వాహన సౌకర్యం లేదని అంటున్నారు. కానీ తొలిసారిగా తమిళనాడు సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలకు దిక్సూచిలా మారనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలకు జీతం, ప్రయాణ భత్యం, మెడికల్ అలవెన్సులు మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని, కానీ ఇప్పటివరకు వాహన సౌకర్యం మాత్రం లేదని అంటున్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి దళపతి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం తరఫున బాధ్యతగా ఎమ్మెల్యేలు అందరికీ కార్లు కొనుగోలు చేస్తామన్న ప్రకటన ద్వారా అధికార కూటమిలోని 90 శాతం ఎమ్మెల్యేలకు మేలు చేస్తుందని అంటున్నారు. రెండేళ్ల క్రితం పార్టీ పెట్టి, అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత సామాన్యులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించిన ముఖ్యమంత్రి విజయ్, వారితో సమర్థంగా పనిచేయించుకునేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం అధికార కూటమిలో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది అత్యంత సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడంతో వారికి వ్యక్తిగత వాహనాలు లేవని చెబుతున్నారు. దీంతో నియోజకవర్గాల్లో పర్యటనలు వారి శక్తికి మించిన భారంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వ డబ్బుతో వాహనాలు సమకూర్చడం వల్ల ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.
