మంత్రులుగా ఎలక్ట్రీషియన్లు, బ్యాంకర్లు, సామాజిక కార్యకర్తలు!
తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కేబినెట్ విస్తరణతో సరికొత్త రాజకీయాన్ని ఆవిష్కరించారని ప్రశంసలు అందుకుంటున్నారు.
By: Tupaki Political Desk | 23 May 2026 12:00 AM ISTతమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కేబినెట్ విస్తరణతో సరికొత్త రాజకీయాన్ని ఆవిష్కరించారని ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నెల 10న మఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ తనతోపాటు మరో 9 మందితో మంత్రులతో ప్రమాణం చేయించగా, తాజాగా 23 మందికి అవకాశం ఇచ్చారు. వీరిలో 21 మంది టీవీకే పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. వీరంతా తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలవడం ఒక విశేషమైతే మొత్తం మంత్రివర్గంలో 31 మందికి ఇంతకు ముందు ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుభవం లేకపోవడం ప్రత్యేకంగా చెబుతున్నారు. మొత్తం 32 మంది మంత్రుల్లో కేవలం ఒకే ఒక్కరు గతంలో మంత్రిగా వ్యవహరించినట్లు చెబుతున్నారు.
విధేయత కాదు సమర్థతకే పెద్దపీట
ఇక రాజకీయాల్లో సాధారణంగా కనిపించే విధేయతకు దళపతి విజయ్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే విశ్లేషణలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ప్రజలతో మమేకమయ్యే నాయకులను ఎంచుకోవడానికే విజయ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారంటున్నారు. అదేవిధంగా మంత్రివర్గంలో ఎక్కువ మంది యువత ఉన్నట్లు చూసుకున్నారు. సాధారణంగా తమిళనాడు పాలిటిక్స్‌లో ఎప్పుడూ సీనియర్లదే హవా ఉంటుందని చెబుతున్నారు. కానీ విజయ్ తన క్యాబినెట్‌లో యువతకు పెద్దపీట వేశారు. మొత్తం 35 మందిలో 22 మంది మంత్రులు 50 ఏళ్ల లోపు వయసున్న వారే కావడం ఒక రికార్డ్ గా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక తరం మార్పును సూచిస్తోందని అంటున్నారు.
సామాజిక న్యాయం
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయ్ క్యాబినెట్‌లో ఎనిమిది మంది దళితులకు మంత్రులుగా చోటు దక్కింది. అందులోనూ వారిని సంప్రదాయ శాఖలకే పరిమితం చేయకుండా, ఉన్నత విద్యాశాఖ వంటి కీలక పోర్ట్‌ఫోలియోలను అప్పగించడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ నుంచి జనరల్ స్థానం (మేలూరు)లో గెలిచిన మాజీ బ్యాంకర్ పి. విశ్వనాథన్ కు ఉన్నత విద్యాశాఖ బాధ్యతలు ఇవ్వడం ఇందుకు ఒక ఉదాహరణగా చూపుతున్నారు. ఇక కేబినెట్ లో లింగ సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ నలుగురు మహిళలకు చోటు కల్పించారు. వీరిలో టీవీకే ఫ్రంట్‌లైన్ లీడర్ సి. విజయలక్ష్మితో పాటు ఎస్.కమలి, కె.జగదీశ్వరి ఉన్నారు.
సినిమా టు రియల్ లైఫ్
విజయ్ కేబినెట్ లో ఎక్కువగా రవాణా శాఖ చేపట్టిన తమిళన్ పార్తిబన్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ కి వీరాభిమాని అయిన తమిళన్ పర్తిబన్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. 'ది గోట్' సినిమాలో ట్రాఫిక్ పోలీస్‌గా చిన్న పాత్ర పోషించారు. ఇక ఎన్నికల సమయంలో టీవీకేలో చేరిన ఆయనకు విజయ్ సేలం సౌత్ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇచ్చారు. మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన పార్తిబన్ కు ఏకంగా మంత్రిగా ఎంపిక చేయడమే కాకుండా ఏకంగా రవాణా శాఖ పగ్గాలు అప్పగించి విజయ్ అందరినీ ఆశ్చర్యపరిచారు. అదేవిధంగా తూత్తుకుడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మరో సినీనటుడు ఎ. శ్రీనాథ్ కి కూడా మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈయన సీఎం విజయ్‌కు దశాబ్ద కాలంగా అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఇలా వారసత్వ రాజకీయాలకు తావులేకుండా ఎలక్ట్రీషియన్లు, బ్యాంకర్లు, యువకులు, సామాజిక పోరాటాల నుండి వచ్చిన వారికి అధికారం పంచడం ద్వారా విజయ్ తన ‘తమిళగ వెట్రి కజగం’ సిద్ధాంతాన్ని మాటల్లోనే కాదు, చేతల్లోనూ నిరూపించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
