Begin typing your search above and press return to search.

బాబు తో పాటు జగన్ తోనూ విజయ్ భేటీ ?

తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీకి తొలిసారి ఈ నెల 13న వస్తున్న ముఖ్యమత్రి జోసెఫ్ విజయ్ పర్యటన అద్యమంతం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించనుంది.

By:  Satya P   |   13 Oct 2026 6:29 AM IST
బాబు తో పాటు జగన్ తోనూ విజయ్ భేటీ ?
X

తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీకి తొలిసారి ఈ నెల 13న వస్తున్న ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పర్యటన అద్యమంతం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించనుంది. విజయ్ ఏపీ పర్యటన ముందే ఖరారు అయింది. ఈ నెల ఆయన 13న వస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఉంది. అయితే విజయ్ పర్యటనలో మరో కీలక మార్పు ఏమిటి అంటే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తో భేటీ కావడం. ఇది కొత్తగా అజెండాలో చేరిందా లేక ఆయన అనధికార పర్యటనలో ఉందా అన్నది తెలియడం లేదు. ఇపుడు ఇదే ఆసక్తిని పెంచుతోంది.

ఇదీ విజయ్ టూర్ :

ఇదిలా ఉంటే విజయ్ ఏపీకి మంగళవారం వస్తున్నారు. అయన టీడీపీకి చెందిన ఎంపీల ద్వారా ఏపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు విజయవాడ ఉత్సవ్-2.0లో పాల్గొననున్నారు. అలాగే జాతీయ సరస్ ప్రదర్శనను సందర్శించనున్నారు. ఇక ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం కూడా విజయ్ షెడ్యూల్ లో ఉంది. విజయ్ ఏపీకి రావడంతోనే నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవుతారు. ఈ భేటీలో ఎపీ తెలంగాణాకు సంబంధించిన నీటి ప్రాజెక్టుల గురించి చర్చిస్తారు అని అంటున్నారు. ఇదే భేటీలో చెన్నైకి కృష్ణా నదీ జలాల సరఫరా అంశాన్ని విజయ్ ప్రస్తావించే అవకాశం ఉందని భోగట్టా. దేశమంతా ఎల్ నినో ప్రభావం ఉండడంతో నీటి కొరత తీవ్రంగా ఉంది. దాంతో తమిళనాడుకు ఏపీ నుంచి తెలుగు గంగ ప్రాజెక్ట్ ద్వారా సరఫరా అయ్యే నీటి లభ్యతపై ఆందోళనల నేపథ్యంలో తమిళనాడు రాజధానికి తాగునీటి కోసం విజయ్ ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తారు అని అంటున్నారు.

జగన్ భేటీపైనే :

అయితే ఇవన్నీ ఒక ఎత్తు తమిళనాడు సీఎం విజయ్ జగన్ తో జరపబోయే సమావేశం మరో ఎత్తు అంటున్నారు. మాజీ సీఎం గా ఉన్న జగన్ ని విజయ్ చంద్రబాబుతో భేటీ తరువాత కలుస్తారు అని అంటున్నారు. విజయ్ జగన్ ఏమి మాట్లాడుకుంటారు అన్నదే ఇపుడు అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. విజయ్ సీఎం కాక ముందే తమిళనాడులో జగన్ బంధువుల పెళ్ళిళో ఇరూరు నేతలు కలుసుకున్నారు. ఆ తరువాత బహిరంగంగా మళ్లీ కలిసింది లేదు. ఇపుడు ఆ ముచ్చట తీరబోతోంది అని అంటున్నారు. ఏపీకి వస్తున్నందున జగన్ తో భేటీ అవుతున్నారా అన్నది కూడా చర్చగా ఉంది

ఇద్దరితోనూ కలసి :

ఇదిలా ఉంటే ఏపీకి ఏ నాయకుడు వచ్చినా అయితే జగన్ లేకపోతే బాబుని కలవడమే తప్ప ఇద్దరినీ కలిసిన వారు బహు తక్కువ అని అంటున్నారు. విజయ్ మాత్రం ఒకే రోజున దాదాపుగా ఒకే సమయంలో ఇద్దరు నేతలను కలుస్తారు అంటూ వస్తున్న వార్తలే ఇపుడు చర్చకు తావిస్తున్నాయి. దాంతో బాబుతో భేటీ అధికారికం అయితే జగన్ తో భేటీ అనధికారం అని అంటున్నారు. ఇక జగన్ తో భేటీ తరువాత స్థానికంగా కార్యక్రమాలను చూసుకుని రాత్రికి విజయ్ చెన్నైకి వెళ్తారు అని అంటున్నారు. మొత్తం మీద విజయ్ ఏపీకి రావడం రాజకీయంగానూ చర్చకు ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తోంది అని అంటున్నారు.