దేశంలోనే తొలిసారి.. లంచగొండిని పట్టిస్తే లక్ష బహుమతి.. CM విజయ్ గేమ్ ఛేంజర్!
భారతదేశంలో లంచగొండితనం లేని ఒక రాష్ట్రాన్ని చూపించండి అంటే పెదవి విరిచేయడం ఖాయం.
By: Sivaji Kontham | 20 May 2026 5:00 PM ISTభారతదేశంలో లంచగొండితనం లేని ఒక రాష్ట్రాన్ని చూపించండి అంటే పెదవి విరిచేయడం ఖాయం. దేశంలోనే అత్యంత ప్రతిభావంతంగా పనిచేసే ప్రగతిశీల రాష్ట్రాల్లో ఒకటిగా పేరున్న తమిళనాడులో ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలపై తరచూ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వ్యవస్థాగత లోపానికి చరమగీతం పాడేందుకు తాజాగా ఎన్నికైన తమిళనాడు నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అత్యంత సాహసోపేతమైన నిర్ణయంతో రంగానికి దిగారు. రాష్ట్ర పరిపాలనలో అవినీతిని మూలాల నుంచి ఉఖేడించి వేయడమే లక్ష్యంగా సరికొత్త సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. దేశంలోనే మొదటిసారిగా, ఏ ప్రభుత్వ అధికారైనా లంచం అడిగితే వారిని పట్టిచ్చిన పౌరులకు ఏకంగా రూ.1 లక్ష నగదు బహుమతిని అందించే వినూత్న విప్లవాత్మక కార్యక్రమాన్ని విజయ్ సర్కారు ప్రతిపాదించింది.
అవినీతి నిరోధక శాఖకు పూర్తి అధికారాల్ని దఖలు పరుస్తూ.. ప్రతిష్ఠాత్మక పథకాన్ని బలోపేతం చేసారు సీఎం విజయ్. సామాన్య పౌరుడిని ఏ అధికారి అయినా లంచం లేదా ఆర్థిక ప్రయోజనాలు ఆశించి వేధిస్తే.. బాధితులు నేరుగా ఈ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. అధికారులు డిమాండ్ చేసిన లంచం మొత్తం కేవలం రూ. 1000 లేదా అంతకంటే తక్కువ ఉన్నా కానీ.. పౌరులు నిరభ్యంతరంగా సమాచారం అందించి లక్ష రూపాయల రివార్డును సొంతం చేసుకోవచ్చు. దీనికోసం బాధితులు తాము ఎదుర్కొన్న లంచం డిమాండ్‌కు సంబంధించిన స్పష్టమైన వీడియో ఆధారాన్ని సమర్పిస్తే సరిపోతుందని.. తద్వారా ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మార్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో దీని విజయానికి కొన్ని సవాళ్లు అధిగమించాల్సి ఉంది. ఇటువంటి భారీ రిస్క్‌తో కూడిన పనుల్లో సాక్ష్యాలు సేకరించే సాధారణ పౌరుల పేర్లు, వారి వ్యక్తిగత డేటాను ప్రభుత్వం పూర్తిగా రహస్యంగా ఉంచడం అత్యంత ఆవశ్యకమని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అవినీతి తిమింగలాలపై పోరాటంలో పౌరుల భద్రతే అన్నిటికంటే పెద్ద బహుమతి. మరోవైపు నేటి కాలంలో బ్యూరోక్రాట్లు నేరుగా లంచం అడగకుండా పౌరులు విసిగిపోయి వారే డబ్బులు ఇచ్చేలా సంక్లిష్టమైన పేపర్‌వర్క్‌తో మానసిక నరకం చూపిస్తారని.. ఇటువంటి పరోక్ష అవినీతి మార్గాలకు కూడా ముఖ్యమంత్రి విజయ్ తగిన పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
అవినీతిపై ఉక్కుపాదం మోపడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజా సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ విజయ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంటే...హ్యాట్సాఫ్ టు CM విజయ్ అంటూ ప్రజలు నినదిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదల ఆకలి తీరుస్తూ.. అత్యంత రాయితీ ధరలకే నాణ్యమైన భోజనం అందించే 600కు పైగా ప్రభుత్వ `అమ్మ క్యాంటీన్ల` మౌలిక వసతులను, ఆహార రుచిని తక్షణమే మెరుగుపరచాలని సీఎం విజయ్ ఆదేశించారు. చెన్నై కార్పొరేషన్ లోనే 382 అమ్మ క్యాంటీన్లను ప్రారంభించగా, ఇతర ప్రాంతాలలో మరో 236 అమ్మ క్యాంటీన్లను నడుపుతున్న ప్రభుత్వం.. వీటిని ఆధునీకరించేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
ఈ సంక్షేమ ప్రస్థానం గత వైభవానికి ప్రస్తుత అవసరాలకు అద్దం పడుతోంది. నాడు 2013లో మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జె. జయలలిత (అమ్మ) ప్రారంభించిన ఈ చారిత్రక అమ్మ క్యాంటీన్ల వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం గౌరవిస్తూ మరింత బలోపేతం చేస్తుండటం విశేషం. దీనితో పాటు గత డీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన 1.3 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ. 1000 నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని కూడా విజయ్ సర్కారు విజయవంతంగా కొనసాగిస్తూ నిధులు జమ చేసింది. ఒకవైపు ప్రజాదరణ పొందిన పాత పథకాలను కొనసాగిస్తూనే.. మరోవైపు `లంచం ఇస్తే లక్ష రివార్డు` వంటి గేమ్ ఛేంజర్ నిర్ణయంతో అవినీతి రహిత పాలనను అందిస్తున్న సీఎం విజయ్.. తమిళనాడు రాజకీయ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన ముఖ్యమంత్రిగా నిలిచిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
