అంతుచిక్కని తమిళ‘నాడి’.. భారీ పోలింగ్ తో తీవ్ర ఉత్కంఠ!
తమిళనాడులో భారీ పోలింగ్ నమోదు కావడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గత చరిత్రను తిరగరాస్తూ ఈ సారి 85 శాతం ఓటింగ్ నమోదైంది.
By: Tupaki Desk | 24 April 2026 2:55 PM ISTతమిళనాడులో భారీ పోలింగ్ నమోదు కావడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గత చరిత్రను తిరగరాస్తూ ఈ సారి 85 శాతం ఓటింగ్ నమోదైంది. ఇందులో ప్రధానంగా మహిళలు పోటెత్తడంతో రాజకీయ సమీకరణాలు అంతుచిక్కడం లేదని అంటున్నారు. తమిళనాడులో 2011 ఎన్నికల్లో 78.29 శాతం రికార్డు ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి 85 శాతం ఓటింగ్ నమోదు కావడమే సంచలనంగా మారింది. ఉదయం నుంచి ఓటర్లు భారీగా తరలిరావడంతో రికార్డు ఓటింగ్ నమోదైందని అంటున్నారు. ఇక 4వ తేదీన ఫలితాలు వెలువడనుండగా, పార్టీలు, రాజకీయ పరిశీలకులు ఫలితాల సరళిపై లెక్కలు, తీసివేతలతో బిజీబిజీగా గడుపుతున్నారు.
భారీ ఓటింగ్ శాతంతో ప్రధాన పార్టీలు ఫలితాలపై కచ్చిమైన నిర్ణయానికి రాలేకపోతున్నాయి. ముఖ్యంగా గతంలో రాష్ట్రంలో రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ ఉండేది. కానీ, ఈ సారి కొత్తగా ఆవిర్భవించిన టీవీకే కూడా గట్టి పోటీ ఇచ్చిందని విశ్లేషిస్తున్నారు. రెండు ప్రధాన కూటముల ఓట్లను టీవీకే భారీగా చీల్చిందని విశ్లేషిస్తున్నారు. దీంతో టీవీకేకు పోలైన ఓట్ల శాతం కూడా ఉత్కంఠకు కారణమవుతోంది. ఒపినియన్ పోల్స్ సమయంలో టీవీకే పది శాతం వరకు ఓట్లు తెచ్చుకుంటుందని నివేదికలు వెల్లడించారు. అయితే ఓటింగ్ సరళిని గమనిస్తే టీవీకే ఓటింగ్ శాతం పెరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో విజయ్ కింగ్ అవుతారా? కింగ్ మేకర్ పాత్ర పోషిస్తారా? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణతో అనర్హుల పేర్లను తొలగించడం వల్ల భారీ ఓటింగ్ నమోదైందని ఎన్నికల నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పోలింగ్ సమయంలో యువకులు, మహిళలు ఉత్సాహంగా కనిపించడంతో ఎన్నికల ఫలితాలపై వారి ప్రభావం ఎక్కువగా ఉండవచ్చనని అంటున్నారు. ముఖ్యంగా దళపతి విజయ్ పార్టీకి ఈ వర్గాల్లో సానుకూలత ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల ఫలితాలలో ఎవరి జాతకాలు తారుమారు అవుతాయనేది అంతుచిక్కడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక దళపతి విజయ్ పార్టీ చీల్చిన ఓట్లతో ప్రతిపక్షమే ఎక్కువగా దెబ్బతిన్నదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వాదనతో మరికొందరు విభేదిస్తున్నారు. దళపతి విజయ్ రెండు పార్టీల ఓటు బ్యాంకుకు గండి కొట్టారని అంటున్నారు. దీంతో విజయ్ ఎవరి ఓట్లు ఎక్కువగా చీల్చారనేది తెలుసుకునేందుకు విశ్లేషకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక రెండు కూటముల ఓట్లను సమానంగా చీల్చిన పక్షంలో విజయ్ పార్టీ కూడా భారీగా సీట్లు గెలుచుకోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో తమిళనాడులో ప్రజల నాడి ఎవరికీ చిక్కడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఎగ్జిట్ పోల్స్ కోసం ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానుండగా, ఈ నెల 29న ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తారు. దీంతో విజయ్ పార్టీ చీల్చే ఓట్లు.. తమిళనాడు పీఠం ఎక్కేది ఎవరో ఆ రోజే తేలిపోనుందని వ్యాఖ్యానిస్తున్నారు.
