డ్ర*గ్స్ వాడి తప్పు చేశానన్న సినీ నటుడు.. 14 రోజుల రిమాండ్
తమిళ సినీ నటుడు శ్రీరామ్ కృష్ణమాచారి డ్రగ్స్ కేసులో అరెస్టయి, న్యాయస్థానంలో తన తప్పును అంగీకరించిన ఘటన తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.
By: Tupaki Desk | 25 Jun 2025 11:34 AM ISTతమిళ సినీ నటుడు శ్రీరామ్ కృష్ణమాచారి డ్రగ్స్ కేసులో అరెస్టయి, న్యాయస్థానంలో తన తప్పును అంగీకరించిన ఘటన తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. డ్రగ్స్ ముఠా నుంచి కొకైన్ కొనుగోలు చేసిన కేసులో అతడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. దీంతో జూన్ 24న చెన్నై ఎగ్మోర్‌లోని 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జూలై 7, 2025 వరకూ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని నటుడు శ్రీరామ్ కు విధించింది.
-తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్న నటుడు
శ్రీరామ్ (శ్రీకాంత్ కృష్ణమాచారి) తెలుగు ప్రేక్షకులకు ‘ఒకరికి ఒకరు’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి చిత్రాల ద్వారా సుపరిచితుడే. అతడి నటనకు మంచి మార్కులే పడినా, వ్యక్తిగత జీవితంలో ఈ కేసు ద్వారా నిందితుడిగా మారడం తీవ్ర విచారకరం.
-డ్రగ్ సరఫరాదారుడితో సంబంధాలు
ఈ కేసులో ముందుగా అన్నాడీఎంకే ఐటీ విభాగ సభ్యుడు టి. ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు శ్రీరామ్‌కు డ్రగ్స్ సరఫరా చేసినట్టు నార్కోటిక్ పోలీసుల విచారణలో తేలింది. విచారణలో ప్రసాద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా శ్రీరామ్‌ను అరెస్ట్ చేసి విచారించారు.
- వైద్య పరీక్షల్లో మత్తు పదార్థాల ఉనికి
అరెస్టు అనంతరం శ్రీరామ్‌ను కిల్పాక్ మెడికల్ కాలేజీలో వైద్య పరీక్షలకు పంపించారు. అక్కడ తీసిన రక్త నమూనాల్లో మత్తు పదార్థాల ఉనికి ఉందని నార్కోటిక్ అధికారులు ధృవీకరించారు. దీనితో పాటు, నుంగంబాకం పోలీస్ స్టేషన్‌లో సుమారు 9 గంటల పాటు తీవ్రంగా విచారించినట్టు సమాచారం.
- కోర్టులో తప్పు అంగీకారం
న్యాయస్థానంలో హాజరు అయిన శ్రీరామ్, డ్రగ్స్ తీసుకున్న విషయం నిజమేనని అంగీకరించాడు. కోర్టు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఈ సంఘటన తమిళ సినీ పరిశ్రమతో పాటు తెలుగు పరిశ్రమలోనూ సంచలనం సృష్టించింది.
