'తల్లికి వందనం' అంటూ దోచేస్తున్నారు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఈ క్రమంలో... 'మీకు తల్లికి వందనం పడలేదా?.. మీ అకౌంట్ హోల్డ్ లో ఉంది.. దాన్ని తొలగించి డబ్బు వచ్చేలా చేస్తాం..' అంటూ సైబర్ నేరగాళ్లు పలువురు మహిళలను నమ్మిస్తున్నారు.
By: Tupaki Desk | 1 July 2025 11:32 AM ISTఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవల "తల్లికి వందనం" పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ సమయంలో బ్యాంక్ అకౌంట్ లో పడిన ఆ సొమ్ములు, సదరు తల్లుల చేతుల్లోకి వెళ్లడానికి పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో సైబర్ నేరగాళ్లూ ఎంట్రీ ఇచ్చారు.
అవును... తల్లికి వందనం సొమ్ములు విత్ డ్రా చేసుకుందామని బ్యాంకులకు వెళ్తే.. అప్పటికీ తల్లుల ఖాతాల్లో ఉన్న లోన్ లకు వాటిని జమ చేసుకున్నట్లు బ్యాంకు అధికారులు చెప్పి షాకిచ్చిన ఘటనలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో సమస్య తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... తాజాగా సైబర్ నేరగాళ్లు మహిళలకు ఫోన్ చేసి ఆ సొమ్ము కాజేస్తున్నారు!
ఈ క్రమంలో... 'మీకు తల్లికి వందనం పడలేదా?.. మీ అకౌంట్ హోల్డ్ లో ఉంది.. దాన్ని తొలగించి డబ్బు వచ్చేలా చేస్తాం..' అంటూ సైబర్ నేరగాళ్లు పలువురు మహిళలను నమ్మిస్తున్నారు. ఈ క్రమంలో వారి వ్యక్తిగత వివరాలు, బ్యాంకుకు సంబంధించిన సమాచారం తీసుకొని తల్లులను మోసం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడినవారు రోదిస్తున్నారు!
ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల మాయలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఇప్పటికే వారి బారిన పడి మోసపోయినట్లైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేయమని సూచిస్తున్నారు. ఏదైనా అనుమానం ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో సరైన వివరాల కోసం సంప్రదించాలని తెలిపారు!
తీసుకోవాల్సిన జాగ్రత్తలు!:
తెలియని వారి నుంచి వచ్చిన నైకిలీ లింకులపై క్లిక్ చేయకూడదు. ఎస్సెమ్మెస్, వాట్సప్ ద్వారా వచ్చిన సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు.
ప్రధానంగా... అధికరులమని ఫోన్ చేసి బ్యాంకు వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఓటీపీ వివరాలు ఎవరు అడిగినా చెప్పవద్దు.
బ్యాంకు సిబ్బంది కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పథకాల కోసం ఫోన్ చేసి ఓటీపీని అడగరనే విషయం గుర్తుంచుకోవడం మరవొద్దు.
