పాక్ ని వెక్కిరిస్తూ...భారత్ ని అక్కున చేర్చుకున్న తాలిబన్లు
ఈ రోజున అదే తాలిబన్లు తమ మీదకు దాడికి వస్తూంటే ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అంతే కాదు భారత్ కి వారు దగ్గర కావడం అసలు సహించలేకపోతోంది. అందరికీ 1999 ప్రాంతంలో కాందహార్ లో భారత్ విమానం హైజాక్ అయిన ఘటన గుర్తుండే ఉంటుంది.
By: Satya P | 8 July 2026 8:11 AM ISTకాలం ఎపుడూ ఒక్కలా ఉండదు, ఇది అందరి కంటే దాయాది పాకిస్థాన్ కి బాగా తెలియాలి. ఎందుకంటే తాలిబన్లను తమ చేతిలో పావులుగా మార్చి వాడుకుని ఒకనాడు తమాషాలు చేసింది. ఈ రోజున అదే తాలిబన్లు తమ మీదకు దాడికి వస్తూంటే ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అంతే కాదు భారత్ కి వారు దగ్గర కావడం అసలు సహించలేకపోతోంది. అందరికీ 1999 ప్రాంతంలో కాందహార్ లో భారత్ విమానం హైజాక్ అయిన ఘటన గుర్తుండే ఉంటుంది.
భారత్ ని టార్గెట్ చేస్తూ :
ఇప్పటికి దాదాపుగా మూడు దశాబ్దాల క్రితం 1999 డిసెంబర్ 24న నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని పాకిస్థాన్‌కు చెందిన హర్కతుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అమృత్‌సర్ లాహోర్ దుబాయ్ మీదుగా చివరికి అఫ్గానిస్థాన్‌లోని తాలిబాన్ల నియంత్రణలో ఉన్న కాందహార్‌కు ఆ విమానాన్ని తీసుకెళ్లారు. 190 మంది ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు గాను వాజ్ పేయి ప్రధానిగా ఉన్న నాటి ఎన్డీయే ప్రభుత్వం ముగ్గురు ప్రమాదకర ఉగ్రవాదులు మౌలానా మసూద్ అజార్, ముస్తాక్ అహ్మద్ జర్గర్, ఒమర్ సయీద్ షేక్ లను విడుదల చేయాల్సి వచ్చింది. దీనికి సూత్రధారి పాత్రధారి పాక్ అయితే తెర వెనక సాయం చేసింది పావుగా మార్చుకున్న తాలిబన్లు. అలా వారిని భారత్ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఉసిగొలిపి పాక్ ఆడిన ఈ ఉగ్ర క్రీడ భారతీయుల మదిలో ఇంకా ఉంది.
వెల్లి విరిసిన స్నేహం :
ఈ నేపథ్యంలో 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో ఏర్పడిన తాలిబన్ల ప్రభుత్వం ఆ తరువాత భారత్ తో దోస్తీ చేస్తూ వస్తోంది. భారత్ కూడా వ్యూహాత్మకంగా తాలిబన్ల పట్ల సానుకూలత వ్యక్తం చేస్తోంది. ఆ మధ్యన తాలిబన్ మంత్రి కూడా భారత్ కి వచ్చారు. అదే క్రమంలో పాకిస్థాన్ తో కూడా దూరం పాటిస్తూ వైరం పెంచుకుంటోంది. పాక్ నిజస్వరూపాన్ని తాలిబన్లు తెలుసుకునే ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా టుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తాలిబన్ సమాచార సాంస్కృతిక శాఖ మంత్రి ముహాజిర్ ఫరాహీ అంతర్జాతీయ సంబంధాల మీద కీలక వ్యాఖ్యలు చేశారు.
పాక్ కి హెచ్చరికలు :
తాలిబన్లు తమ దేశ అస్తిత్వం అలాగే తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఏ స్థాయి వరకైనా వెళతారని ఆయన స్పష్టం చేశారు. పాక్ తో తమకు దూరం పెరిగిందని అన్నారు. దానికి కారణం సరిహద్దులలో ఘర్షణలు అని చెప్పారు. ఇటీవల పాక్ చర్యలకు తాము బలమైన సమాధానం ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ఇక జూన్ చివరిలో ఆఫ్ఘన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్థాన్ అకస్మాత్తుగా వైమానిక దాడులు జరిపింది. ఇక ఈ దాడుల్లో 38 మంది ఆఫ్హన్ పౌరులు మరణించారని తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. అయితే తాము 29 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లుగా పాక్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో పాకిస్థాన్‌తో పెరుగుతున్న ఘర్షణలపై ఫరాహీ తీవ్రంగా స్పందించి ఆ దేశం విషయంలో ఎందాకైనా వెళ్తామని హెచ్చరించడం విశేషం.
భారత్ తో దోస్తీ :
అదే సమయంలో భారత్ తో దోస్తీకి తాలిబన్ మంత్రి పూర్తి అనుకూలతను ప్రదర్శించారు. భారత్‌తో తమకు చారిత్రక సంబంధాలు ఉన్నాయని ఫరాహీ గుర్తు చేసుకోవడం గమనార్హం. రెండు దేశాల మధ్య వాణిజ్యంతో పాటు ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడాలని కూడా ఆయన ఆకాంక్షించారు. అంతే కాదు తరచూ సరిహద్దులు మూసివేస్తున్న పాకిస్థాన్‌పై తాము ఆధారపడకుండా ఇరాన్, భారత్, చైనా ద్వారా వాణిజ్య మార్గాలను పెంచుకుంటామని ఆ విధంగా తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకుంటామని చెప్పారు. దాంతో భారత్ పట్ల తాలిబన్లు పూర్తిగా పాజిటివ్ గా స్పందించడం పాక్ కి మంట అని చెప్పక తప్పదు.
ట్రంప్ కోరిక తీరదు :
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలోనూ తాలిబన్ మంత్రి విమర్శలు చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో బగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తిరిగి తమ అధీనంలోకి తీసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బగ్రామ్ వైమానిక స్థావరాన్ని అమెరికా తిరిగి పొందడం అసాధ్యమని స్పష్టం చేశారు. 2021లో అమెరికా సేనలు ఆఫ్ఘాన్ ని విడిచి వెనక్కి వెళ్లాక బగ్రామ్ స్థావరం తాలిబన్ల ఆధీనంలోకి వచ్చింది. దాంతో దాని మీద ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల తాలిబన్లు మండిపడుతున్నారు. బగ్రామ్ ఎయిర్‌బేస్ అమెరికాకు ఎందుకు అంటే చైనాకు సమీపంలో ఉండడం, వ్యూహాత్మకంగా కీలకమైన స్థావరం కావడంతో దానిని అమెరికా తిరిగి పొందాలని ట్రంప్ పలుమార్లు ఇప్పటికి వ్యాఖ్యానించారు. దానిని తాలిబన్లు తిప్పికొడుతున్నారు. అంతే కాదు కాబుల్‌లో అమెరికాపై సాధించిన విజయానికి గుర్తుగా ఓ యుద్ధ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు కూడా తాలిబన్ మంత్రి చెప్పడం విశేషం.
