Begin typing your search above and press return to search.

ఏఐ బూమ్ భలే ఉంది సామీ.. చదువుకున్నోడికి ఉద్యోగం.. లేనోడికి ఫ్రీగా ముప్పై వేలు

ప్రపంచమంతా ఇప్పుడు ఒకటే జపం.. ‘ఏఐ.. ఏఐ.. ఏఐ’. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన ఉద్యోగాలు ఊడిపోతాయో.. లేక దాంతో చాట్ చేస్తూ కాలక్షేపం చేయవచ్చో తెలీదు కానీ తైవాన్ వాళ్లకు మాత్రం గట్టిగానే ‘క్యాష్ క్రెడిట్’ అయిపోయేలా ఉంది.

By:  A.N.Kumar   |   20 Aug 2026 10:43 AM IST
ఏఐ బూమ్ భలే ఉంది సామీ.. చదువుకున్నోడికి ఉద్యోగం.. లేనోడికి ఫ్రీగా ముప్పై వేలు
X

ప్రపంచమంతా ఇప్పుడు ఒకటే జపం.. ‘ఏఐ.. ఏఐ.. ఏఐ’. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన ఉద్యోగాలు ఊడిపోతాయో.. లేక దాంతో చాట్ చేస్తూ కాలక్షేపం చేయవచ్చో తెలీదు కానీ తైవాన్ వాళ్లకు మాత్రం గట్టిగానే ‘క్యాష్ క్రెడిట్’ అయిపోయేలా ఉంది. ఏఐ చిప్పులు, సెమీకండక్టర్లు అమ్మి అమ్మి అబ్బబ్బ.. ఖజానా నిండిపోయి డబ్బులు దాచడానికి చోటు లేక.. ఇప్పుడు తైవాన్ ప్రభుత్వం ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. “డబ్బులు ఎక్కువయ్యాయి నాయనా.. తీసుకెళ్లి పౌరుల ఖాతాల్లో పడేయండి” అని హుకుం జారీ చేసింది.

తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ టే గారు మైకు ముందుకు వచ్చి.. “మా దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి 10,000 న్యూ తైవాన్ డాలర్లు ఇస్తాం” అని ప్రకటించారు. అంటే మన భారతీయ రూపాయిల్లో అక్షరాలా రూ.30,000 అన్నమాట.. మన దగ్గర ఎన్నికల ముందు ఉచిత పథకాలు.. ఉచిత కరెంట్.. ఫ్రీ బస్సులు ఇస్తే “అయ్యో.. ఉచితాలు ఇచ్చి దేశాన్ని నాశనం చేస్తున్నారు..” అని కొందరు మేధావులు గగ్గోలు పెడుతుంటారు. కానీ తైవాన్ వాళ్లు ఇచ్చేసరికి దానికో పెద్ద పేరు పెట్టారు. అదేంటంటే.. “దేశ ఆర్థిక పురోగతిలో ప్రజలను భాగస్వాములను చేసే మహత్తర కార్యక్రమం” అట. ఉచితంగా ఇస్తే మన దగ్గర రాజకీయ లబ్ధి, అదే బయట దేశాల్లో ఇస్తే ఆర్థిక పంపిణీ.. భలే ఉంది కదా ఈ లోజిక్?

పాపం.. ఆ తైవాన్ సెమీకండక్టర్ కంపెనీలు రాత్రింబవళ్లు కష్టపడి ఏఐ సర్వర్లకు.. డేటా సెంటర్లకు చిప్పులు సరఫరా చేసి పిచ్చ పిచ్చగా సంపాదించేశాయి. ఇప్పుడు ఆ లాభాలను 2027 బడ్జెట్‌లో చేర్చి.. ‘తీసుకోండి బాబోయ్’ అని ప్రజల ముఖాన కొడుతున్నారు. పైగా ఈ డబ్బులు ఇచ్చి ఊరుకోరట.. యువత అంతా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ వైపు వెళ్లి మరింత మందిని ఈ చిప్పుల తయారీలో నెట్టాలట.

సాధారణంగా ఏఐ వస్తే ప్రపంచాన్ని ఏలేస్తుందని.. ఉద్యోగాలు తీసేస్తుందని భయపడ్డాం. కానీ తైవాన్‌ను చూస్తుంటే.. ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పొగుడుతుంటే చాలు... నెలకు లేదా బడ్జెట్‌కోసారి ప్రభుత్వమే ₹30 వేలు పడేసేలా ఉంది.

ఏది ఏమైనా కంప్యూటర్లు కోడింగ్ రాస్తుంటే.. దాని పుణ్యమా అని ప్రజల ఖాతాల్లో నోట్ల వర్షం కురవడం చూస్తుంటే.. “ఏఐ మహానుభావుడా.. త్వరలోనే మిగతా దేశాలకు కూడా నీ దయ చూపించు నాయనా..” అని కోరుకోవడం తప్ప మనం మాత్రం ఏం చేయగలం..