Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో కలకలం.. కల్తీ కల్లుతో 5 గురు మృతి.. బయటకు రానివెన్ని?

కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన హైదరాబాద్ వాసుల గురించి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 July 2025 9:54 AM IST
హైదరాబాద్ లో కలకలం.. కల్తీ కల్లుతో 5 గురు మృతి.. బయటకు రానివెన్ని?
X

కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన హైదరాబాద్ వాసుల గురించి తెలిసిందే. మంగళవారం రాత్రికి ఒకరు మరణించగా.. బుధవారం రాత్రికి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరుకోవటం ఆందోళనకు గురి చేస్తోంది. షాకింగ్ నిజం ఏమంటే.. ఈ మరణాలు రెండు రోజుల క్రితమే చోటు చేసుకున్నాయి. ఆసుపత్రుల్లో మరణించిన వారు ఇద్దరే. వీరి మరణాలకు కల్తీ కల్లు కారణమని అధికారులు అధికారికంగా ప్రకటించటం లేదు. అనారోగ్యంతో వారు మరణించినట్లు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆందోళన కలిగించే మరో అంశం ఏమంటే.. ఆసుపత్రుల్లో కాకుండా విడిగా మరో ముగ్గురు మరణించిన వైనం తాజాగా వెలుగు చూసింది.

అంతేకాదు.. అనారోగ్యంతో ఆసుపత్రులకు చేరినట్లుగా చెబుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం రాత్రికి బాధితుల సంఖ్య 15 ఉండగా.. బుధవారం నాటికి 31కు చేరుకుంది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. కల్తీ కల్లుకు సంబంధించి ఇప్పటివరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఇందులో బాలానగర్ లో ఐదు.. కేపీహెచ్ బీలో మూడు కేసులు నమోదయ్యాయి. ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.

మరో అంశం ఏమంటే..ఈ కల్లును అత్యంత పేదలు తాగుతుంటారు. రోజువారీ కూలీలు తక్కువ ధరకు కల్లు దొరుకుతుందని తాగుతారు. కానీ.. సహజ సిద్ధమైన కల్లు ఇప్పుడు దొరకని పరిస్థితి. దీంతో పలు రసాయనాలతో తయారు చేసే కల్లును తాగుతుంటారు. నిజానికి కేపీహెచ్ బీ.. బాలానగర్ తదితర ప్రాంతాల్లో కల్తీ కల్లుతాగి అస్వస్థతకు గురైన వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు నిదర్శనంగా నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో భారీగా చేరికలు ఉండటమే. అనారోగ్యానికి గురైన వారంతా హైదర్ నగర్.. ఇంద్రానగర్.. భాగ్యనగర్ తదితర ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లోనే కల్లు తాగారు.

బాధితుల్లో ఎక్కువ మంది తరచూ కల్లు తాగే వారే కావటంతో.. తాజాగా వారు అస్వస్థతకు గురైనప్పుడు సాధారణ కడుపు నొప్పిగా భావించారు. కాకుంటే.. రోటీన్ కు భిన్నంగా వాంతులు.. విరేచనాలు.. పొత్తికడుపులో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరికి మూత్ర విసర్జన చేయలేకపోవటంతో ఆందోళనతో తమకు దగ్గర్లోని ఆసుపత్రుల్లో చేర్చారు. ఇంకొంతమంది ఆసుపత్రికి తీసుకెళ్లే స్థోమత లేకపోవటంతో కూకట్ పల్లిలో ఉచిత వైద్య సేవలు అందించే రాందేవ్ ఆసుపత్రికి తీసుకురావటంతో కల్తీ కల్లు బాధితుల అంశం బయటకు వచ్చింది. అధికారులు మరింత లోతుగా విచారిస్తే.. ఈ కల్తీ కల్లుకు సంబంధించిన షాకింగ్ నిజాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.