Begin typing your search above and press return to search.

ప్రాచీన భార‌తీయ వ్యాయామం: ఎం.ఎస్.ధోని అండ‌తో స్టార్ట‌ప్ ప్ర‌భంజ‌నం!

వ్యవస్థాపకుడు రిషబ్ మల్హోత్రా ఒకప్పుడు `బ్యాక్టీరియల్ న్యూరిటిస్` బారిన పడి తన చేతికి 75 శాతం పక్షవాతం రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

By:  Sivaji Kontham   |   2 May 2026 4:00 PM IST
ప్రాచీన భార‌తీయ వ్యాయామం: ఎం.ఎస్.ధోని అండ‌తో స్టార్ట‌ప్ ప్ర‌భంజ‌నం!
X

ఇక్క‌డ `గ‌ద‌లు`, `మంచం కోళ్లు` క‌నిపిస్తున్నాయి... ప్రాచీన వ‌స్తువుల‌ను గాల్లోకి లేపుతూ యువ‌త విన్యాసాలు చేస్తున్నారు. అయితే ఇదంతా దేని కోసం? అనే సందేహం క‌ల‌గొచ్చు. ఇవి స‌రికొత్త వ్యాయామ విన్యాసాలు. 80ల‌లో మెగాస్టార్ చిరంజీవి, క‌మ‌ల్ హాస‌న్ లాంటి న‌టులు ఒక సాంప్ర‌దాయ‌ గ‌ద‌తో వ్యాయామాలు చేస్తున్న స‌న్నివేశం ఈ సంద‌ర్భంగా గుర్తుకు రావొచ్చు. అయితే ఇప్పుడు అదే ప్రాచీన విద్య కోట్ల రూపాయ‌ల క‌న‌క‌వ‌ర్షం కురిపిస్తోంది.

సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు నగరంలో ఒక సరికొత్త ఫిట్‌నెస్ విప్లవం మొదలైంది. గ్రామీణ అఖాడాలకే పరిమితమైన గద, ముద్గర్ వంటి ప్రాచీన భారతీయ వ్యాయామ పరికరాలను ఆధునిక జిమ్ సంస్కృతిలోకి తీసుకువస్తూ `తగ్డా రహో` అనే స్టార్టప్ సంచలనం సృష్టిస్తోంది. సంప్రదాయ బలాన్ని శాస్త్రీయ పద్ధతులతో మేళవించి.. పట్టణ ప్రాంత వాసులకు ఈ సంస్థ అందిస్తున్న శిక్షణ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వినూత్న ప్రయత్నాన్ని గుర్తించిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ ఇందులో పెట్టుబడులు పెట్టడమే కాకుండా బ్రాండ్‌కు వెన్నుముకగా నిలిచారు.

ఈ స్టార్టప్ వెనుక ఒక స్పూర్తిదాయకమైన కథ ఉంది. వ్యవస్థాపకుడు రిషబ్ మల్హోత్రా ఒకప్పుడు `బ్యాక్టీరియల్ న్యూరిటిస్` బారిన పడి తన చేతికి 75 శాతం పక్షవాతం రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆధునిక వైద్యం చేతులెత్తేసిన తరుణంలో.. ప్రాచీన భారతీయ వ్యాయామాలైన గద - ముద్గర్‌లను ఉపయోగించి ఆయన తన చేతికి తిరిగి జీవం పోసుకున్నారు. ఆ వ్యక్తిగత విషాదం నుండి పుట్టిన పట్టుదలే ఈరోజు `తగ్డా రహో` స్థాపనకు పునాది వేసింది. నేడు ఈ సంస్థ కేవలం సామాన్యులకే కాకుండా.. భారత సైన్యంలోని ప్రతిష్టాత్మక `పారా స్పెషల్ ఫోర్సెస్` సైనికులకు కూడా శిక్షణ ఇస్తుండటం విశేషం.

సాధారణ జిమ్ పరికరాలైన డంబెల్స్ వంటి వాటితో పోలిస్తే గద వ్యాయామం చాలా భిన్నమైనది. ఇందులో `ఆఫ్-సెంటర్ లోడింగ్` అనే సూత్రం పనిచేస్తుంది. అంటే బరువు ఒకే చోట స్థిరంగా ఉండకుండా.. స్వింగ్ చేసేటప్పుడు శరీరాన్ని వివిధ దిశల్లోకి లాగుతుంది. దీనివల్ల శరీరం కేవలం ఒక కండరాన్ని మాత్రమే కాకుండా.. పట్టు, వెన్నెముక, కటి భాగాలను ఏకకాలంలో నియంత్రించడం నేర్చుకుంటుంది. దీనినే రిషబ్ `బుల్లెట్ ప్రూఫింగ్` అని పిలుస్తారు. అంటే శరీరంలోని కీళ్లు - భుజాలను గాయాల బారిన పడకుండా ఇనుప కవచంలా మార్చడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశ్యం.

తగ్డా రహో శిక్షణా విధానం ఎంతో పారదర్శకంగా.. సునాయాసంగా కూడా ఉంటుంది. ప్రతి సెషన్ సుమారు 60 నుండి 70 నిమిషాల పాటు సాగుతుంది. ఇందులో బాడీ వెయిట్ వ్యాయామాలతో పాటు గద, సంతోల వంటి పరికరాలను ఉపయోగిస్తారు. ప‌రిమిత‌ సభ్యత్వ రుసుముతో శిక్షణ ప్ల‌స్ ఫిజియోథెరపీ సపోర్ట్ కూడా లభిస్తుంది. కోచ్, ఫిజియోథెరపిస్ట్ ఇద్దరూ ఒకే వ్యవస్థలో ఉండటం వల్ల సభ్యుల శారీరక ఇబ్బందులను గమనిస్తూ తగిన వ్యాయామాలను సూచిస్తారు. ఈ క్రమశిక్షణ వల్లే 30 ఏళ్లు దాటిన వారిలో దాదాపు 75 శాతం మంది సభ్యులు ఈ పద్ధతికే కట్టుబడి ఉంటున్నారని త‌గ్డా ర‌హో నిపుణులు చెబుతున్నారు.

కేవలం యువతకే కాకుండా 74 ఏళ్ల వృద్ధుల వరకు అందరినీ ఆకట్టుకుంటున్న ఈ విధానం.. భారతీయ శారీరక సంస్కృతి గొప్పతనాన్ని చాటి చెబుతోంది. అధిక తీవ్రత కలిగిన విదేశీ వ్యాయామాల కంటే.. శ్వాస- లయతో కూడిన భారతీయ పద్ధతులు దీర్ఘకాలిక ఆరోగ్యానికి మేలు చేస్తాయని రిషబ్ నమ్ముతారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం `మన్ కీ బాత్`లో ఈ స్టార్టప్‌ను ప్రశంసించడంతో... భారతీయ అఖాడా పద్ధతులు మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. కేవలం ఇతరులలా కనిపించడం కోసం కాకుండా... అంతర్గత బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ ఫిట్‌నెస్ విప్లవం కొనసాగుతోంది.