తాడిపత్రిలో తేల్చుకుందాం రా..! పెద్దారెడ్డికి జేసీ సవాల్
సోలార్ ఫ్యాక్టరీకి రైతులిచ్చిన భూములను బలవంతంగా లాక్కున్నారని మండిపడిన జేసీ, గతంలో ఈ భూమిలో అడుగుపెడితే తనను ఊరంతా తిప్పికొడతానని హెచ్చరించిన మాటలను గుర్తు చేశారు.
By: Tupaki Desk | 14 May 2025 6:36 PM ISTఅనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, సిట్టింగు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉండగా, తాజాగా మరోసారి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తండ్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దూకుడుతో తాడిపత్రిలో హైటెన్షన్ ఏర్పడిందని కథనాలు వస్తున్నాయి.
వైసీసీ ప్రభుత్వ అధికారంలో ఉండగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దౌర్జన్యంగా ప్రభుత్వ భూములు కబ్జా చేశారని ఆరోపిస్తున్న టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ భూముల్లో తన వారిని పంపి దమ్ముంటే పెద్దారెడ్డి రావాలంటూ సవాల్ విసరడం హీట్ పుట్టిస్తోంది. "నీవు ఆక్రమించిన భూముల్లో మా వాళ్లు అడుగు పెట్టారు. నీ ఫెన్సింగు పీకి పారేశారు. దమ్ముంటే వచ్చి నన్ను కొట్టు"అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చాలెంజ్ చేస్తున్నారు.
సోలార్ ఫ్యాక్టరీకి రైతులిచ్చిన భూములను బలవంతంగా లాక్కున్నారని మండిపడిన జేసీ, గతంలో ఈ భూమిలో అడుగుపెడితే తనను ఊరంతా తిప్పికొడతానని హెచ్చరించిన మాటలను గుర్తు చేశారు. ఇప్పుడు నీ భూమిలో నా వాళ్లు అడుగు పెట్టారు వచ్చి కొడతావా? అంటూ హెచ్చరించారు. "దేవుడి సొమ్ము తిన్నావు, భూములను ఆక్రమించుకున్నావు. ఈ రోజు నువ్వు తాడిపత్రి వదిలి సంవత్సరం అయిందని ప్రజలు పండగ చేసుకున్నారు. గతంలో సారా అమ్మిన చరిత్ర నీది" అంటూ మాజీ ఎమ్మెల్యేపై జేసీ ఫైర్ అయ్యారు.
ఈ సంఘటనతో తాడిపత్రి రాజకీయాల్లో వేడి ఏ మాత్రం తగ్గలేదని మరోసారి వెల్లడైంది. తాడిపత్రిలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి వర్గాల మధ్య ఉప్పు-నిప్పులా పరిస్థితి కొనసాగుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా, జేసీ ఇంట్లోకి వెళ్లి ఆయన కుర్చీలో కూర్చొని సవాల్ విసిరిన పెద్దారెడ్డి ఎన్నికల అనంతరం తాడిపత్రిలో కాలు కూడా మోపలేని పరిస్థితిలో నిస్సహాయంగా మిగిలిపోయారు. ఆయన తాడిపత్రి వస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అనుమతించడం లేదు. ఈ పరిస్థితుల్లో పెద్దారెడ్డి అనుచరులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎదురేలేకుండా పోయింది. ఆయన మాటే వేదవాక్కులా పాలన సాగుతుండటం, ప్రత్యర్థులను వెంటాడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందా? అనే టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
