తాడిపత్రిలో 'తకధిమితోం'.. ఎవరూ తక్కువకాదు!
ఏపీలో కొన్నికొన్ని నియోజకవర్గాల పేర్లు చెబితే.. వాటి చరిత్ర చెప్పేయొచ్చు. అలాంటివాటిలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం ఒకటి.
By: Tupaki Desk | 1 July 2025 9:00 AM ISTఏపీలో కొన్నికొన్ని నియోజకవర్గాల పేర్లు చెబితే.. వాటి చరిత్ర చెప్పేయొచ్చు. అలాంటివాటిలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం ఒకటి. ఇక్కడి రాజకీయ సెగలు.. పొగలు.. కాక అందరికీ తెలిసిందే. ఎవరు గెలిస్తే.. వారిదే ఈ తాడిపత్రి సామ్రాజ్యం. ఎవరు అధికారంలో ఉంటే వారిదే ఆధిపత్యం. ఇదీ.. తాడిపత్రి నియోజకవర్గం పరిస్థితి. కానీ, ఎవరికి వారు మాత్రం.. తాము అమాయకులం.. శాంతిభద్రతలను కాపాడేందుకు కంకణం కట్టుకున్నామనే చిలకపలుకులు పలుకుతారు. కానీ, వాస్తవం మాత్రం ఎవరికి వారే పండితులు!.
దాదాపు 35 ఏళ్లపాటు తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యేగావిజయం దక్కించుకున్నారు. కాంగ్రెస్ సహా స్వతంత్రంగా కూడా ఆయన గెలిచారు. ఆ తర్వాత.. 2014లో తొలిసారి జేసీ ప్రభాకర్‌రెడ్డి(ప్రస్తుతంతాడిపత్రి మునిసిపల్ చైర్మన్) విజయం సాధించారు. అన్నదమ్ముల ఇరువురి ఏలుబడి కూడా.. అనేక వివాదాలకు కేంద్రమే. సొంత పార్టీ నాయకులనే నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వని పరిస్థితి. వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఏకంగా రాజకీయాలు చేయలేని పరిస్థితిని తీసుకువచ్చారు. అయితే.. మారుతున్న కాలాని అనుగుణంగా మార్పులు తప్పవు. కానీ, తాడిపత్రి మాత్రం రగులుతున్న అగ్ని పర్వతమే!.
ఇక, 2019లో ఇక్కడ తొలిసారి వైసీపీ విజయం దక్కించుకుంది. దీనిని ఎవరూ ఊహించలేదు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తొలిసారి గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఆయన మాత్రం తక్కువ తిన్నారా? నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి బెదిరింపులు, దాడులకు పాల్పడ్డారు. దమ్ముంటే.. నియోజకవర్గానికి రా! అంటూ.. సవాళ్లు విసిరారు. అంతేకాదు.. జేసీ వర్గంపైనా కేసులు పెట్టించారు. సో.. ఎవరూ ఎవరికీ తీసుపోలేదు. నాడు పెద్దారెడ్డి ఉన్నా.. నేడు జేసీ అస్మిత్‌రెడ్డి ఉన్నా.. తాడిపత్రి రాజకీయం ఎప్పుడు ``తకథిమితోం!`` అనాల్సిందే.
తాజాగా పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి రానిచ్చేది లేదని జేసీ తేల్చి చెప్పారు. కానీ, తమకు హైకోర్టు తీర్పు అనుకూలంగా ఉందని..తమను ఎలా అడ్డుకుంటారని కేతిరెడ్డి చెబుతున్నారు. మొత్తంగా ఈ పరిణామంతో అటు పోలీసులు.. ఇటు ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. ప్రజల కోసం.. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు పంతాలు, కక్షలు, కార్పణ్యాలకు పోయి.. నియోజకవర్గంపై దృష్టి పెట్టకపోతే.. ఎలా? అనేది ప్రశ్న. ఇక, ప్రజలు కూడా ఇలాంటివారిని ఎన్నికల్లో గెలిపించకుండా ఉంటే బెటర్ అని పరిశీలకులు చెబుతున్నారు.
