నాడు జేసీ ఇంట్లో తిష్ట...నేడు సొంత ఇంటికే రాలేని అవస్థ !
వైసీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పెద్దగా చదువుకోలేదని చెబుతారు. అయితే ఆయన మార్క్ రాజకీయం అక్కడ ఉంటుంది.
By: Tupaki Desk | 30 Jun 2025 12:33 AM ISTవైసీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పెద్దగా చదువుకోలేదని చెబుతారు. అయితే ఆయన మార్క్ రాజకీయం అక్కడ ఉంటుంది. తాడిపత్రిలో పెద్దారెడ్డి తన ప్రతాపం చూపించి 2019లో జేసీ బ్రదర్స్ మీదనే గెలిచారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి మీద గెలిచారు.
అలా అయిదేళ్ల పాటు తన రాజకీయ దూకుడు చూపించారు. ఒక సందర్భంలో అయితే ఆయన ఏకంగా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికే వెళ్ళి చాలా సేపు కూర్చుకున్నారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు.
ఈ ఘటన 2020 డిసెంబర్ 24న జరిగింది. తన మీద సోషల్ మీడియాలో అనుచితమైన వ్యాఖ్యలు చేయిస్తున్నారు అని ఆగ్రహించిన పెద్దారెడ్డి తన అనుచరులను వెంటబెట్టుకుని మరీ జేసీ ఇంటికి సడెన్ గా వెళ్ళారు. ఆయనను నేరుగా నిలదీయాలనే వెళ్ళారు. అయితే జేసీ ప్రభాకరరెడ్డి లేకపోవడంతో అతి పెద్ద రాజకీయ దుమారం అలా ఆగింది.
అయితే దాని మీద జేసీ ప్రభాకరరెడ్డి తీవ్రంగా విమర్శించారు. తన ఇంటికి వెళ్ళి పెద్దారెడ్డి హల్ చల్ చేస్తారా అని ఆగ్రహంగా ఊగిపోయారు. ఇలా పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా అయిదేళ్ల పాటు దూకుడే చేశారు. జేసీ వర్సెస్ పెద్దారెడ్డి గానే రాజకీయం సాగింది. ఇక చూస్తే 2024 ఎన్నికల్లో పెద్దారెడ్డి జేసీ అస్మిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలు అయ్యారు.
ఆనాటి నుంచి సుమారు పదమూడు నెలలుగా ఆయన తన సొంత ఇంటికి రాలేని పరిస్థితి ఉంది. గతంలో తాను చాన్స్ తీసుకుని జేసీ ఫ్యామిలీని కట్టడి చేసిన ఫలితాన్ని ఇపుడు పెద్దారెడ్డి చూస్తున్నారు అని అంటున్నారు. ఇపుడు జేసీదే రాజ్యంగా తాడిపత్రిలో ఉంది. ఆయన కుమారుడు ఎమ్మెల్యే జేసీ మున్సిపల్ చైర్మన్. ఏపీలో కూటమి పాలన సాగుతోంది.
దాంతో జేసీకి ఎదురు లేకుండా పోయింది. తన సొంత ఇంటికే తనను వెళ్ళనీయరా అని పెద్దారెడ్డి ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో ఆయన తాజాగా హైకోర్టు నుంచి కూడా అనుమతి తీసుకుని వచ్చాను అని తాడిపత్రిలో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన తన ఇంటికి చేరిన వెంటనే తాడిపత్రి పోలీసులు వచ్చి అక్కడిక్కడ అరెస్ట్ చేశారు. ఆ వెంటనే ఆయన్ని అనంతపురం తరలించారు.
తాడిపత్రి రావద్దు అని ఆంక్షలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. దీని మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పెద్దా రెడ్డి అన్నీ మీ రోజులే కావు జేసీ అని హెచ్చరిస్తున్నారు ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా స్ట్రాంగ్ గా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా అంతా ఒక్క తీరుగా ఉంటే తాడిపత్రి రాజకీయం మాత్రం ఓవర్ హీట్ తో సాగుతోంది. పెద్దారెడ్డి తన ఇంటి ముఖం చూడక ఏడాది పై దాటుతోంది. నా ఇంటికి నేను వెళ్తే అభ్యంతరం ఏమిటి అని పెద్దారెడ్డి ప్రశ్నిస్తున్నారు. కానీ లా అండ్ ఆర్డర్ వల్లనే ఈ పరిస్థితి అని పోలీసులు చెబుతున్నారు.
ఒక మాజీ ఎమ్మెల్యేగా తన ఇంటికి తన నియోజకవర్గానికి ఎందుకు దూరం పెడతారు అని పెద్దారెడ్డి అంటున్నారు. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో ఓటమి చెందవచ్చు కానీ తన ఇంటికీ ఊరికీ దూరంగా ఉండడం అన్నది ఎక్కడా జరగలేదు. కానీ తాడిపత్రి పొలిటికల్ సీన్ వేరుగా ఉంటుంది. పెద్దారెడ్డి వర్సెస్ జేసీలుగా రాజకీయం సాగుతూండడం వల్లనే ఇపుడు ఈ పరిస్థితి అని అంటున్నారు. ఎంత పోరాడినా ఎంతలా ప్రయత్నం చేసినా పెద్దారెడ్డి తన ఇంటికి రాలేకపోతున్నారు.
ఎప్పటికి ఆయన తన ఊరుకి ఇంటికి వస్తారు అంటే తెలియదనే అంటున్నారు. మరో నాలుగేళ్ళు ఇలాగేనా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఆనాడు జేసీ ఫ్యామిలీతో నిత్య వివాదాలు పెంచుకోవడం వల్లనే ఈ రోజు పెద్దారెడ్డి తన సొంత ఇంటి గడప తొక్కలేకపోతున్నారు అని విశ్లేషించేవారూ ఉన్నారు.
