పెద్దారెడ్డికి నో ఎంట్రీ.. మళ్లీ తాడిపత్రిలో అదే హైడ్రామా!
తాడిపత్రిలో టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య నువ్వా-నేనా అన్నట్లు రాజకీయం సాగుతోంది.
By: Tupaki Desk | 12 Sept 2025 5:20 PM ISTతాడిపత్రి రాజకీయాలు మళ్లీ మొదటికి వచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పుతో 16 నెలల తర్వాత తాడిపత్రిలోని తన సొంత ఇంటికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మళ్లీ పట్టణంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఈ నెల 6న భారీ బందోబస్తు మధ్య తాడిపత్రికి వచ్చిన పెద్దారెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భద్రత కల్పించలేమని పోలీసులు వెనక్కి పంపారు. 11వ తేదీ తర్వాత మళ్లీ తాడిపత్రి రావాల్సిందిగా అప్పట్లో సూచించారు. పోలీసుల సూచనల మేరకు ఆ రోజు తాడిపత్రి వదిలి తన స్వగ్రామం తిమ్మంపల్లి వెళ్లిన పెద్దారెడ్డి నేడు మళ్లీ తాడిపత్రి ఇంటికి వచ్చేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశమవుతోంది.
తాడిపత్రిలో టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య నువ్వా-నేనా అన్నట్లు రాజకీయం సాగుతోంది. ప్రధానంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ హవా ఎక్కువైంది. దీంతో ఎన్నికల సమయంలో పట్టణ బహిష్కరణ ఎదుర్కొన్న మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తిరిగి తాడిపత్రి రాలేకపోయారు. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఆయన వారం రోజుల క్రితం తాడిపత్రిలో అడుగు పెట్టినా అది మామూలు ముచ్చటగానే మిగిలిపోయింది.
సుప్రీం ఆదేశాల ప్రకారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి పోలీసులు భద్రత కల్పించారు. ఈ నెల 6న ఆయన తాడిపత్రి రాగా, ఎస్పీ జగదీష్ పర్యవేక్షణలో సుమారు 650 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయితే పదో తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి భద్రత కోసం వినియోగించిన పోలీసులను సీఎం బందోబస్తు విధులకు వాడుకోవాల్సి ఉండటంతో 10వ తేదీ వరకు తాడిపత్రి నుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు మాజీ ఎమ్మెల్యేను ఆదేశించారు.
ఇక పోలీసుల సూచనల మేరకు పెద్దారెడ్డి పట్టణం వీడి వెళ్లిపోగా, ఈ రోజు మళ్లీ వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఇదే సమయంలో మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఆయన ఇంటిని నిర్మించారనే ఫిర్యాదుపై మున్సిపల్ అధికారులు మాజీ ఎమ్మెల్యే ఇంటికి కొలతలు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉంటే వివాదం చెలరేగుతుందనే ఉద్దేశంతో పోలీసులు ఆయనను స్వగ్రామం తిమ్మంపల్లి దాటకుండా అడ్డుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశించినా తనను అడ్డుకోవడంపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఇంటిని ఇప్పటికే ఒకసారి మున్సిపల్ అధికారులు పరిశీలించి కొలతలు వేయగా, ఈ రోజు కూడా అదే పని చేయడంతో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ స్థలంలో ఆక్రమణల తొలగింపు పేరుతో కేతిరెడ్డి ఇంటిపై చర్యలు తీసుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పెద్దారెడ్డిని రానీయకపోవడం, ఆయన ఇంటి వద్ద మున్సిపల్ సిబ్బంది కొలతలు తీసుకోవడంతో వైసీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
