తాడిపత్రిపై బాబు ఫోకస్.. ఏం చేస్తారు?
అయితే.. జేసీ వస్తారా? చంద్రబాబు చెప్పినట్టు వింటారా? అంటే.. గతంలో ఫ్లైయాష్ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జేసీకి మధ్య వివాదం వచ్చినప్పుడు.
By: Tupaki Desk | 31 Aug 2025 1:28 PM ISTఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు నిరంతరం సలసల మంటూనే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య రాజకీయాలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వబోనని జేసీ ప్రకటించడం.. అధికార యంత్రాంగం కూడా ఆయనకు సహకరించిందన్న విమర్శలు రావడం తెలిసిందే. అయితే.. పెద్దారెడ్డి కోర్టును ఆశ్రయించి.. రిలీఫ్ తెచ్చుకున్నారు.
ఏకంగా సుప్రీంకోర్టే ఇప్పుడు పెద్దారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నియోజకవర్గంలో పర్యటించడంతోపాటు.. తన ఇంటికి కూడా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దీనికి గతంలో హైకోర్టు సమయం విధించగా.. ఇప్పు డు సుప్రీంకోర్టు సమయం కూడా పెట్టలేదు. భద్రతకు అయ్యే ఖర్చు పెట్టుకోవాలని మాత్రమే సూచించిం ది. దీంతో పెద్దారెడ్డి త్వరలోనే నియోజకవర్గంలో తిష్ఠవేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు పెద్దారెడ్డిని ఎలాగైనా ఎదుర్కొనేందుకు జేసీ తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.
ఇదిలావుంటే.. ఇప్పుడు ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. కోర్టులకు వరకు విషయం వెళ్లడం.. నియోజకవర్గంలో ప్రజల నుంచి అదేవిధంగా జేసీని వ్యతిరేకించే టీడీపీ వర్గం నుంచి కూడా.. ఆయనకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. నియోజకవర్గంలో పరిస్థితిని సరిదిద్దాలని అభ్యర్థనలు పంపుతున్నారు. ఈ పరిణామాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు జేసీ ప్రభాకర్‌రెడ్డిని అమరావతికి పిలిచి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. తద్వారా నియోజకవర్గంలో పరిస్థితిని సరిదిద్దాలన్నది ఆయన ఆలోచనగా ఉంది.
అయితే.. జేసీ వస్తారా? చంద్రబాబు చెప్పినట్టు వింటారా? అంటే.. గతంలో ఫ్లైయాష్ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జేసీకి మధ్య వివాదం వచ్చినప్పుడు.. చంద్రబాబు జోక్యం చేసుకుని ఇరువురిని అమరావతికి ఆహ్వానించారు. అయితే.. ఆదినారాయణ రెడ్డి వచ్చారే తప్ప.. జేసీ రాలేదు. ఇప్పటి వరకు.. జేసీ చంద్రబాబును కలవలేదు. ఇక, ఇప్పుడు వస్తారా? చర్చిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. కానీ, నియోజకవర్గంలో ఇలా వివాదాలు పెంచుకుంటూపోతే.. అది పార్టీకి నష్టమన్నది.. నాయకులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
