జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. మళ్లీ రగడ!
ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం రాజకీయాలు.. ఉప్పు-నిప్పు మాదిరిగా తయారయ్యాయి.
By: Tupaki Desk | 26 July 2025 10:20 AM ISTఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం రాజకీయాలు.. ఉప్పు-నిప్పు మాదిరిగా తయారయ్యాయి. వైసీపీ నాయ కుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి, టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య వివాదాలు ఎక్కడా చల్లారడం లేదు. నిన్న మొన్నటి వరకు జేసీ ప్రభాకర్‌రెడ్డి దూకుడు ప్రదర్శించారు. పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వబో నన్నారు. ఇదేసమయంలో ఆయనకు అనుకూలంగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని కూడా నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో జేసీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
ఇక, ఇప్పుడు పెద్దారెడ్డి వంతు వచ్చింది. జేసీపైనా ఆయన కుటుంబంపై విమర్శలు గుప్పించారు. జేసీ కుటుంబం అక్రమాలు, అన్యాయాలు చేసిందని.. అందుకే వైసీపీ హయాంలో కేసులు పెట్టామని పెద్దారెడ్డి చెప్పారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. దమ్ముంటే జేసీ వాటిని సవాల్ చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను అక్రమంగా తక్కువకు కొనుగోలు చేసి.. వాటిని ఇతర రాష్ట్రాల్లో తిప్పేందుకు కొనుగోలు చేశారని అన్నారు. ఇది నిజంకాదా? అని ప్రశ్నించారు. ఇలా.. 100కు పైగా వాహనాలు కొనుగోలు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారన్నారు.
జేసీ ట్రావెల్స్‌లో ఆయన కుమారుడు కూడా భాగస్వామిగా ఉన్నారని.. అందుకే అతని పైనా(ప్రస్తుత ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి) కేసు నమోదు చేశామన్నారు. ఇవన్నీ.. చట్టబద్ధంగా జరిగినవేనని పెద్దారెడ్డి చెప్పారు. ఈ విషయంలో నిజాయితీ నిరూపించుకోవాల ని సవాల్ రువ్వారు. జేసీ కుటుంబాన్నితాను ఎప్పుడూ బూతులు తిట్టలేదన్న పెద్దారెడ్డి.. ఒకవేళ తిట్టానని జేసీ భార్య ఉమ చెబితే.. తాను బహిరంగ క్షమాఫణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. లేనిపోనివి తనపై పెట్టి నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని మరిచిపోవద్దని హెచ్చరించారు. పోలీసులను అవినీతి పరులు అంటూ.. వ్యాఖ్యానించారని.. ఆ సొమ్ము జేసీకే చేరిందని చెప్పారు. అందుకేపోలీసులు ఆయన చెప్పినట్టు వింటున్నారని విమర్శించారు.
