విదేశాల్లో ఇండియన్స్ బిహేవియర్‌పై స్విస్ హోటల్ వార్నింగ్!
స్విట్జర్లాండ్‌లోని గస్టాడ్ నగరంలో ఉన్న ఒక ఫేమస్ హోటల్, ప్రత్యేకంగా ఇండియా నుండి వచ్చే పర్యాటకుల కోసం ఒక నోటీస్ బోర్డు పెట్టింది.
By: Madhu Reddy | 2 Jun 2026 2:09 PM ISTమనవాళ్లు విదేశాలకు వెళ్తే అక్కడ కూడా మన ‘దేశీ స్టైల్’ చూపిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారా? కొందరి ప్రవర్తన వల్ల విదేశాల్లో భారతీయులందరికీ బ్యాడ్ నేమ్ వస్తోందా? అంటే.. అవుననే అంటోంది స్విట్జర్లాండ్‌లోని ఒక హోటల్. రీసెంట్‌గా ఒక స్విస్ హోటల్ ఏకంగా ఇండియన్ టూరిస్టుల కోసమే ప్రత్యేకంగా రూల్స్ బోర్డు పెట్టి గట్టి వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపైనే పెద్ద చర్చ నడుస్తోంది. అసలు ఆ హోటల్ ఏమంది? మనవాళ్లు అక్కడ ఏం చేశారు?
స్విస్ హోటల్ స్పెషల్ రూల్స్:
స్విట్జర్లాండ్‌లోని గస్టాడ్ నగరంలో ఉన్న ఒక ఫేమస్ హోటల్, ప్రత్యేకంగా ఇండియా నుండి వచ్చే పర్యాటకుల కోసం ఒక నోటీస్ బోర్డు పెట్టింది. "డియర్ గెస్ట్స్ ఫ్రమ్ ఇండియా" అంటూ మొదలుపెట్టి.. బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర ఎలా ఉండాలి, కారిడార్లలో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలపై కొన్ని కండిషన్స్ పెట్టింది.
బఫే దగ్గర ఆ పనులు వద్దు:
ఈ హోటల్ పెట్టిన రూల్స్ చూస్తే మనవాళ్లు అక్కడ ఎలాంటి పనులు చేస్తున్నారో అర్థమవుతుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ బఫేలో పెట్టే ఫుడ్ అక్కడే తినాలని, రూమ్‌లకి గానీ, బయట విహారయాత్రలకు గానీ పట్టుకెళ్లకూడదని హోటల్ స్పష్టం చేసింది. కావాలంటే విడిగా డబ్బులు ఇచ్చి లంచ్ బాక్స్ ప్యాక్ చేయించుకోవాలని చెప్పింది. అలాగే, ఫుడ్ వడ్డించుకునేటప్పుడు అక్కడ పెట్టిన చెంచాలనే వాడాలని, మిగతా పర్యాటకులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని గుర్తుచేసింది.
ప్లేట్ షేరింగ్ చేస్తే ఫైన్:
సాధారణంగా మన దేశంలో ఒక ప్లేట్ భోజనాన్ని ఇద్దరు, ముగ్గురు పంచుకుని తినడం కామనే. కానీ ఈ స్విస్ హోటల్ మాత్రం దానికి నో చెప్పింది. హోటల్ రెస్టారెంట్‌లో ఒక డిష్‌ను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది షేర్ చేసుకుంటే.. అదనంగా ఉన్న ప్రతి వ్యక్తికి 5 స్విస్ ఫ్రాంకులు (CHF 5) సర్వీస్ మరియు ప్లేట్ ఛార్జ్ కింద వసూలు చేస్తామని బోర్డు పెట్టింది. అలాగే ఎక్స్‌ట్రా డ్రింక్ కోసం 1 స్విస్ ఫ్రాంక్ కట్టాలని కండిషన్ పెట్టింది.
గట్టిగా మాట్లాడకండి ప్లీజ్:
హోటల్ కారిడార్లు, బాల్కనీల్లో గట్టిగట్టిగా మాట్లాడి మిగతా రూమ్‌ల వారికి డిస్టర్బెన్స్ కలిగించవద్దని హోటల్ మేనేజ్‌మెంట్ కోరింది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులు ప్రశాంతతను కోరుకుంటారని, కాబట్టి సైలెన్స్ పాటించాలని సున్నితంగానే వార్నింగ్ ఇచ్చింది.
షాక్‌లో బిజినెస్‌మెన్ హర్ష్ గోయెంకా:
భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఈ నోటీసును స్వయంగా చూసి షాక్ అయ్యారు. ఈ ఫోటోను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశీ రెస్టారెంట్లలో గర్బా డాన్సులు చేయడం, ఎయిర్‌పోర్టుల్లో బిగ్గరగా అరవడం, ఫ్లైట్ క్యాబిన్‌లను పిక్నిక్ స్పాట్‌లుగా మార్చేయడం లాంటి మనవాళ్ల ప్రవర్తనే ఇలాంటి నోటీసులకు కారణమని ఆయన ఆవేదన చెందారు.
ఇక దావోస్‌లో ఒక ఇండియన్ బిజినెస్‌మెన్ క్లబ్‌లో పంజాబీ పాటలను ఊరంతా వినబడేలా పెట్టాడని గుర్తుచేస్తూ.. జపాన్ దేశస్థులలాగా మనం కూడా పద్ధతిగా ప్రవర్తించి గౌరవం సంపాదించుకోవాలని హితవు పలికారు.
డబ్బులు ఉన్నాయి కదా అని విదేశాల్లో ఎలా పడితే అలా ప్రవర్తిస్తే దేశం పరువు పోతుందని ఈ ఘటన నిరూపించింది. మనం ఎక్కడికి వెళ్లినా అక్కడి పద్ధతులను గౌరవించడం, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా ముఖ్యం. 'అతిథి దేవోభవ' అని నమ్మే మనం, విదేశాలకు గెస్ట్‌లుగా వెళ్లినప్పుడు కూడా అంతే హుందాగా ఉండాలని ఆశిద్దాం.
