Begin typing your search above and press return to search.

ఎద బరువు మోస్తుంది.. కన్నీళ్లు పెట్టిస్తున్న యాంకర్ స్వేచ్ఛ కవిత

స్వేచ్ఛ రాసిన ఈ కవిత "ఉండకుండా పోకు" అనే శీర్షికతో ఇటీవల ఒక మ్యాగజైన్‌లో ప్రచురితమైంది.

By:  Tupaki Desk   |   28 Jun 2025 4:32 PM IST
ఎద బరువు మోస్తుంది.. కన్నీళ్లు పెట్టిస్తున్న యాంకర్ స్వేచ్ఛ కవిత
X

వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న న్యూస్ చానెల్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ రాసిన "ఎద బరువు మోస్తుంది.." అనే కవిత ఆమె అంతర్గత వేదనకు అద్దం పడుతోంది. ఆమె కవితలోని కొన్ని పంక్తులు ఇక్కడ ఉన్నాయి:


"ఎద బరువు మోస్తుంది.. అలసిపోతుంది.. అలిగిపోతుంది..పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది.. కాలాన్ని దాచిన కాలం శవమైపోతుంది..అందుకే ఊపిరున్నంతసేపు ఉండకుండా పాకు.. ఉండకూడని చోటికి అసలే పాకు.." అంటూ సాగిన ఈ పంక్తుల్లోని ప్రతి అక్షరం ఆమె గుండెలోని లోతైన బాధను, జీవితంతో ఆమె చేసిన పోరాటాన్ని తెలియజేస్తుంది. తన హృదయ వియోగాన్ని ఏదో ఒక రూపంలో పంచుకోవాలని ఆమె ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది.

స్వేచ్ఛ రాసిన ఈ కవిత "ఉండకుండా పోకు" అనే శీర్షికతో ఇటీవల ఒక మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. ఈ రచనలో ఆమె జీవితం పట్ల ఉన్న దిగులు, ఒంటరితనం, నిరాశలను అక్షర రూపంలో పొందుపరిచారు. "పుట్టడమూ చావడమూ స్పృశించలేని వ్యధలో నిదురిస్తూనే ఉంటాను.. అంతకంటే ముందే నాకు నువ్వు ఉండకుండా పోకు.." ఈ పంక్తులు ఆమె మనసులో తలెత్తిన తీవ్రమైన అవస్థలను చక్కగా వివరిస్తున్నాయి. ఒక రచయిత్రిగా ఆమెకు ఉన్న ఆంతర్యం, భావవ్యక్తీకరణ సామర్థ్యం ఈ కవిత ద్వారా పలకరించింది.

- తొలగని విషాదం, కొనసాగుతున్న దర్యాప్తు

స్వేచ్ఛ వొటార్కర్ ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఇది ఆత్మహత్య అని స్పష్టమైంది. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు. స్వేచ్ఛ తన మొదటి భర్తతో విడిపోయిన తర్వాత పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సహజీవనమే ఆమె బలవన్మరణానికి కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్వేచ్ఛకు ఒక కుమార్తె కూడా ఉంది. "అమ్మ ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండమంటూ చెప్పింది… కానీ అమ్మ ఇలా చేసుకుందంటే నమ్మలేకపోతున్నా" అని ఆ బాలిక కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె స్నేహితులు కూడా ఈ విషాద ఘటనను కలలోనైనా ఊహించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

-జీవితం ఓ పోరాటం… ఆమె ఆఖరి మాటలు

స్వేచ్ఛ కవితలో కనిపించిన భావావేశం కేవలం ఆమెకు మాత్రమే పరిమితమై ఉండకపోవచ్చు. చాలా మంది నిశ్శబ్దంగా జీవితంతో పోరాడుతుంటారు. కానీ తమ బాధను మాటల్లో, కలంలో, కన్నీళ్లలో వ్యక్తం చేయలేరు. ఆమె చివరిసారిగా రాసిన పంక్తులు జీవితానికి శాశ్వతంగా ఒక గుర్తుగా మిగిలిపోతాయి: “ఉండకుండా పోకు.. ఉండకూడని చోటుకు పోకు…” ఈ భౌతిక లోకం నుండి ఆమె ఊపిరిని కోల్పోయినా, ఆమె భావాలు, అక్షరాలు నిరంతరం జ్ఞాపకాల రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటాయి.