Begin typing your search above and press return to search.

రష్యా దాడి భయం.. నాటోలో చేరిన మరో యూరోప్‌ దేశం ఇదే!

తాజాగా యూరప్‌ లో శాంతికాముక దేశాల్లో ఒకటిగా ఉన్న స్వీడన్‌ సైతం నాటో కూటమిలో చేరింది

By:  Tupaki Desk   |   27 Feb 2024 11:30 AM GMT
రష్యా దాడి భయం.. నాటోలో చేరిన మరో యూరోప్‌ దేశం ఇదే!
X

ఆసియా, యూరప్‌ ఖండాల్లో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉన్న రష్యా నుంచి ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోవడానికి, యుద్ధ భయాలను అధిగమించడానికి యూరప్‌ దేశాలు.. అగ్రరాజ్యం అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో చేరుతున్నాయి.

తాజాగా యూరప్‌ లో శాంతికాముక దేశాల్లో ఒకటిగా ఉన్న స్వీడన్‌ సైతం నాటో కూటమిలో చేరింది. తద్వారా నాటో కూటమిలో ఉన్న దేశాల సంఖ్య 32కి పెరిగింది. దీంతో స్వీడన్‌ నాటోలో చేరడానికి రెండేళ్ల నుంచి నెలకొన్న ప్రతిష్టంభనకు అడ్డుకట్ట పడింది.

ఫిబ్రవరి చివరి నాటికి నాటో సభ్యత్వానికి సంబంధించి ఫార్మాలిటీస్‌ పూర్తి కావచ్చని.. స్వీడన్‌ అధికారికంగా నాటో సభ్య దేశంగా మారుతుందని ఆ దేశ అధికారులు తెలిపారు.

రష్యాతో స్వీడన్, ఫిన్లాండ్‌ తదితర యూరప్‌ దేశాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. స్వీడన్, ఫిన్లాండ్‌ దేశాలు... తమ వ్యతిరేక శక్తులకు ఊతమిస్తున్నాయని ఎప్పటి నుంచో రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ సరిహద్దుల్లోని ఉక్రెయిన్‌ సైతం అమెరికాకు దగ్గరవుతుండటం, నాటోలో చేరాలని ప్రయత్నాలు చేస్తుండటంతో రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం మొదలుపెట్టింది. ఇప్పటికీ రష్యా యుద్ధాన్ని ముగించలేదు. ఉక్రెయిన్‌ సర్వ నాశనమే లక్ష్యంగా దాడులు చేస్తోంది.

రష్యాను దెబ్బతీస్తూ అమెరికా ప్రయోజనాలకు సహకరించేవారు ఎవరైనా వారికి ఉక్రెయిన్‌ గతే పడుతుందని రష్యా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రష్యా సరిహద్దు దేశం ఫిన్లాండ్‌ గతేడాది నాటో కూటమిలో చేరిపోయింది. ఇప్పుడు స్వీడన్‌ వంతు వచ్చింది.

కాగా నాటో అంటే ఉత్తర అట్లాంటిక్‌ సంధి వ్యవస్థ (నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజనేషన్‌). దీన్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1949లో నాటి కమ్యూనిస్టు దేశమైన రష్యాను ఎదుర్కోవడానికి అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు కలిపి ఏర్పాటు చేశాయి. నాటోలో సభ్యులుగా ఉన్న దేశాలపై వేరే దేశం ఏదైనా దాడి చేస్తే నాటోలో సభ్యులుగా ఉన్న మిగతా దేశాలు వేరే దేశంపై దాడికి దిగుతాయి. అంతేకాకుండా సభ్య దేశాలకు అవసరమైన ఆర్థిక, సైనిక, సాంకేతిక సహాయాలు అందిస్తాయి. ఉదాహరణకు నాటోలో తాజాగా సభ్యురాలిగా చేరిన స్వీడన్‌ పై రష్యా దండెత్తితే నాటోలో మిగతా 31 సభ్య దేశాలు.. స్వీడన్‌ కు మద్దతుగా రష్యాపై దండెత్తుతాయి.

యూరప్‌ లో రష్యా అధినేత వాద్లిమిర్‌ పుతిన్‌ దూకుడును ఎదుర్కోవడానికి యూరప్‌ దేశాలు నాటో కూటమిలో చేరిపోతున్నాయి. ఉక్రెయిన్‌ పై యుద్ధం చేస్తున్న రష్యా.. దీని తర్వాత తమపైనే దాడికి దిగుతాయని స్వీడన్, ఫిన్లాండ్‌ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటో కూటమిలో చేరిపోయాయి.