వైసీపీ స్వామి అన్యమనస్కంగా ?
స్వామి అంటే విజయనగరం జిల్లాలో ఆయన పేరే మారు మోగుతుంది. ఆయనే కోలగట్ల వీరభద్ర స్వామి సీనియర్ మోస్ట్ లీడర్.
By: Tupaki Desk | 7 Jun 2025 9:28 AM ISTస్వామి అంటే విజయనగరం జిల్లాలో ఆయన పేరే మారు మోగుతుంది. ఆయనే కోలగట్ల వీరభద్ర స్వామి సీనియర్ మోస్ట్ లీడర్. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన ఈ నేత రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయనగరం నుంచి నెగ్గారు. ఒకసారి 2004లో పూసపాటి రాజ వంశీకుడు అయిన అశోక్ గజపతిరాజుని ఓడించారు. తిరిగి 2019లో ఆయన కుమార్తె అదితి గజపతిరాజుని ఓడించారు.
ఇలా ఒకే కుటుంబలోని ఘనత కెక్కిన వంశీకులైన తండ్రీకూతుళ్ళను ఓడించిన రికార్డుని ఆయన సొంతం చేసుకున్నారు జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశిస్తే ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. మొత్తానికి అయిదేళ్ళ పాటు అధికార వైభోగాన్ని అనుభవించారు. తన కుమార్తెని విజయనగరం కార్పోరేషన్ లో డిప్యూటీ మేయర్ గా చేసుకుని తన వారసురాలిగా ముందుకు తెచ్చారు.
అయితే 2024 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో స్వామిలో రాజకీయ వైరాగ్యం మొదలైంది అని చెప్పుకున్నారు. పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. తన వద్దకు వచ్చిన వారిని సైతం రాజకీయాల గురించి మాట్లాడవద్దు అని అని ఆయన షరతు పెట్టేవారు. వైసీపీకి సంబంధం లేనట్లుగా వ్యవహరించేవారు.
పార్టీని పూర్తిగా పక్కన పడేశారు అన్న విమర్శలు వచ్చాయి. అంతే కాదు ఆయన టీడీపీలోకి వెళ్తారు అన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. క్యాడర్ కి పూర్తిగా అందుబాటులోకి లేకుండా పోయిన స్వామి రాజకీయం తీరు చూసిన వైసీపీ అధినాయకత్వం ఒక దశలో ఆయన ప్లేస్ లో వేరే వారిని తీసుకుని రావాలని ఆలోచన చేసిందని కూడా చెప్పుకున్నారు.
అయితే సీనియర్ నేత అయిన ఆయననే మరోసారి సంప్రదించి క్రియాశీలకంగా ఉండాలని కోరేందుకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ప్రయోగించారని ప్రచారం సాగింది. బొత్స కోలగట్లకు నచ్చచెప్పడంతోనే తిరిగి ఆయన యాక్టివ్ అయ్యారని అంటున్నారు. తాజాగా వైసీపీ ఇచ్చిన వెన్నుపోటు దినం నిరసన పిలుపుని అందుకుని ఆయన పార్టీ క్యాడర్ తో పాటు కలసి జనంలోకి వచ్చారు. దాదాపుగా ఏడాది కాలం తరువాత మీడియా ముందుకు వచ్చిన స్వామి కూటమి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు.
ఏడాది కాలంలోనే కూటమి పాలన పట్ల జనంలో అసంతృప్తి పెద్ద ఎత్తున వచ్చిందని కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. హామీలు నెరవేర్చడం కూటమి వల్ల కావడంలేదని అన్నారు. సంక్షేమ పాలన అంటే జగన్ దే అని చెప్పరు. మొత్తానికి చూస్తే స్వామి తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయినా ఆయన మరో నాలుగేళ్ళ పాటు ఇదే స్పీడ్ తో దూకుడు చేయగలరా అన్న చర్చ ఉంది.
ఆయన వయసు కూడా భారమైంది అని అంటున్నారు. దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుని తన కుమార్తె శ్రావణికి విజయనగరం వైసీపీ టికెట్ ని ఇప్పించుకోవడానికి చూస్తున్నారు అని అంటున్నారు. నిజానికి 2024 ఎన్నికల్లోనే కుమార్తెకి టికెట్ అడిగారు కానీ జగన్ నో చెప్పారని ప్రచారం సాగింది.
ఇక ఆరున్నర పదుల వయసులో ఉన్న స్వామి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే మూడ్ లో లేరని అంటున్నారు. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుందామని అనుకున్నా కుమార్తె రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకునే ఆయన కొనసాగుతున్నారని అంటున్నారు. మరి వైసీపీ హై కమాండ్ కోలగట్ల కుమార్తెకి టికెట్ ఇస్తుందా లేక సామాజిక సమీకరణలు చూసి ఈ సీటు బీసీలకు కేటాయిస్తారా అన్నది వచ్చే ఎన్నికల నాటికి తేలుతుంది అని అంటున్నారు.
