Begin typing your search above and press return to search.

స్వామీజీ జన్మదినం... వైసీపీకి పర్వదినం

ప్రతీ సారి లాగానే ఈసారి కూడా ఆధ్యాత్మిక శోభతో పాటు రాజకీయ సందడి నడుమ స్వామీజీ జన్మ దిన వేడుకలు జరిగాయి.

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:49 PM GMT
స్వామీజీ జన్మదినం... వైసీపీకి పర్వదినం
X

విశాఖ జిల్లాలో ఉన్న శారదాపీఠం అధిపతి శ్రీ స్వరూపానందేంద్ర మహా స్వామి జన్మదినం ప్రతీ ఏటా నాగుల చవితి వేళ వస్తుంది. ప్రతీ సారి లాగానే ఈసారి కూడా ఆధ్యాత్మిక శోభతో పాటు రాజకీయ సందడి నడుమ స్వామీజీ జన్మ దిన వేడుకలు జరిగాయి. ఉదయం నుంచి వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు, కీలక నేతల హడావుడి సాగుతూనే ఉంది.

తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల క్రిష్ణ శారదాపీఠాన్ని సందర్శించారు. స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా పీఠానికి వచ్చి స్వామి దీవెనలు అందుకున్నారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి స్వామీజీ నిండు దీవెనలు జగన్ మీద ఉండాలని కోరుకున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసేందుకు దైవ బలం తోడు కావాలని ఆకాంక్షించారు.

సాయంత్రం అవుతూనే ఉత్తరాంధ్రా జిల్లాలా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఆశ్రమాన్ని సందర్శించి స్వామీజీ దీవెనలు అందుకున్నారు. ఆయన వెంట మంత్రి గుడివాడ అమరనాధ్, పెందుర్తి గాజువాక ఎమ్మెల్యేలు అదీప్ రాజ్ తిప్పల నాగిరెడ్డి తో పాటు వైసీపీ నేతలు ఉన్నారు.

స్వామీజీ చల్లని చూపు ఉండాలని వైసీపీ నేతలు అంతా కోరుకుంటున్నారు. 2019 ఎన్నికల వేళ రాజశ్యామల యాగం స్వామీజీ చేశారని ప్రజా బలంతో దైవ బలం అలా చేకూరి జగన్ సీఎం అయ్యారని అంటూంటారు. ఈసారి కూడా ఎన్నికలు దగ్గర పడిన తరువాత పీఠం ఆధ్వర్యంలో అలాంటి యాగం ఏమైనా చేపడతారా అన్న చర్చ కూడా సాగుతోంది.

తెలంగాణాలో రెండవసారి కేసీయార్ సీఎం కావడానికి ముందు రాజశ్యామల యాగాన్ని స్వామీజీ చేపట్టారు. 2018లో అలా కేసీయార్ సీఎం అయ్యారు. ఇక 2023 ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ మధ్యనే రాజశ్యామల యాగాన్ని తెలంగాణాలో కేసీయార్ ఆద్వర్యంలో నిర్వహించారు. దాని ఫలాలు ఫలితాలు బీయారెస్ కి అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు.

ఇక వైసీపీ సైతం 2024లో తమదే అధికారం అంటోంది. జగన్ ఎపుడూ ఒకే మాట అంటూంటారు. తనకు పొత్తులు ప్రజలతోనే అని చెబుతూంటారు. అలాగే ప్రజల దీవెనలు దేవుడి దీవెనలు కూడా తనకు ఉన్నాయని అంటారు. అలా దైవ బలం తమకు కలసి రావాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. మరి స్వామిని అధికార పార్టీకి కొంత అనుకూలం అన్నట్లుగా ఇప్పటికే విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.

అయితే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అనేకమంది ఆశ్రమానికి వచ్చి స్వామి దీవెనలు పొందుతున్నారని కూడా చెబుతారు. ఇవన్నీ ఎలా ఉన్నా స్వామి జన్మ దినం అంటే వైసీపీకి పర్వదినంగా మారింది అన్నది మాత్రం మరోసారి రుజువు అయింది. స్వామి అభిమానం ఆశీస్సులు తమ మీద సదా ఉండాలని వైసీపీ నేతలు కోరుకోవడం బట్టి చూస్తూంటే పీఠం రాజకీయాలు అని విపక్షాల విమర్శలకు సహేతుకత ఉందా అన్న చర్చ నడుస్తోంది.