Begin typing your search above and press return to search.

పిఠాపురం వర్మకు షాక్ ఇచ్చేశారా ?

పిఠాపురం వర్మగా గుర్తింపు పొందిన ఎస్వీఎస్ఎన్ వర్మ పిఠాపురం టీడీపీ ఇంచార్జిగా కొనసాగుతున్నారు.

By:  Tupaki Desk   |   16 July 2025 5:00 AM IST
పిఠాపురం వర్మకు షాక్ ఇచ్చేశారా ?
X

పిఠాపురం వర్మగా గుర్తింపు పొందిన ఎస్వీఎస్ఎన్ వర్మ పిఠాపురం టీడీపీ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. ఆయనకు పొలిటికల్ గా అయితే పెద్దగా కలిసి రావడం లేదని అంటున్నారు. ఆయనకు 2024 ఎన్నికల్లో కచ్చితంగా సీటు దక్కాల్సిందే. పొత్తులలో జనసేనాని పవన్ కనుక పిఠాపురం కోరుకోకపోతే వర్మ ఈపాటికి ఎమ్మెల్యేగా ఒక వెలుగు వెలిగిపోయేవారు. కానీ పవన్ ఆ సీటు కోరడంతో టీడీపీ అధినాయకత్వం ఆమోదించడంతో వర్మకు నాటి నుంచే ఇబ్బందులు మొదలయ్యాయి.

అయితే ఆనాడు వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారు. కానీ హామీ అయితే ఇప్పటిదాకా నెరవేరలేదు సరికదా పవన్ సోదరుడికి ఎమ్మెల్సీ దక్కింది. దాంతో వర్మ అనుచరులు మరింతగా రగులుకునే నేపధ్యం ఏర్పడింది. ఇక వర్మ ఏ రోజుకు అయినా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశ పెట్టుకున్నారని చెబుతారు. రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు ఏపీలో ఖాళీ అవుతాయి. అలా వర్మకు ఏదో నాటికి పెద్దల సభలో కుర్చీ ఖాయమని అనుచరులూ అనుకుంటున్నారు.

కానీ లేటెస్ట్ టాక్ ఏమిటి అంటే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇక దక్కదని. భవిష్యత్తులో కూడా ఆ ఆశలు పెట్టుకోవద్దని పెద్దలు చెప్పారని ప్రచారం సాగుతోంది. వర్మ కోరుకుంటే ఏదైనా రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి ఇస్తామని చెబుతున్నారుట. ఇపుడు మరో విడత నామినేటెడ్ పదవుల భర్తీ ఉంది. అందువల్ల దానిలో ఒక దానిని వర్మకు ఇవ్వడానికి చూస్తున్నారు అని అంటున్నారు.

అలా కాదు అనుకుంటే 2026లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ పదవిని అయినా ఇస్తామని చెబుతున్నారని టాక్ నడుస్తోంది. ఈ పదవులు తప్ప ఎమ్మెల్సీ మాత్రం ఇవ్వలేమని తేల్చేశారని అంటున్నారు. ఎందుకంటే పిఠాపురాన్ని పవన్ తన సొంత నియోజకవర్గంగా చేసుకున్నారు రానున్న మరిన్ని ఎన్నికలలో ఆయన అక్కడ నుంచే పోటీ చేస్తారు అని చెబుతున్నారు. వర్మకు కనుక ఎమ్మెల్సీ పదవి ఇస్తే రెండవ అధికార కేంద్రంగా మారడం వర్గ పోరు ఇవన్నీ ఇబ్బందులుగా ఉంటాయి.

దాంతో జనసేన నుంచి ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా ఏమో తెలియదు కానీ వర్మ పరిస్థితి మాత్రం ఇబ్బందులలో పడింది అని అంటున్నారు. ప్రజా బలం ఉండి అర్హతలు అన్నీ ఉండి కూడా చట్ట సభలలో ఆయన అడుగు పెట్టలేకపోతున్నారు అని అంటున్నారు. నిజానికి ఎమ్మెల్సీ ఆ మీదట మంత్రి పదవి ఇలా వర్మకు మంచి కలర్ ఫుల్ సినిమాయే ఎన్నికల ముందు హామీల రూపంలో చూపించారని అంటున్నారు.

కానీ ఇపుడు రాజకీయ ఈక్వెషన్స్ ను చూసుకుంటే వర్మకు పిఠాపురంలో పొలిటికల్ గా ఎలివేషన్స్ ఇవ్వడం కుదిరేది కాదని అంటున్నారు. మరి వర్మకు విషయం చెప్పేసి బంతిని ఆయన కోర్టులోకే నెట్టారని అంటున్నారు. వర్మ తనకు ఎమ్మెల్సీ తప్ప ఈ పదవులు కోరుకుంటే ఇచ్చేందుకు హైకమాండ్ సిద్ధమని చెబుతోంది. వాటికి ఓకే చెప్పి సర్దుకుపోవడమా లేక తీవ్ర నిర్ణయం తీసుకోవడమా అన్నదే చర్చగా సాగుతోందిట.

ఏది ఏమైనా ఏపీలో కూటమి బలంగా ఉంది. మరో నాలుగేళ్ళ పాటు అధికారంలో ఉంటుంది. వర్మ పరిస్థితి చూస్తే టీడీపీకి ఆయన వీర విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. దాంతో ఆయన సర్దుకుని పోతారా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచిన వర్మకు రాజకీయంగా ఇపుడు కొంత ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు. మరి ఆయన ఏమి చేస్తారు అన్న దాని కంటే పాపం వర్మ అని సానుభూతి చూపుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారుట.