మమత పోటీకి రెడీ ..సువేందుకు కొత్త సవాల్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఒకనాటి తన అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి అయిన మంతకు రాజకీయ దారి చూపించారా అన్న చర్చ సాగుతోంది.
By: Satya P | 13 May 2026 9:00 PM ISTపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఒకనాటి తన అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి అయిన మంతకు రాజకీయ దారి చూపించారా అన్న చర్చ సాగుతోంది. ఆయన తాజాగా బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లకు పోటీ చేశారు. నందిగ్రామ్ అందులో ఒకటి అయితే భవానీపూర్ మరొకటి. ఈ రెండు సీట్లలోనూ ఆయన గెలిచారు. భవానీపూర్ లో అయితే సిట్టింగ్ ముఖ్యమంత్రి గా ఉన్న మమతా బెనర్జీని ఓడించి సంచలనం రేపారు. 2021లో ఇదే సువేందు అధికారి నందిగ్రామ్ లో మమతా బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించారు. అయితే రెండు సీట్లను అట్టే బెట్టుకుని ఉండడం అన్నతి రాజ్యాంగం ప్రకారం కుదరదు కాబట్టి ఆయన ఒక ఎమ్మెల్యే సీటుగా భవానీపూర్ నే ఉంచుకుని తాను గత అయిదేళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న నందిగ్రాం కి రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది.
హ్యాట్రిక్ విజయం :
ఇక సువేందు అధికారికి అచ్చి వచ్చిన సీటు నందిగ్రాం. ఆయన 2009, 2014 లలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. 2016 లో ఆయన నందిగ్రామ్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం మంత్రిగా కూడా మమతా బెనర్జీ ప్రభుత్వంలో పనిచేశారు. 2020లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021లో ఆయన తన సొంత నియోజకవర్గం నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. అయితే ఆయన్ని ఓడించాలని మమతా బెనర్జీ తన సొంత సీటు భవానీపూర్ ని వదిలి మరీ అక్కడికి వచ్చి పోటీ చేశారు. అలా మమతను సువేందు అధికారి ఓడించి జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు. 2026 లో అదే సీట్లో మరోసారి గెలిచి ఆయన హ్యాట్రిక్ కొట్టారు.
సొంత సీటులో ఓడి :
ఇక మమతా బెనర్జీ విషయానికి వస్తే ఆమె 2011లో భవానీపూర్ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ కి తొలిసారి అయ్యారు. 2016 లో అక్కడ నుంచే గెలిచారు. 2021 లో మాత్రం నందిగ్రామ్ వెళ్ళి ఓటమి మూటగట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలవడంతో భవానీపూర్ లో ఎమ్మెల్యేగా తన పార్టీ నుంచి గెలిచిన సోవందేబ్ చటోపాధ్యాయ చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో మమత గెలిచారు. 2026 లో తన సొంత సీట్లో ఆమె పోటీ చేశారు కానీ సువేందు అధికారి రెండవ సీటుగా దానిని ఎంచుకుని మరీ మమతను ఓడించారు. చిత్రమేంటి అంటే మమత సొంత సీటు భవానీపూర్ నే సువేందు అధికారి అట్లే పెట్టుకుని తన సొంత సీటు నందిగ్రాం కి రాజీనామా చేశారు.
మమతా దీదీ రంగంలోకి :
ఇక తాను భవానీపూర్ లో ఓడిన మమతా బెనర్జీ ఇపుడు రాజకీయంగా పట్టుదల మీద ఉన్నారు. ఆమె అసెంబ్లీలోకి వెళ్లలేకపోతున్నారు. దాంతో నందిగ్రామ్ సీటు నుంచి జరిగే ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారికి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య నందిగ్రామ్ లో రాజకీయ యుద్ధమే సాగనుంది. ఒకనాడు అంటే 2006 లో ఈ ఇద్దరు నేతలు కలసి నందిగ్రామ్ లోనే అప్పటి వామపక్ష ప్రభుత్వం మీద పోరాటం చేసి మంచి పేరు తెచ్చుకుని రాజకీయంగా ఈ స్థాయికి వచ్చారు. ఇపుడు మరోసారి నందిగ్రామ్ ఈ ఇద్దరి రాజకీయ భీకర పోరుతో వార్తలల్లోకి రానుంది అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో మమత గెలిస్తే కనుక సువేందు అధికారికి అది అతి పెద్ద దెబ్బ అవుతుంది. మమతను రెండు చోట్ల రెండు సార్లు ఓడించాను అన్న ఆయన జెయింట్ కిల్లర్ ఇమేజ్ కి బ్రేక్ పడడమే కాకుండా బీజేపీ పెద్దల వద్ద కూడా పరపతి తగ్గుతుంది. అందువల్ల మమత బెనర్జీ పోటీ చేస్తే అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సువేందు అధికారి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తారో చూడాల్సి ఉంది.
