Begin typing your search above and press return to search.

బీజేపీ గెలిస్తే సీఎం గా మమత అనుచరుడు ?

మమతా బెనర్జీకి కంట్లో నలుసుగా ఒక నేత తయారయ్యారు ఆయనే సువేందు అధికారి. ఆరేళ్ళుగా బీజేపీలో ఉన్న సువేందు అధికారి మూలాలు అన్నీ తృణమూల్ కాంగ్రెస్ లోనే ఉన్నాయి.

By:  Satya P   |   2 May 2026 9:23 AM IST
బీజేపీ గెలిస్తే సీఎం గా మమత అనుచరుడు ?
X

తాను పెంచి పెద్ద చేసిన అనుచరుడే రేపటి రోజున తాను కనుక ఖాళీ చేస్తే సీట్లో ముఖ్యమంత్రి అవుతారు అంటే ఏ రాజకీయ నాయకుడూ తట్టుకోలేరు. పశ్చిమ బెంగాల్ లో అలాంటి పరిస్థితి మమతా బెనర్జీకి రానుందా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే బెంగాల్ లో రెండు విడతలుగా పోలింగ్ ముగిసిన తరువాత మమతా బెనర్జీ పడుతున్న నానా హైరానా చూస్తే ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఓటమిని పసిగట్టిందా అన్న చర్చ అయితే సాగుతోంది. మరో వైపు చూస్తే మోడీ అండ్ అమిత్ షా 2021లో ఒకసారి బెంగాల్ లో ఫెయిల్ అయ్యారు. ఈసారి కానే కారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. దానికి తోడు అధిక శాతం పోలింగ్ ఇవన్నీ కలిసి మే 4న బెంగాల్ లో బీజేపీ సునామీని చూడబోతారా అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

మమతకు కంట్లో నలుసుగా :

మమతా బెనర్జీకి కంట్లో నలుసుగా ఒక నేత తయారయ్యారు ఆయనే సువేందు అధికారి. ఆరేళ్ళుగా బీజేపీలో ఉన్న సువేందు అధికారి మూలాలు అన్నీ తృణమూల్ కాంగ్రెస్ లోనే ఉన్నాయి. మొదట కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్ గా గెలిచిన ఆయన 1998లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ని ప్రారంభిస్తే అందులో చేరారు. ఆ పార్టీ తరఫునే ఎమ్మెల్యే ఎంపీ మంత్రి కూడా అయ్యారు. కీలకమైన బాధ్యతలు అన్నీ చూశారు. సరిగ్గా 2021 ఎన్నికలకు ఏడాది ముందు ఆయన తృణమూల్ కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు 2021 ఎన్నికల్లో మమతను ఆయన నందిగ్రామ్‌ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మమతా బెనర్జీ పై 1,736 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆనాడు బీజేపీకి 78 సీట్లను బెంగాల్ లో తీసుకుని రావడం వెనక సువేందు అధికారి కృషి ఉంది. ఇపుడు మమత పోటీ చేస్తున్న భవానీపూర్ నుంచే సువేందు అధికారి పోటీకి దిగి అక్కడ కూడా మమతకు బేజారెత్తిస్తున్నారు.

ప్రతిపక్ష నేతగా :

ఇక మమతను ఓడించి 2021లో నందిగ్రాం నుంచి గెలిచిన సువేందు అధికారిని బీజేపీ పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా నియమించింది. ఈ అయిదేళ్ళూ ఆయన గట్టిగా మమతా బెనర్జీ ప్రభుత్వం మీద పోరాడి బీజేపీకి బెంగాల్ లో గట్టి బలం సమకూర్చారు. ఇక ఆయనకు మోడీ అమిత్ షా ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. బీజేపీ గెలిస్తే రెండవ మాట లేకుండా ఆయనకే ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తారు అని అంటున్నారు. ఆయనకు సరిసాటి నేత పోటీగా కూడా బెంగాల్ బీజేపీలో ఎవరూ లేకపోవడం సువేందు అధికారి మమతా బెనర్జీకి గట్టి ప్రత్యర్థిగా ఉండడం ఆమెని ఒకసారి ఓడించిన వారు కావడం ఆమె అనుచరుడిగా ఉంటూ తృణమూల్ కాంగ్రెస్ గుట్టూ మట్టూ అన్నీ తెలిసిన వారు కావడమే సువేందు అధికారికి ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు.

పదిహేనేళ్ళు చిన్న :

ఇక సువేందు అధికారి 1970లో జన్మించారు. ఆయన మమత కన్నా పదిహేనేళ్ళు చిన్న. ఆయన మమత మాదిరిగా వ్యూహ రచనలో సిద్ధహస్తుడు మమత ఎత్తులు పై ఎత్తులు ఆయనకు బాగా తెలుసు. ఆమెను ఎలా నిలువరించాలో కూడా తెలుసు అని అంటున్నారు. ఇక ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడుగా ఉన్నారు. మమత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా సమీకరణలకు సరిపోతుంది అని అంటున్నారు. ఇంతకు ముందు బెంగాల్ ని పాలించిన వారిలో అత్యధికులు అదే సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో బీజేపీ కూడా ఆ ఎత్తుగడతో ఉందని అంటున్నారు. ఇక నాడు వామపక్ష ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా పోరాడి రైతులకు అండగా ఉన్న నాయకుడిగా సువేందు అధికారికి పేరుంది దాంతో బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన పేరు అయితే మారుమోగుతొంది. చూడాలి మరి మే 4న ఏమి జరుగుతుందో.