ముగ్గురు సీఎంలు తాకలేని మసీదు.. ఇప్పుడు సువేందు టార్గెట్టా?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి మతం, భద్రత, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఒకే వేదికపైకి వచ్చాయి.
By: A.N.Kumar | 24 May 2026 5:00 PM ISTపశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి మతం, భద్రత, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఒకే వేదికపైకి వచ్చాయి. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే ఉన్న 136 ఏళ్ల “బంక్రా మసీదు” ఇప్పుడు జాతీయ చర్చగా మారింది. దశాబ్దాలుగా ప్రభుత్వాలు తాకడానికి కూడా వెనుకంజ వేసిన ఈ అంశం.. ఇప్పుడు బీజేపీ నాయకుడు సువేందు అధికారి పేరు చుట్టూ తిరుగుతోంది.
అసలు సమస్య ఏమిటి?
“గౌరీపసూర్ జామే మస్జిద్”గా అధికారికంగా పిలిచే ఈ మసీదు.. విమానాశ్రయం రెండో రన్‌వేకి కేవలం 165 మీటర్ల దూరంలో ఉంది. కానీ విమానయాన భద్రతా నిబంధనల ప్రకారం కనీసం 240 మీటర్ల క్లియరెన్స్ అవసరం. అంటే సాంకేతికంగా చూస్తే.. ఈ నిర్మాణం ‘రిస్క్ జోన్’లో ఉన్నట్టే.
ఈ కారణంగా పెద్ద విమానాల ల్యాండింగ్ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. టచ్‌డౌన్ పాయింట్‌ను 88 మీటర్లు మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాల అవకాశాలు పెరిగే ప్రమాదం ఉందన్నది విమానయాన నిపుణుల వాదన.
కానీ.. ఇంతకాలం ఎందుకు మౌనం?
ఇదే ఇప్పుడు పెద్ద రాజకీయ ప్రశ్నగా మారింది. సీపీఎం హయాంలో జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్జీ వంటి ముఖ్యమంత్రులు ఈ అంశాన్ని ఫైళ్లకే పరిమితం చేశారని విమర్శలు ఉన్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వమూ ఇదే దారిలో నడిచిందని బీజేపీ ఆరోపిస్తోంది. కారణం ఒక్కటే అంటున్నారు విశ్లేషకులు “ఓటు బ్యాంక్ రాజకీయాలు”.
మసీదు తరలింపు అంశం మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉండటంతో.. ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయలేదన్న అభిప్రాయం ఉంది. విమాన భద్రత కంటే రాజకీయ నష్టం పెద్దదిగా కనిపించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు సువేందు ఎందుకు చర్చలోకి వచ్చారు?
బెంగాల్‌లో బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో.. ఈ అంశాన్ని “భద్రతా సమస్య”గా ప్రొజెక్ట్ చేయాలని కమలం పార్టీ చూస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సువేందు అధికారి తరచూ “అక్రమ ఆక్రమణలు”, “రాష్ట్ర భద్రత”, “ప్రభుత్వాల తటస్థ వైఖరి” వంటి అంశాలపై మమతా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో బంక్రా మసీదు వ్యవహారం కూడా రాజకీయంగా మరింత హీట్ తెచ్చుకుంది.
అయితే బీజేపీ అనుకూల వర్గాలు దీన్ని “ప్రయాణికుల భద్రత”గా చూపిస్తుంటే.. టీఎంసీ శ్రేణులు మాత్రం “మత రాజకీయాల కోసం అంశాన్ని రగిలిస్తున్నారు” అని ఎదురుదాడి చేస్తున్నాయి.
మసీదులో పరిస్థితి ఎలా ఉంది?
ప్రస్తుతం రోజుకు 10 నుంచి 25 మంది వరకు మాత్రమే అక్కడ నమాజ్ చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారాల్లో ఈ సంఖ్య 80 వరకూ చేరుతోంది. ప్రార్థనలకు వచ్చే వారిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఐడీ చెక్ చేసి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అంటే భద్రతా పరిమితుల్లోనే ప్రార్థనలు జరుగుతున్నాయి.
ఇక ఇటీవల ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మసీదు కమిటీతో సమావేశమై తరలింపు అంశంపై చర్చలు జరిపారు. బక్రీద్ పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని అధికారులు నిర్ణయించారు. ఈద్ తర్వాత అసలు నిర్ణయం వచ్చే అవకాశముంది.
ఇది కేవలం మసీదు సమస్యేనా? అంటే కాదు ఇది మూడు కోణాల కథ. విమాన భద్రత, మత సెంటిమెంట్
రాజకీయ లాభనష్టాలు ఉంటాయి. ఈ మూడు ఒకేసారి కలిసినప్పుడు.. ఏ ప్రభుత్వం అయినా అడుగు వెనక్కే వేస్తుంది. అందుకే ముగ్గురు సీఎంలు చేయలేని పని ఇప్పుడు సువేందు అధికారి చేయగలరా? అన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ మసీదు తరలింపు జరిగితే.. అది “భద్రతా విజయమా?” లేక “రాజకీయ సంకేతమా?” అన్న చర్చ దేశవ్యాప్తంగా మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది.
