Begin typing your search above and press return to search.

భార్యపై అనుమానం... బిడ్డను బ‌లి తీసుకున్న ఉన్మాదం!

దాంపత్య జీవితంలో అనుమానం అనే అంశం ఎంత ప్రభావవంతమైందో తెలిపే సంఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Aug 2023 6:00 AM GMT
భార్యపై అనుమానం... బిడ్డను బ‌లి తీసుకున్న ఉన్మాదం!
X

దాంపత్య జీవితంలో అనుమానం అనే అంశం ఎంత ప్రభావవంతమైందో తెలిపే సంఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగిన సంగతి తెలిసిందే. భార్యాభర్తల మధ్య చిన్నగా మొదలయ్యే ఈ అనుమానం ముదిరితే పెనుభూతంగా మరుతుందనడంలో సందేహం లేదు. తాజాగా అలాంటి సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

అవును... భార్యపై పెంచుకున్న అనుమానం ఒక వ్యక్తిని ఉన్మాదిగా మార్చింది. ఒకచేత్తో వేట కొడవలిని, మరో చేత్తో పురుగుమందు డబ్బాను పట్టుకుని.. తన కుటుంబంపైనే విరుచుకుపడేలా ఉసిగొల్పింది. ఈ క్రమంలో నాలుగేళ్ల కుమారుడు చనిపోగా.. అనంతరం పురుగుమందు తాగి తండ్రీ మరణించాడు.

బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం పెద్దరాజుపల్లి గ్రామానికి చెందిన అరసాని రాజు (44), అనిత.. 14ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఈ సమయంలో దంపతులిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఇద్దరు పిల్లలను తీసుకుని అనిత.. పుట్టింటికి వెళ్లిపోయింది.

ఇలా ఐదేళ్ల క్రితమే దేవనకొండలోని తల్లి దగ్గరకు వచ్చేసిన ఆమె... ప్రైవేటు టీచర్‌ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఈ సమయంలో హఠాత్తుగా ఓ చేత్తో వేటకొడవలి, మరో చేత్తో పురుగుమందు డబ్బా పట్టుకుని ఊగిపోతూ రాజు.. భార్య ఉంటున్న ప్రాంతానికి వచ్చాడు.

ఈ సమయంలో ఆ భయానక పరిస్థితిని గమనించిన అనిత, పెద్ద కుమారుడు దూరంగా వెళ్లిపోయారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రేకంతో ఇంట్లోకి వెళ్లిన రాజుకు చిన్న కుమారుడు ఉజ్వల్‌(4) పడుకుని కనిపించాడు. దీంతో... ఉన్మాదంలో బంధం మరిచిపోయి ఆ చిన్నారికి బలవంతంగా పురుగు మందు తాగించాడు.

అనంతరం రోడ్లపైకి వచ్చి గట్టిగా అరిచాడు. "కలిసి జీవిద్దామని ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినలేదు. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది" అని రోడ్డుపై అరుస్తూ.. పురుగుమందు తాగి కుప్పకూలిపోయాడు.

దీంతో పరిస్థితి గమనించిన స్థానికులు అతడిని, అతడి చిన్న కుమారుడిని హుట్టాహుటున ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే ఇద్దరూ కన్నుమూశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.