Begin typing your search above and press return to search.

ఉంది.. బీజేపీలో.. టికెట్‌ మాత్రం టీడీపీది కావాలంట!

అందులోనూ విలక్షణతకు మారుపేరైన ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ టికెట్‌ కోసం బీజేపీ నేత పోటీ పడుతుండటం ఆసక్తి రేపుతోంది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 12:30 PM GMT
ఉంది.. బీజేపీలో.. టికెట్‌ మాత్రం టీడీపీది కావాలంట!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు అప్పుడే హీట్‌ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో కీలకమైన అనంతపురం జిల్లా రాజకీయాలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. అందులోనూ విలక్షణతకు మారుపేరైన ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ టికెట్‌ కోసం బీజేపీ నేత పోటీ పడుతుండటం ఆసక్తి రేపుతోంది.

దివంగత మంత్రి పరిటాల రవి ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (అసలు పేరు.. గోనుగుంట్ల సూర్యనారాయణ) ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. 2009లో టీడీపీ తరఫున ధర్మవరం నుంచి పోటీ చేసిన వరదాపురం సూరి ఓటమి పాలయ్యారు. 2014లో మళ్లీ టీడీపీ తరఫునే పోటీ చేసిన ఆయన విజయం అందుకున్నారు. 2019లో మళ్లీ బరిలోకి దిగిన వరదాపురం సూరి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

2019 ఎన్నికల్లో ఓడిన వెంటనే వరదాపురం సూరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికీ ఆయన బీజేపీలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తుండటంతో టీడీపీలోకి రావాలని భావిస్తున్నారు. టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని సూరి భావిస్తున్నారు.

మరోవైపు పోయిన ఎన్నికల్లో వరదాపురం సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరడంతో ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జి లేకుండా పోయారు. దీంతో పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్‌ టీడీపీ కార్యకలాపాలను ముందుకు నడిపించారు. దీంతో సహజంగానే శ్రీరామ్‌ ధర్మవరం సీటును ఆశిస్తున్నారు.

గత ఎన్నికల్లో శ్రీరామ్‌ తన తల్లి, నాటి మంత్రి పరిటాల సునీతను పక్కనపెట్టి రాప్తాడు నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి చేతిలో శ్రీరామ్‌ ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గాన్ని మళ్లీ తన తల్లి సునీతకే వదిలేసి ధర్మవరం నియోజకవర్గంలో శ్రీరామ్‌ తన కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌ లను కలిసిన పరిటాల సునీత, శ్రీరామ్‌ ఈసారి తమ కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వాలని కోరారు. రాప్తాడు నుంచి తాను, ధర్మవరం నుంచి తన కుమారుడు శ్రీరామ్‌ పోటీ చేస్తారని సునీత.. చంద్రబాబుకు తెలిపారు.

ఇంకోవైపు గతంలో ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్న వరదాపురం సూరి కూడా టీడీపీ టికెట్‌ ను ఆశిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారని అంటున్నారు. మరోవైపు వరదాపురం సూరిని పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతే అనాథలా మారిన ధర్మవరం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను తాను నిర్వహించానని శ్రీరామ్‌ చెబుతున్నారు. తనకే సీటు ఇవ్వాలని కోరుతున్నారు. మరి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.