Begin typing your search above and press return to search.

'మరోసారి సర్జికల్ స్ట్రైక్'పై క్లారిటీ ఇచ్చిన రక్షణ శాఖ!

భారత సైన్యం మరోసారి పాకిస్థాన్‌ పై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు వచ్చిన వార్తలపై భారతదేశ రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది.

By:  Tupaki Desk   |   22 Aug 2023 11:55 AM GMT
మరోసారి  సర్జికల్  స్ట్రైక్పై  క్లారిటీ ఇచ్చిన  రక్షణ శాఖ!
X

సర్జికల్ స్ట్రైక్... ఒకప్పుడు ఆ పదం సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. 2016 లో ఈ పదం దేశ ప్రజల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తే... పాక్ కి కంటిమీద కునుకులేకుండా చేసిందని చెబుతారు. ఈ సమయంలో మరోసారి సర్జికల్ స్ట్రైక్ వార్తలు తెరపైకి వచ్చాయి. దీంతో ఈ విషయాలపై రక్షణ శాఖ స్పందించింది.

అవును... భారత సైన్యం మరోసారి పాకిస్థాన్‌ పై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు వచ్చిన వార్తలపై భారతదేశ రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ వార్తలను తాజాగా తోసిపుచ్చింది. అయితే నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం విఫలం చేసినట్లు తెలిపింది.

భారత దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో... బాలాకోట్ సెక్టర్, హమీర్‌ పూర్ ప్రాంతంలో సోమవారం ఉదయం వాతావరణం దట్టమైన పొగమంచుతో కూడి ఉందని.. ఆ సమయాన్ని ఇద్దరు ఉగ్రవాదులు అనుకూలంగా భావించారని.. దీంతో భారతదేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారని.. వీరిని మన సైన్యం గుర్తించిందని తెలిపింది.

ఉగ్రవాదులు చొరబండేందుకు చేసిన ప్రయత్నాలను సైన్యం అడ్డుకోవడంగానే ఈ చర్యను చూడాలని రక్షణశాఖ కోరింది. ఇది సర్జికల్ స్ట్రైక్ కాదని వివరించింది. పాక్ ఉగ్రవాదులు దొరికిపోయిన ప్రాంతంలో జరిపిన సోదాల్లో రెండు మ్యాగజైన్‌ లు, రెండు గ్రెనేడ్‌ లు, ఏకే 47 రైఫిల్ లభ్యమయ్యాయని చెప్పింది.

ఇదిలావుండగా... పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో భారత సైన్యం మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని వార్తా పత్రిక తెలిపింది. భారత సైన్యం ఆగస్టు 19 రాత్రి నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీరులోకి 2.5 కిలోమీటర్లు వెళ్లిందని.. ఆ సమయంలో పాకిస్థానీ ఉగ్రవాదులకు చెందిన నాలుగు లాంచింగ్ పాడ్‌ లను ధ్వంసం చేసిందని తెలిపింది.

ఇదే సమయంలో భారత సైన్యం జరిపిన ఆ సర్జికల్ స్ట్రైక్ లో సుమారు ఎనిమిది మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలిపింది. ఇదే సమయంలో భారత సైనికులంతా సురక్షితంగా తిరిగి వచ్చారని తెలిపింది. అయితే ఈ వార్త వెలుగులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇది అవాస్తవమని వివరణ ఇచ్చింది.

కాగా... 2016 సెప్టెంబరు 18న ఉరీ పట్టణానికి సమీపంలో ఉన్న సైనిక స్థావరంపై నలుగురు సాయుధ మిలిటెంట్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 19 మంది భారత సైనికులు మరణించారు. ఈ సమయంలో దాడి చేసినది పాకిస్తాన్‌ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అని భారత్ ఆరోపించింది.

అనంతరం ఉరీ దాడి జరిగిన పదకొండు రోజుల తర్వాత సెప్టెంబరు 29న, భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ లో ఉన్న అనుమానిత ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. సెప్టెంబరు 30న భారత సమాచార, ప్రసార మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ దాడుల్లో వైమానిక దాడులు జరగలేదని, మొత్తం ఆపరేషన్ అంతా నేలపైనే నిర్వహించామనీ చెప్పారు!

అయితే ఈ విషయాలపై స్పందించిన పాక్... సర్జికల్ దాడులేమీ జరగలేదని చెప్పుకొంది. దాడి జరిగిన వెంటనే సాక్ష్యాలను చెరిపివేయడానికి పాకిస్తాన్ సైన్యం హతమైన ఉగ్రవాదుల శవాలను పాతిపెట్టిందని భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

ఈ సర్జికల్‌ దాడుల్లో పాల్గొన్న పంతొమ్మిది మంది సైనికులకు భారత ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రదానం చేసింది. వారిలో ఆపరేషన్ నాయకుడు మేజర్ రోహిత్ సూరి రెండవ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారమైన కీర్తి చక్ర అందుకున్నాడు!