సూరత్ మున్సిపాలిటీ రూల్ ను తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తే సరి
మారుతున్న కాలానికి తగినట్లుగా జీవనశైలిలోనూ మార్పులు వస్తాయి. ఇలాంటి వేళ కొత్త సమస్యలు తెర మీదకు వస్తాయి.
By: Tupaki Desk | 5 July 2025 2:00 PM ISTమారుతున్న కాలానికి తగినట్లుగా జీవనశైలిలోనూ మార్పులు వస్తాయి. ఇలాంటి వేళ కొత్త సమస్యలు తెర మీదకు వస్తాయి. పాత చింతకాయ పచ్చడి మాదిరి కాకుండా.. పరిస్థితులకు తగినట్లుగా నిబంధనల్లో మార్పులు చేసుకుంటూ పోతే సరి. తాజాగా అలాంటి పనే చేసింది సూరత్ మున్సిపాల్టీ. కుక్కల్ని పెంచుకోవటం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. శునకాల్ని ప్రేమించేటోళ్లు ఎంతమంది ఉంటారో..వాటిని ద్వేషించేవారు అంతే స్థాయిలో ఉంటారు. పెంపుడు కుక్కలకు సంబంధించి గ్రామాలు.. పట్టణాల్లో పెద్ద సమస్య కాకున్నా నగరాల్లో మాత్రం కచ్ఛితంగా సమస్యే.
ఎందుకంటే.. మూగ జీవాల్ని పెంచుకోవటం తప్పేమిటని ప్రశ్నిస్తారు. తమ మాదిరే వాటి విషయంలో అందరూ సానుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే.. వాటి పొడ గిట్టని వారితో పంచాయితీనే. ఇలాంటి వేళ.. పెంపుడు కుక్కలపై సూరత్ మున్సిపాల్టీ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
ఇంట్లో కుక్కల్ని పెంచుకోవాలంటే కనీసం పది మంది పొరుగు వారి నుంచి ఎన్ వోసీ తీసుకొని సమర్పించాలన్న కొత్త నిబంధనను తీసుకొచ్చింది.అదే హైరైజ్ అపార్ట్ మెంట్ లలో కుక్కల్ని పెంచుకోవాలంటే ఆ హైరేజ్ భవన వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్ (ప్రెసిడెంట్) లేదంటే కార్యదర్శి అనుమతిని తప్పనిసరి చేస్తూ ఒక కొత్త ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఏడాది మేలో కుక్క దాడిలో ఒక చిన్నారి మరణించిన నేపథ్యంలో ఈ నిబంధనను తీసుకొచ్చినట్లుగా సూరత్ మున్సిపల్ అధికారుల చెబుతున్నారు. ఈ తరహా నిబంధనను తీసుకొస్తే.. కుక్కల ఓనర్లు.. మిగిలిన వారికి మధ్య అనవసర పంచాయితీలకు చెక్ పెట్టినట్లు అవుతుంది.
