డెలివరీ బాయ్ నుంచి డిప్యూటీ కలెక్టర్.. ఎలా అయ్యారో తెలిస్తే షాక్..
లక్ష్య సాధనకు నిరంతర కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం అవసరం. ఈ గుణాలన్నీ కలిసొచ్చినప్పుడు మాత్రమే ప్రతికూలతల వెనుక ఉన్న సానుకూలత ముందుకొస్తుంది.
By: Tupaki Desk | 25 Sept 2025 3:00 PM ISTచిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవద్దు.. ఎప్పుడూ లక్ష్యాలు పెద్దగా ఉండాలి యువతకు పిలుపునిచ్చారు అబ్ధుల్ కలాం. ఎందుకంటే ఆ లక్ష్యం వైపు ప్రయాణించేప్పుడు కఠోర శ్రమ అవసరం.. దానితో సక్సెస్ వారి పాదాల చెంత ఉంటుంది. లక్ష్య సాధనకు నిరంతర కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం అవసరం. ఈ గుణాలన్నీ కలిసొచ్చినప్పుడు మాత్రమే ప్రతికూలతల వెనుక ఉన్న సానుకూలత ముందుకొస్తుంది. ఇదే జరిగింది జార్ఖండ్ లో.. ఆ రాష్ట్రానికి చెందిన సూరజ్ యాదవ్ కథ యువతకు స్ఫూర్తి నిస్తుంది. తను కన్న స్వప్నాన్ని సాధించేందుకు ఎనిమిదేళ్లు కష్టపడి చివరకు డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై అందరినీ ప్రేరేపించే విజయగాథ రాశాడు.
బాల్యం నుంచే బాధలు..
సాధారణ మేస్త్రీ కుమారుడైన సూరజ్ బాల్యం నుంచే ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడు. కుటుంబం బలహీనంగా ఉన్నా, అతని లక్ష్యాలు మాత్రం బలవైనవిగా పెట్టుకున్నాడు. ఉద్యోగం చేస్తూనే చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. డబ్బు కోసం స్నేహితుల సాయంతో సెకండ్‌హ్యాండ్ బైక్ కొనుగోలు చేసి డెలివరీ బాయ్‌గా పని చేయడం మొదలుపెట్టాడు. రాత్రివేళ అలసటతో ఇంటికెళ్లినా పుస్తకాలు తెరిస్తే మాత్రం ఆ అలసట మొత్తం పోతుందని వాటితోనే కాలక్షేపం చేసేవాడు.
ఇల్లాలే ప్రధాన బలం..
అతని ఇల్లాలు అతనికి ప్రధాన బలంగా నిలిచింది. కష్ట సుఖాల్లో ఆమె వెన్నంటి ఉండడంతో ఆయన మరింత శ్రమ పడ్డాడు. చివరకు అతడి ఎనిమిదేళ్ల శ్రమ ఫలించి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కేవలం పాస్ అవడమే కాదు, 110వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం పొందాడు.
పొట్టకూటి కోసం డెలివరా బాయ్ గా..
తను ఏ పనిని చిన్నగా చూడలేదని అందుకే పొట్టు కూటి కోసం, కుటుంబ పోషణ కోసం డెలివరీ బాయ్ గా పని చేశానని ఆ అనుభవమే ఇంటర్వ్యూ సమయంలో తనకు సాయపడిందని సూరజ్ చెప్పుకచ్చాడు. టైమ్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, కష్టాల్లో శాంతంగా ఆలోచించడం ఇవన్నీ డెలివరీ పనిలో నేర్చుకున్న పాఠాలే. అవే తనను ప్రశ్నలకు ధైర్యంగా సమాధానమిచ్చేలా చేశాయని ఆయన పేర్కొన్నాడు.
కన్నీటితో దంపతుల ఆనందం
నిన్నటి వరకు ‘స్విగ్గీ బాయ్’ అని పిలిచినవారు.. ఇప్పుడు గౌరవంగా ‘డిప్యూటీ కలెక్టర్’ అని పిలుపుస్తున్నారు. తను గ్రూప్స్ ఓ ఎంపికై ఉద్యోగం వచ్చిన క్షణాన్ని భార్యతో పంచుకున్నానని, ఈ సమయంలో ఇద్దరి కన్నుల వెంట ఆనంద భాష్పాలేనని చెప్పుకచ్చారు.
యువతకు స్ఫూర్తినిచ్చిన గాథ..
ఈ కథ కేవలం ఒక వ్యక్తి విజయమే కాదు. పట్టుదలతో కష్టపడితే అసాధ్యం కానిది ఏదీ లేదని, ఎంత పెద్ద లక్ష్యమైనా సాధించవచ్చని నిరూపించే ఉదంతం. సాధారణ కుటుంబం నుంచి వచ్చినా, పరిస్థితులు విరుద్ధమైనా, అచంచల సంకల్పం ఉంటే మనిషి తన భవిష్యత్తును మార్చుకోగలడని సూరజ్ యాదవ్ ప్రేరణాత్మకంగా చూపించాడు.
