Begin typing your search above and press return to search.

సుప్రీం ప్రశ్నలతో చండీగఢ్ రిటర్నింగ్ అధికారికి చుక్కలు

చండీగఢ్ మేయర్ ఎన్నికల సమయంలో బ్యాలెట్ పత్రాల్ని పాడు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైనంపై సుప్రీం సీరియస్ గా తీసుకుంది.

By:  Tupaki Desk   |   20 Feb 2024 4:20 AM GMT
సుప్రీం ప్రశ్నలతో చండీగఢ్ రిటర్నింగ్ అధికారికి చుక్కలు
X

ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటర్నింగ్ అధికారికి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయటమే కాదు.. పగలే చుక్కలు కనిపించేలా చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్. స్వతంత్ర భారతంలో తొలిసారిగా జరిగినట్లుగా చెబుతున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల సమయంలో బ్యాలెట్ పత్రాల్ని పాడు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైనంపై సుప్రీం సీరియస్ గా తీసుకుంది.ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది.

అధికారి మసీహ్ ను ప్రశ్నించటం..సుప్రీంకోర్టు చఫ్ జస్టిస్ క్రాస్ ఎగ్జామిన్ చేయటం ఇదే తొలిసారిగా పేర్కొంటున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. చండీగఢ్ మేయర్ గా ఎన్నికైన మనోజ్ సోంకార్ రాజకీనామా.. ఆప్ కౌన్సిలర్లు ముగ్గురు బీజేపీ లో చేరినట్లుగా వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. అభ్యర్థులను ప్రలోభ పెట్టడాన్ని తీవ్రమైన అంశంగా పేర్కొంది.

అసలేం జరిగిందంటే.. జనవరి 30న మేయర్ ఎన్నికలో ఓట్ల లెక్కింపు జరగ్గా.. ఆ సందర్భంగా ఎనిమిది ఓట్లు చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో బీజేపీ అభ్యర్థి మనోజ్ చేతిలో ఆప్ - కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి నాలుగు ఓట్ల తేడాతో ఓడారు. బీజేపీ మైనార్టీ సెల్ కు చెందిన అనిల్ మసీహ్ కావాలనే ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. కెమేరా వైపు చూస్తే.. బ్యాలెట్ పేపర్లపై ఎక్స్ మార్కు వేస్తున్న పుటేజీని కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి చర్యను సుప్రీం తీవ్రంగా పరిగణించింది.

ఈ నేపథ్యంలో జరిగిన సుప్రీం విచారణలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో.. మరోసారి ఎన్నికలు జరిపేందుకు బదులుగా కొత్త రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో ఓట్లను లెక్కించటం సరైన చర్యగా భావిస్తున్నట్లు తెలిపింది. అయితే.. మంగళవారం బ్యాలెట్ పత్రాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. విచారణలో భాగంగా సీజేఐ జస్టిస్ డీవైచంద్రచూడ్ రిటర్నింగ్ అధికారిని కొన్ని ప్రశ్నలు సంధించారు. తీవ్రమైన అంశానికి నిజాయితీగా సమాధానాలు చెప్పకుంటే ప్రాసిక్యూట్ చేస్తామన్నారు. 'ఫుటేజ్ చూశాం. మీరు బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు పెడుతూ కెమెరా వైపు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు క్రాస్ మార్కులు పెట్టారు?' అని ప్రశ్నించగా.. ఎనిమిది బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్క్ పెట్టింది నిజమేనని ఒప్పుకోవటం గమనార్హం.

అయితే.. బ్యాలెట్ పత్రాలు అప్పటికే పాడైపోయిన కారణంగా వేరు చేసేందుకు అలా చేశానని పేర్కొన్నారు. దీనికి బదులుగా సీజేఐ స్పందిస్తూ.. "బ్యాలెట్ పేపర్లపై మీరు కేవలం సంతకం మాత్రమే

చేయాలి. అలాంటప్పుడు వాటిని ఎందుకు పాడు చేశారు? బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారులు ఇతరత్రా మార్కులు చేయొచ్చని ఏ నిబంధనల్లో ఉంది?" అని ప్రశ్నించారు. బ్యాలెట్ పత్రాలతో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజ్ ను తమకు పంపాలంటూ పంజాబ్.. హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ లకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. రికార్డులు సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఒక న్యాయాధికారికి బాధ్యతలు అప్పగించాలని.. గట్టి బందోబస్తు నడుమ ఆయన్ను ఢిల్లీకి పంపాలని సూచన చేశారు.