Begin typing your search above and press return to search.

నేతలపై క్రిమినల్ కేసుల విచారణపై సుప్రీం కీలక ఆదేశాలు

అయినా సరే ఆ కేసుల విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉంది. ఈ క్రమంలో నేడు తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   9 Nov 2023 9:50 AM GMT
నేతలపై క్రిమినల్ కేసుల విచారణపై సుప్రీం కీలక ఆదేశాలు
X

మన దేశంలో రాజకీయాలలో విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. చట్టసభలకు ఎన్నికవుతున్న నేతలలో చాలామంది ఆర్థికపరమైన, సివిల్ కేసులు లేకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వైనంపై ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే జైల్లో ఉన్న బిజెపి నేత ప్రజ్ఞా సాధ్వి వంటి వారు బెయిల్ పై బయటకు వచ్చి ఎంపీగా ఎన్నికై ఇంకా జైలు బయటే ఉన్నారు. ఇటువంటి ఉదాహరణలు చెప్పుకుంటూపోతే కోకొల్లలు.

ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను వేగంగా విచారణ జరిపేందుకు ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేశారు. అయినా సరే ఆ కేసుల విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉంది. ఈ క్రమంలో నేడు తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రతినిధులపై తీవ్రమైన నేరాల కేసులను సత్వరమే విచారణ జరపాలని ఆయా రాష్ట్రాల హైకోర్టులను దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు, ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న తీవ్రమైన నేరాలకు సంబంధించి ట్రయల్ కోర్టులు విచారణను వాయిదా వేయకూడదని కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.

దాంతోపాటు, ఆ కేసులో విచారణ వేగవంతం చేసి పరిష్కరించేందుకు ఓ ప్రత్యేక వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక, ఎవరైనా ప్రజా ప్రతినిధిపై తీవ్ర నేరాలకు సంబంధించి ఆరోపణలు నిరూపితమైతే శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించే విషయం పరిశీలిస్తున్నామని, ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని సీజేఐ చంద్రచూడ్ వెల్లడించారు. తీవ్ర నేరాలకు పాల్పడే ప్రజాప్రతినిధులను జీవితకాలం ఎన్నికల పోటీ నుంచి బహిష్కరించాలని లాయర్ అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

చాలా రోజులుగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన నేరాలు, కేసులు, విచారణపై అశ్విని ఉపాధ్యాయ పోరాడుతున్నారు. ఇక, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ మీద ఉన్న సివిల్, క్రిమినల్ తదితర కేసుల వివరాలను మీడియాలో వెల్లడించిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఆ మార్గదర్శకాలు పాటిస్తున్న అభ్యర్థుల సంఖ్య మాత్రం తక్కువనే చెప్పాలి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై హైకోర్టులు ఏ విధంగా స్పందిస్తాయి, ఎంత త్వరగా చర్యలు చేపడతాయి అన్నదానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.