Begin typing your search above and press return to search.

370 ఆర్టికల్ పై సుప్రీం సంచలన తీర్పు!

కేంద్ర ప్రభుత్వం జమ్ముకాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాన్ని వ్యతిరేకిస్తూ పలు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి

By:  Tupaki Desk   |   11 Dec 2023 7:06 AM GMT
370 ఆర్టికల్ పై సుప్రీం సంచలన తీర్పు!
X

కేంద్ర ప్రభుత్వం జమ్ముకాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాన్ని వ్యతిరేకిస్తూ పలు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో దానిపై విచారణ జరిపి తీర్పు రిజర్వ్ లో పెట్టిన సర్వన్నత ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. అంతా ఆసక్తిగా చూశారు. ఏ తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూశారు. ధర్మాసనం ఇచ్చిన తీర్పును చూసి నిర్ఘాంతపోతున్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని కుండబద్దలు కొట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేమని సున్నితంగా చెప్పింది. రాజ్యాంగానికి కట్టుబడి ప్రభుత్వం నిర్ణయం ఉందని మరోసారి చాటింది. తీర్పు వస్తుందనే ఉద్దేశంతో అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి తీర్పు వచ్చినా పరిస్థితిని అదుపులో ఉంచే విధంగా బలగాలకు ఆదేశాలు జారీ చేశారు.

చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి నెల రోజుల పాటు విచారణ చేపట్టింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ లో పెట్టింది. నేడు దీనిపై తీర్పు వెలువరించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈనేపథ్యంలో సుప్రీం కోర్టు నిర్ణయంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం అమలుపై ఎలాంటి అభ్యంతరాలు లేనట్లే.

దేశ ప్రయోజనాల కోసమే జమ్ముకాశ్మీర్ కు ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు అప్పట్లోనే కేంద్రం ప్రకటించింది. ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. కొన్ని మతతత్వ పార్టీలు మాత్రం దీన్ని ఖండించాయి. దీనికి ప్రభుత్వం ఏమాత్రం జంకలేదు. తాను అనుకున్నది చేయడానికే సిద్ధపడింది.

కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జమ్ముకాశ్మీర్ లో శాంతిభద్రతలు నియంత్రణలో ఉన్నాయి. ఎలాంటి గొడవలు లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు. ఎవరో కొందరు కావాలనే దురుద్దేశంతోనే విమర్శలు చేస్తున్నారు తప్ప ఇబ్బందులు లేవు. 370 ఆర్టికల్ రద్దు అంశం మంచి ప్రయోజనాలు కలిగించింది. ఇప్పుడు కోర్టు కూడా జోక్యం చేసుకోలేమని చెప్పడంతో ఫిర్యాదుదారులు ఏం చేస్తారో చూడాల్సిందే.