Begin typing your search above and press return to search.

సుప్రీం సూటి ప్రశ్న.. ఈసీ ఏం సమాధానం చెబుతుంది?

తాజాగా సదరు అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ఎన్నికల సంఘాన్ని సూటిగా ప్రశ్నించింది. పోలింగ్ శాతాలపై అధికారిక సమాచారాన్ని 48 గంటల్లో ఎందుకు ఇవ్వలేరు? అని ప్రశ్నించింది.

By:  Tupaki Desk   |   18 May 2024 4:42 AM GMT
సుప్రీం సూటి ప్రశ్న.. ఈసీ ఏం సమాధానం చెబుతుంది?
X

150 సీసీ మోటర్ బైక్.. 60 సీసీ టీవీఎస్ లూనా (పాతకాలం నాటి లూనా ఎస్ఎల్ఆర్)లు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు వేరే ఊరికి వెళ్లాలి. మీరు ఏ వాహనాన్ని ఎంచుకుంటారు? ఇదేం ప్రశ్న? బుర్ర ఉన్నోడు ఎవరైనా దేన్ని ఎంచుకుంటారు? అంటూ ఎదురుప్రశ్న వేస్తారు. కానీ.. ఇప్పుడు అలాంటి తరహా ప్రశ్నను కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించాల్సిన టైం వచ్చేసింది. ప్రపంచం మొత్తానికి అవసరమైన ఐటీ ఉత్పత్తుల్ని.. ఐటీ ఇంజీనర్లను ప్రొడ్యూస్ చేసే దేశంలో.. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ఎంత నమోదు అయ్యిందన్న లెక్కల్ని చెప్పటానికి 48 గంటల కంటే ఎక్కువ టైం పడుతుందా? ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలోనూ దశాబ్దాల నాటి విధానాల్ని పాటించటంలో అర్థం ఉందా? అన్నది ప్రశ్న.

సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం.. అవసరానికి మించిన సమయాన్ని తీసుకుంటుందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వాటిని కాసేపు పక్కన పెట్టినా.. పోలింగ్ శాతాలపై కచ్ఛిత సమాచారాన్ని.. అధికారిక ప్రకటన చేయటానికి 48 గంటలకు పైనే తీసుకోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా సదరు అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ఎన్నికల సంఘాన్ని సూటిగా ప్రశ్నించింది. పోలింగ్ శాతాలపై అధికారిక సమాచారాన్ని 48 గంటల్లో ఎందుకు ఇవ్వలేరు? అని ప్రశ్నించింది.

పోలింగ్ పూర్తి అయిన తర్వాత 48 గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఆయా నియోజకవర్గాల వారీగా ఈసీ వెబ్ సైట్ లో ఎందుకు ఉంచలేకపోతున్నారు? అన్న ప్రశ్నను సంధించింది సుప్రీం ధర్మాసనం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ప్రశ్నల్ని సందించింది. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే ముగిసిన మొదటి.. రెండు.. మూడో దశల పోలింగ్ శాతాల్ని వెల్లడించే విషయంలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవటం.. ఈ గణాంకాల్ని పదే పదే మార్చటంపైనా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బోలెడంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి.. ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకున్నా.. మరింత వేగంగా సమాచారాన్ని వెల్లడించే వీలుంది. అంతేకాదు.. ఇప్పుడున్న వనరుల నేపథ్యంలో ఏడు దశల్లో ఎన్నికల్ని నిర్వహించటానికి మించిన వైఫల్యం మరొకటి లేదన్న మాటా పలువురి నోటి వినిపిస్తోంది.

అప్పుడెప్పుడో పదుల ఏళ్ల క్రితమే.. రెండు.. మూడు దశల్లో ఎన్నికలను పూర్తి చేసిన ఎన్నికల సంఘం రోజులు గడుస్తున్న కొద్దీ.. అంతకంతకూ ఎక్కువ సమయాన్ని తీసుకోవటం.. సరైన ప్లానింగ్ లేకపోవటమే కారణంగా చెప్పాలి. సుప్రీంకోర్టు తాజా ప్రశ్నల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏమని బదులిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.