Begin typing your search above and press return to search.

మీడియా జడ్జిమెంట్ పై సుప్రీం ఆగ్రహం!

ప్రస్తుతం ఈ అంశం మీదనే 2017 నాటి సూచనలకు సంబంధించిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారిస్తోంది.

By:  Tupaki Desk   |   13 Sep 2023 6:04 PM GMT
మీడియా జడ్జిమెంట్ పై సుప్రీం ఆగ్రహం!
X

మీడియా అన్నది నాలుగవ స్థంభం గా చెప్పాలి. దానికి పరిధులు పరిమితులు వార్తల విషయంలో లేవు. అయితే అది శృతి మించుతోంది అన్న భావన కూడా ఉంది. సరిగ్గా దీని మీదనే దేశ అత్యున్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ముఖ్యంగా హై ప్రొఫైల్ కేసులు కోర్టులలో విచారణ జరుగుతున్న సందర్భంలో కోర్టు తీర్పుల కంటే ముందే మీడియా తీర్పులు వెలువరించడం పట్ల సర్వత్రా ఒక విధమైన చర్చ సాగుతూ వస్తోంది. ఇది మంచిదేనా అన్న లోతుల్లోకి వెళ్లి ఆలోచించిన వారూ ఉన్నారు.

అసలు ఒక కేసు కోర్టులో విచారణ జరుగుతున్నపుడు దాని మీద మీడియా తన మిడిమిడి జ్ఞానంతో తోచిన విధంగా చెబుతూ తనకు కావాల్సిన వారి కోసం కావాల్సిన విధంగా తీర్పులు ఇచ్చేస్తూ ప్రజలలో తప్పుడు సంకేతాలు ఇస్తోంది అన్న దృఢమైన అభిప్రాయం అయితే ఉంది.

దీని వల్ల కొన్ని సార్లు కోర్టులను సైతం ప్రభావితం చేసేలా సమాంతరమైన తీర్పులు ఇస్తోంది అని విమర్శలు ఉన్నాయి. ఒక సైడ్ మాత్రమే తీసుకుని ఒక వైపే చూస్తూ ఇచ్చే పక్షపాత తీర్పుల వల్ల నేరస్తులను ముందుగానే చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో బాధిత కుటుంబం బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అని అంటున్నారు.

సరిగ్గా దీని మీదనే సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ తరహా మీడియా తీర్పులను కట్టడి చేయాలని అందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాలని కూడా కేంద్ర హోం శాఖను ఆదేశించింది. మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా సాగే విచారణల వల్ల న్యాయస్థానాల్లో జరిగే విచారణలు సైతం ప్రభావితం అయ్యే పరిస్థితి ఏర్పడుతోందని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రదూడ్ నాయకత్వంలోని ధర్మాసనం పేర్కొనడం విశేషం.

ఇక మీడియా సంచలనాల కోసం జరిపే ఈ తరహా విచారణల విషయంలో పోలీసులకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఒక కేసులో ఎంతవరకు దర్యాప్తునకు సంబంధించిన వివరాలు చెప్పాలన్నది కూడా పోలీసులకు అవగాహన ఉండేలా చూడాలని ధర్మాసనం సూచించింది. మీడియా తీర్పుల వల్ల బాధితులు నిందితులు రెండు వైపులా ఇబ్బందులు పడుతున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇది చాలా ముఖ్యమైన సమస్యగా కూడా పేర్కోనడం విశేషం.

అంతే కాకుండా ప్రజా ప్రయోజనాలు కూడా ఇలాంటి కేసులలో ముడిపడి ఉంటాయని అభిప్రాయపడింది. మీడియాకు భావ ప్రకటన స్వేచ్చతో పాటు, ప్రసంగం వంటి ప్రాధమిక హక్కులే ఉంటాయని, అంతకు మించి అన్నట్లుగా మీడియా చేసే అతిని తగ్గించాల్సి ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఏ దశలోనూ మీడియా విచారణకు అసలు అనుమతించకూడదని గట్టిగా పేర్కొంది. ఒక కేసు విషయంలో ప్రజలు చర్చించుకుంటారని అయితే వారికి ఆ హక్కులు ఉన్నా విచారణ సమయంలో ముఖ్యమైన సాక్ష్యాలు బయటపడితే అపుడు కేసు మొత్తాన్నే ప్రభావితం చేయవచ్చునన్నది ధర్మాసనం అభిప్రాయంగా ఉంది అంటున్నారు.

ప్రస్తుతం ఈ అంశం మీదనే 2017 నాటి సూచనలకు సంబంధించిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారిస్తోంది. ఒక కేసు విషయంలో నిందితులు, బాధితులు వారి హక్కులను దృష్టిలో ఉంచుకునే పోలీసుల మీడియా బ్రీఫింగ్ ఉండాలని దానికి తగిన విధంగా గైడ్ లైన్స్ ని రూపకల్పన చేయాలని సుప్రీం కూడా కోర్టు సూచిస్తోంది.

దీని మీద ముసాయిదాను రూపకల్పన చేయడానికి ఆరు వారాల గడువుని కేంద్ర ప్రభుత్వానికి విధిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. ఇదిలా ఉంటే ఏపీలో విపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ మీద ప్రాంతీయ జాతీయ మీడియాలో తోచిన విధంగా డిబేట్లు జరుగుతున్నాయి. అలాగే బాబు తప్పు చేశారని తీర్పు ఒక సెక్షన్ మీడియా ఇస్తూంటే కాదు చేయలేదని మరో సెక్షన్ ఆఫ్ మీడియా వెనకేసుకుని వస్తోంది. ఇదే సమయంలో సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్రానికి ఇచ్చిన ఆదేశాలు ఇపుడు మరింత చర్చనీయం అవుతున్నాయి అంటున్నారు.