Begin typing your search above and press return to search.

ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

దేశంలో ఎన్నికల నిర్వహణను రాజ్యాంగం కేంద్ర ఎన్నికల కమిషన్‌ కు అప్పగించిందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది.

By:  Tupaki Desk   |   22 Sep 2023 11:30 AM GMT
ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
X

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు)పై మొదటి నుంచి దేశంలో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడం కుదరదని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పలుమార్లు ఆధార సహితంగా స్పష్టం చేసినా కొన్ని పార్టీలు నమ్మడం లేదు. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలపై మాట్లాడని పార్టీలు ఓడిపోతే మాత్రం వాటి పనితీరును శంకిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఈవీఎంల్లో ఉపయోగించిన సాఫ్ట్‌వేర్‌ పై ఆడిట్‌ చేయాలని దాఖలైన పిటిషన్‌ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈవీఎంల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు చూపించే ఆధారాలేవీ పిటిషనర్‌ సమర్పించలేదని.. అందుకే ఈ పిటిషన్‌ ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది.

ఈవీఎం సోర్స్‌కోడ్‌ పై ఆడిట్‌ నిర్వహించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం పరిశీలించింది. అనంతరం సదరు పిటిషన్‌ ను కొట్టివేసింది.

దేశంలో ఎన్నికల నిర్వహణను రాజ్యాంగం కేంద్ర ఎన్నికల కమిషన్‌ కు అప్పగించిందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అయితే, ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలను పిటిషనర్‌ కోర్టుకు అందించలేదని వెల్లడించింది. ముఖ్యంగా ఈవీఎంలపై అనుమానాలు కలిగించే ఏ సమాచారాన్ని ఇవ్వలేదు అని సుప్రీం ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ ను రద్దు చేసినట్టు తేల్చిచెప్పింది.

ఈవీఎంలలో ఉపయోగించిన సోర్స్‌ కోడ్‌ పై ఆడిట్‌ చేపట్టాలని కోరుతూ సునీల్‌ ఆహ్యా అనే వ్యక్తి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. సోర్స్‌ కోడ్‌ అనేది ఈవీఎంకు ఎంతో కీలకమన్నారు. ఇది ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించింది అని అందులో పేర్కొన్నారు. ఇదే విషయంపై ఆడిట్‌ నిర్వహించాలంటూ సుప్రీం కోర్టులో సైతం సునీల్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ఇందుకు ఆధారాలు సమర్పించకపోవడంతో సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ ను కొట్టేసింది.