Begin typing your search above and press return to search.

మ‌ణిపూర్ బాధిత మ‌హిళ‌ల‌కు సుప్రీంకోర్టు బాస‌ట‌.. త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు

మ‌ణిపూర్‌లో మ‌హిళ‌ల‌పై జ‌రిగిన దాడులు వారికి బాస‌ట‌గా ఉండేందుకు దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

By:  Tupaki Desk   |   7 Aug 2023 4:18 PM GMT
మ‌ణిపూర్ బాధిత మ‌హిళ‌ల‌కు సుప్రీంకోర్టు బాస‌ట‌.. త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు
X

అల్ల‌ర్ల‌తో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్‌లో మ‌హిళ‌ల‌పై జ‌రిగిన దాడులు.. అత్యాచారాల కేసుల‌ను ప‌రిశీలించేందుకు.. వారికి బాస‌ట‌గా ఉండేందుకు దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. గ‌తంలోనే కేంద్రం జోక్యం చేసుకుంటుం దా? మేమే నిర్ణ‌యం తీసుకోవాలా? అని ప్ర‌శ్నించిన సుప్రీంకోర్టు.. చివ‌ర‌కు త‌న నిర్ణ‌యం తానే తీసుకుని ముగ్గురు రిటైర్డ్ మ‌హిళా న్యాయ‌మూర్తుల‌తో కూడిన క‌మిటీని నియ‌మించింది. వీరిలో ఒక‌రు మాజీ ప్ర‌ధాన న్యాన‌మూర్తి కూడా కావ‌డం గ‌మ‌నార్హం.

మణిపూర్ లో మ‌హిళ‌ల‌పై జ‌రిగిన అకృత్యాల‌ కేసుల విచారణతో పాటు బాధితుల సహాయ, పునరావాస పర్యవేక్షణ వంటివి ఈ క‌మిటీ బాధ్య‌త‌లుగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కమిటీలో జస్టిస్ గీతా మిట్టల్ (జమ్మూకశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ షాలిని జోషి (ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి), జస్టిస్‌ ఆశా మీనన్ (ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి) ఉన్నారు. చట్ట పాలనపై విశ్వసనీయతను పునరుద్ధరించేందుకే ఈ కమిటీని ఏర్పాటుచేస్తున్నామని సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

క‌మిటీ ఏం చేస్తుంది?

సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు ఈ త్రిస‌భ్య మ‌హిళా న్యాయ‌మూర్తుల క‌మిటీ.. మ‌ణిపూర్ వ్యాప్తంగా ప‌ర్య‌టించ‌నుంది. వెలుగులోకి వ‌చ్చిన ఉదంతాల‌తోపాటు.. వెలుగులోకి రాని కొన్ని వంద‌ల కేసుల‌(ఉన్నాయ‌ని సుప్రీంకోర్టు భావిస్తోంది)పై దృష్టి సారించ‌నుంది. వీరికి పూర్తిస్థాయి సుప్రీం మెజిస్టీరియ‌ల్ అధికారాల‌ను క‌ట్ట‌బెట్టిన‌ట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో వీరికి రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి వ‌ర‌కు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల వ‌ర‌కు విచారించే అవ‌కాశం ల‌భించింది. దీంతో ఆయా ఘ‌ట‌న‌ల‌పై ఐదు వారాల్లో విచార‌ణ చేప‌ట్టి.. సుప్రీంకోర్టుకు నివేదిక అందించ‌డంతోపాటు.. బాధిత కుటుంబాల‌కు బాస‌ట‌గా నిల‌వ‌నున్నారు.