Begin typing your search above and press return to search.

ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్ ర‌ద్దుపైనా నిర్ణయిస్తాం: సుప్రీంకోర్టు

వివేకానంద‌రెడ్డి హ‌త్య అనంత‌రం.. ఆయ‌న ఒంటిపై ఉన్న ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను తుడిచి.. ఇంటిని శుభ్రం చేయించార‌ని.. గ‌జ్జ‌ల ఉద‌య్‌కుమార్‌రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   15 April 2025 6:40 PM IST
ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్ ర‌ద్దుపైనా నిర్ణయిస్తాం:  సుప్రీంకోర్టు
X

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న గ‌జ్జ‌ల ఉద‌య్‌కుమార్‌రెడ్డి ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్నారు. అయితే.. ఈయ‌న బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. తాజాగా మంగ‌ళ‌వారం దీనిపై విచార‌ణ జ‌రిగింది. ఈసంద‌ర్భంగా సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సంజీవ్‌కుమార్ ఖ‌న్నా స్పందించారు.

''ఈ కేసులో చాలా మంది బెయిల్‌పై ఉన్నార‌ని మీరు చెబుతున్నారు. వారి బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతున్నారు. మీరు చెబుతున్న ఆధారాల‌ను బ‌ట్టి.. వారు కూడా బెయిల్‌కు అన‌ర్హులుగా భావించాల్సి ఉంటుంది. కాబ‌ట్టి.. వారిపై మీరు దాఖ‌లు చేసిన బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ల‌ను కూడా.. ఒకేసారి విచార‌ణ‌కు తీసుకుంటాం. బెయిల్ ర‌ద్దుపై ఒకే సారి నిర్ణ‌యం వెలువ‌రుస్తాం'' అని సీజేఐ జ‌స్టిస్ ఖ‌న్నా వ్యాఖ్యానిం చారు. వీరిలో ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు.

ఏం జ‌రిగింది?

వివేకానంద‌రెడ్డి హ‌త్య అనంత‌రం.. ఆయ‌న ఒంటిపై ఉన్న ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను తుడిచి.. ఇంటిని శుభ్రం చేయించార‌ని.. గ‌జ్జ‌ల ఉద‌య్‌కుమార్‌రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. గ‌తంలో సీబీఐ కూడాప‌లుమార్లు ఆయ‌న‌ను ప్ర‌శ్నించి.. జైలుకు కూడా పంపించింది. ఎట్ట‌కేల‌కు ఆయ‌న బెయిల్ పొందారు. అయితే.. బ‌య‌ట‌కు వ‌చ్చాక బెదిరింపులకు పాల్ప‌డుతున్నార‌ని.. సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌ని ఆరోపిస్తూ.. సునీత సుప్రీంకోర్టులో బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ వేశారు.

దీనికి ముందే.. ఎంపీ అవినాష్‌రెడ్డి స‌హాఆయ‌న తండ్రి భాస్క‌ర‌రెడ్డి బెయిల్ ర‌ద్దుకోరుతూ.. ఆమె పిటిష‌న్లు వేర్వేరుగా వేశారు. తాజా విచార‌ణ‌లో వివేకా ర‌క్త‌పు మ‌ర‌క‌లు తుడిచార‌ని.. గ‌జ్జ‌ల‌కు సంబంధించిన విష‌యాల‌ను సునీత త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు చెప్పారు. ఈక్ర‌మంలో స్పందించిన కోర్టు.. ఎంపీ అవినాష్‌, భాస్క‌రరెడ్డి స‌హా.. ఇత‌రుల బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ల‌పైనా ఒకేసారి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తేల్చి చెప్పింది.