Begin typing your search above and press return to search.

అవినీతిపరుడిని తిరిగి విధుల్లో చేర్చడం సమంజసమా? సుప్రీంకోర్టు సూటి ప్రశ్న

అలా చేయడం వల్ల ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకానికి బలమైన దెబ్బపడుతుందని వ్యాఖ్యానించింది.

By:  Tupaki Desk   |   21 Jun 2025 12:00 AM IST
అవినీతిపరుడిని తిరిగి విధుల్లో చేర్చడం సమంజసమా? సుప్రీంకోర్టు సూటి ప్రశ్న
X

అవినీతి కేసులో దోషిగా తేలిన అధికారిని తిరిగి ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలా చేయడం వల్ల ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకానికి బలమైన దెబ్బపడుతుందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో ‘కె.సి. సరీన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసు నిబంధనలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది.

ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఇన్‌స్పెక్టర్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. లంచం డిమాండ్ చేసి తీసుకున్నాడని నిరూపణ కావడంతో ట్రయల్ కోర్టు ఆయనకు శిక్ష విధించింది. అయితే ఆ తీర్పును సస్పెండ్ చేయాలని, తిరిగి ఉద్యోగంలో చేరేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.

ఈ సందర్భంగా జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి వరలేలతో కూడిన ధర్మాసనం వెల్లడించిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. "అవినీతి కేసులో దోషిగా తేలిన వ్యక్తిని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించే వరకూ ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడం నిషిద్ధం. అలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజల విశ్వాసానికి భంగం కలుగుతుంది. ఇది నిజాయితీపరులైన అధికారులకు అవమానం అవుతుంది" అని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద అవినీతి కేసు న్యాయ విచారణలో దోషిగా తేలితే అతడు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ పెడితేనే తప్ప వాస్తవంగా నిర్దోషిగా మారడని భావించరాదు. అలాంటి వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం పౌరుల నమ్మకాన్ని తగ్గిస్తుంది" అని పేర్కొంది.

అదే సమయంలో పిటిషనర్ తరపు న్యాయవాది మాత్రం "ఈ కేసులో లంచం తీసుకున్నాడని నేరుగా తేలిపోలేదు, అందుకే అతనిని తిరిగి సర్వీసులోకి అనుమతించాలి" అని వాదించారు. కానీ ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది.

ఈ తీర్పుతో అవినీతి కేసులపై ప్రభుత్వ వైఖరికి స్పష్టత వచ్చింది. అవినీతి నిరూపితమైన వారు ఇకపై తాత్కాలికంగా కూడా విధుల్లోకి చేరలేరని సుప్రీం కోర్టు ఈ తీర్పుతో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలో స్వచ్ఛత, ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.