Begin typing your search above and press return to search.

దేశ ప్ర‌తిష్ఠను దిగ‌జార్చారు.. ద‌గ్గు మందు కంపెనీపై సుప్రీం ధ్వ‌జం

ఇటీవ‌లి కాలంలో సంచ‌ల‌నం రేపిన చిన్న పిల్ల‌ల‌ ద‌గ్గు మందు మ‌ర‌ణాల‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

By:  Tupaki Political Desk   |   20 Feb 2026 2:00 PM IST
దేశ ప్ర‌తిష్ఠను దిగ‌జార్చారు.. ద‌గ్గు మందు కంపెనీపై సుప్రీం ధ్వ‌జం
X

ఇటీవ‌లి కాలంలో సంచ‌ల‌నం రేపిన చిన్న పిల్ల‌ల‌ ద‌గ్గు మందు మ‌ర‌ణాల‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. నాణ్య‌తా ప్ర‌మాణాలు లేని ఔష‌ధాల త‌యారీ, అమ్మ‌కంతో పాటు అనేక ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన సంబంధిత సంస్థ స‌హా దాని అధికారులు కొంద‌రికి స‌మ‌న్లు జారీ చేసింది. వారు చేసిన ప‌నితో దేశ ప్ర‌తిష్ఠ దిగ‌జారింద‌ని మండిప‌డింది. ద‌గ్గు మందు కార‌ణంగా సంభ‌వించిన మ‌ర‌ణాల‌తో ఎలాంటి చెడ్డ పేరు వ‌చ్చిందో తెలుసా? అంటూ నిల‌దీసింది. భార‌త ఫార్మా సంస్థ త‌యారు చేసిన ద‌గ్గు మందు (సిర‌ప్) కార‌ణంగా ఉజ్బెకిస్థాన్ లో 18 మందికి పైగా పిల్ల‌లు చ‌నిపోవ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స్టాండ‌ర్డ్ క్వాలిటీ (ప్రామాణిక నాణ్య‌త‌) లేని ఔష‌ధాలు త‌యారీ అమ్మ‌కం, వివిధ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌పై దాఖ‌లైన పిటిష‌న్ ను సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జ‌స్టిస్ విపుల్ ఎం.పంచోలిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచారించింది. ఫార్మా సంస్థ‌, కొంద‌రు అధికారుల‌కు జారీ చేసిన స‌మ‌న్ల ర‌ద్దుకు నిరాక‌రించింది.

మీకు డ‌బ్బే ముఖ్య‌మా?

విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీం ధ‌ర్మాస‌నం తీవ్ర ప‌ద‌జాలంతో విర‌చుకుప‌డింది. మీకు డ‌బ్బే ముఖ్య‌మా? డ‌బ్బు కోస‌మే ఈ వ్యాపారం చేస్తున్నారా? మీ చ‌ర్య కార‌ణంగా దేశ ప్ర‌తిష్ఠ దెబ్బ‌తింటోంది.. అని నిప్పులు చెరిగింది. కాగా, త‌మ క్ల‌యింట్ సంస్థ త‌యారు చేసిన సిర‌ప్ వాడినందుకే మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని చెప్పేందుకు ఎలాంటి రికార్డులూ లేవ‌ని ఫార్మా సంస్థ త‌ర‌ఫు న్యాయ‌వాదులు వ్యాఖ్యానించారు. కాగా, ఈ కేసులో ఫార్మా సంస్థ‌, కొంద‌రు అధికారుల‌పై 2024 జ‌న‌వ‌రిలో యూపీలోని గౌత‌మ బుద్ధ న‌గ‌ర్ చీఫ్ జ్యుడీషియ‌ల్ మెజిస్ట్రేట్ స‌మ‌న్లు జారీ చేశారు. వీటిని స‌వాల్ చేస్తూ ఫార్మా కంపెనీ, అధికారులు వేసిన పిటిష‌న్ల‌ను అల‌హాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేర‌కు ఆ న్యాయ‌స్థానం జారీ చేసిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది.

ఆ సంస్థ ఔష‌ధం విష‌పూరిత‌మే..

అల‌హాబాద్ హైకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్ పై విచార‌ణ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది గ‌తంలో వాదిస్తూ.. సంబంధిత ఫార్మా సంస్థ త‌యారు చేసిన ఔష‌ధం విష‌పూరితం అని ఉజ్బెకిస్థాన్ లో తేలింద‌ని తెలిపారు. ఈ కార‌ణంగానే 18 మంది పిల్ల‌లు చ‌నిపోయార‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే కోర్టు.. స‌మ‌న్ల ఉత్త‌ర్వుల‌ను హైకోర్టు స‌మ‌ర్థించుకుంది.

ఉజ్బెక్ తో పాటు గాంబియాలోనూ

ఉజ్బెకిస్థాన్ లోనే కాక భార‌త్ లో త‌యారైన ద‌గ్గు మందుల కార‌ణంగా ఆఫ్రికా దేశం గాంబియాలోనూ పెద్ద ఎత్తున మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఆ దేశంలో ఏకంగా 70 మంది పిల్ల‌లు మ‌ర‌ణించారు. దీంతో భార‌త సుప్రీంకోర్టు సంబంధిత ఫార్మా సంస్థ‌ల‌ను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. అటు కేంద్ర ప్ర‌భుత్వం కూడా స్పందించి.. ఆయా కంపెనీల అనుమ‌తుల‌ను ర‌ద్దు చేసింది. క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసింది. చిన్నారుల‌కు ద‌గ్గు మందు ఇచ్చే విష‌యంలో వైద్యుల స‌ల‌హా త‌ప్ప‌నిస‌రి అని కేంద్ర ఆరోగ్య శాఖ సూచింది.

మ‌రోవైపు ద‌గ్గు మందులో డై ఇథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ అనే విష‌పూరిత ర‌సాయ‌నాలు క‌ల‌వ‌డంతో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న‌ట్లు ప‌రిశీల‌న‌లో తేలింది. ఈ ర‌సాయ‌నాలు... కిడ్నీలు దెబ్బ‌తినేందుకు కార‌ణ‌మ‌వుతాయ‌ని స్ప‌ష్ట‌మైంది.

-మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఛింద్వారా జిల్లాలో కోల్డ్ రీఫ్ సిర‌ప్ తాగి 22 మంది పైగా చిన్నారులు చ‌నిపోయారు. దీనిని త‌మిళ‌నాడుకు చెందిన ఫార్మా సంస్థ త‌యారుచేసింది. దీంతోపాటు రెడ్నెక్స్ ఫార్మాస్యూటిక‌ల్స్, రి లైఫ్ ఔష‌ధాల‌ను బ్యాన్ చేశారు.