Begin typing your search above and press return to search.

‘నాకు పశ్చాత్తాపం లేదు’.. సీజేఐపై షూ విసరిన న్యాయవాది

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బి.ఆర్. గవాయిపై విచారణ జరుగుతున్న సమయంలోనే ఒక సీనియర్ న్యాయవాది షూ విసిరారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా న్యాయ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది.

By:  A.N.Kumar   |   7 Oct 2025 7:00 PM IST
‘నాకు పశ్చాత్తాపం లేదు’..  సీజేఐపై షూ విసరిన న్యాయవాది
X

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అపూర్వమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన చోటు చేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బి.ఆర్. గవాయిపై విచారణ జరుగుతున్న సమయంలోనే ఒక సీనియర్ న్యాయవాది షూ విసిరారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా న్యాయ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. వృద్ధ న్యాయవాది రాకేష్ కిషోర్ ఈ చర్యకు పాల్పడిన తర్వాత చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి.

సీజేఐ వ్యాఖ్యలే వివాదానికి మూలం

ఈ సంచలనాత్మక ఘటనకు కొన్ని రోజుల ముందు సీజేఐ గవాయి చేసిన వ్యాఖ్యలే నేపథ్యంగా నిలిచాయి. కాజురహోలోని విష్ణుమూర్తి విగ్రహ పునర్నిర్మాణం కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ కోర్టు జోక్యం కోరగా.. సీజేఐ "పోయి దేవుడినే అడుగు" అని వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు హిందూ భావోద్వేగాలను కించపరిచేలా ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు చెలరేగాయి.

అయితే, సీజేఐ గవాయి వెంటనే స్పందించి, "నా వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరించారు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను" అని స్పష్టీకరణ ఇచ్చారు.

*కోర్టు గదిలో నాటకీయ పరిణామం

ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్యే, తాజాగా విచారణ జరుగుతుండగా న్యాయవాది రాకేష్ కిషోర్ ఆకస్మాత్తుగా లేచి సీజేఐ గవాయిని లక్ష్యంగా చేసుకుని షూ విసిరారు. ఆ షూ న్యాయమూర్తుల బెంచ్ ముందు పడింది. ఈ అనూహ్య పరిణామానికి కోర్టు గదిలో ఉన్నవారంతా ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు.

అయితే సీజేఐ గవాయి అత్యంత శాంతంగా వ్యవహరించారు. "నన్ను ఇలాంటి విషయాలు ప్రభావితం చేయవు, దయచేసి విచారణ కొనసాగించండి" అని ధైర్యంగా సమాధానమిచ్చారు. భద్రతా అధికారులు వెంటనే కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆశ్చర్యకరంగా తనపై షూ విసిరిన న్యాయవాదిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని సీజేఐ గవాయి కోర్టు రిజిస్ట్రీకి ఆదేశించడం ఆయన గొప్పతనాన్ని చాటింది.

"ఇది దేవుని ఆదేశం, నాకు పశ్చాత్తాపం లేదు"

అదుపులోకి తీసుకున్న తర్వాత, న్యాయవాది రాకేష్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టించాయి. తాను చేసిన పనికి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశారు. "నేను చేసిందేం కాదు – అది దేవుడు చేసాడు. సీజేఐ సనాతన ధర్మాన్ని ఎగతాళి చేశారు. ఇది దేవుని ఆదేశం, చర్యకీ ప్రతిచర్య." అంటూ తన చర్యను సమర్థించుకున్నారు.

*బీసీఐ కఠిన చర్య – లాయర్ హక్కులు సస్పెండ్

సుప్రీంకోర్టు చరిత్రలోనే అరుదైన ఈ ఘటనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తీవ్రంగా స్పందించింది. న్యాయవ్యవస్థ పట్ల అగౌరవంగా ప్రవర్తించినందుకు గాను, రాజేష్ కిషోర్ న్యాయవాద హక్కులను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.

బీసీఐ చర్యపై కూడా కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "నా వాదన వినకుండానే, అన్వేషణా కమిటీకి ఇవ్వకుండానే బీసీఐ నన్ను సస్పెండ్ చేసింది. ఇది పెత్తనం" అని విమర్శించారు.

కోర్టు భద్రత, మతపరమైన సున్నితత్వం

ఈ సంఘటన దేశవ్యాప్తంగా చట్టపరమైన, రాజకీయ , సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. అత్యున్నత న్యాయస్థానం యొక్క భద్రతా లోపాలు, న్యాయ వ్యవస్థ సున్నితత్వం, అలాగే న్యాయమూర్తుల మతపరమైన వ్యాఖ్యల ప్రభావం వంటి అంశాలపై కొత్త చర్చలు మొదలయ్యాయి. ఈ పరిణామం సమాజంలో పెరుగుతున్న మతపరమైన విభజన గురించిన ఆందోళనను మరోసారి బలంగా ముందుకు తెచ్చింది.