'యాక్సిడెంట్' పాలసీ.. కళ్లు తెరిపించే తీర్పు!
అయితే.. తాజాగా ఒక కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
By: Tupaki Desk | 4 July 2025 8:00 AM ISTయాక్సిడెంట్ పాలసీ.. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ప్రతి వాహనాన్ని కొనుగోలు చేసే ముందు.. ప్రమాద బీమా చేయిస్తారు. ఆ తర్వాత..నిర్ణీత కాల పరిమితిని బట్టి.. థర్డ్ పార్టీ, ఫస్ట్ పార్టీ ఇంసూరెన్సులు చేయిం చాలి. తద్వారా.. మనమే ప్రమాదానికి గురైనా.. లేక ఎదుటి వారి ద్వారా మనకు ప్రమాదం సంభవించినా.. కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. పైగా రాడ్డు రవాణా శాఖ నియమం కూడా. బీమాలేని బళ్లను తక్షణం సీజ్ చేసే అధికారం కూడా ఉంటుంది.
తాజాగా ఈ ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు ఎలా జరిగి నా.. ఇక నుంచి ఈ తీర్పు ప్రకారమే బీమా కంపెనీలు వాహనాల ప్రమాదాలకు సంబంధించిన బీమాను అందిస్తాయి. నష్టాన్ని భరిస్తాయి. ఇది ఒకరకంగా.. ప్రజలను లైన్‌లో పెట్టే తీర్పుగా న్యాయనిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం.. ప్రమాదం ఎలా జరిగింది.. అనే అంశంతో సంబంధం లేకుండా.. ప్రమాదం జరిగింది కాబట్టి బీమా ఇవ్వాల్సిందే అన్న విధంగా ఉంది.
అయితే.. తాజాగా ఒక కేసులో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వాహన ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కారణమైనా.. లేక డ్రైవర్ మద్యం తాగి ఉన్నా.. ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోయినా.. రోడ్డుపై ఇష్టానుసారం వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమైనా.. సదరు వాహనానికి ఎలాంటి బీమా వర్తించబోదని స్పష్టం చేసింది. రూపాయి కూడా బాధిత కుటుంబానికి చెల్లించాల్సినవసరం లేదని తేల్చేసింది. ఈ మేరకు సుప్రీకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది.దీంతో వాహనాలు నడిపే వారు ఇక నుంచి ఒళ్లు దగ్గర పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కనీసం ఇప్పుడైనా మారుతారో లేదో చూడాలి.
ఇదీ కేసు..
కర్ణాకటలోని మల్లసంద్ర గ్రామానికి చెందిన ఎన్ఎస్ రవీష్ 2014లో తన కుటుంబంతో కలిసి కారులో జాతీయ రహదారిపై వెళ్తున్నాడు. మలనహళ్లి సమీపంలో అతివేగం కారణంగా కారు అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రవీష్ అక్కడికక్కడే మరణించాడు. దీంతో కుటుంబం బీమా చెల్లించాలని కంపెనీని ఒత్తిడి చేసింది. అనేక విచారణలు, స్థానిక కోర్టుల తీర్పులు బీమా కంపెనీలకు అనుకూలంగా వచ్చాయి. తాజాగా సుప్రీంకోర్టు కూడా పైవిధంగా సంచలన తీర్పు వెలువరించింది.
