కేసిరెడ్డికి నో రిలీఫ్.. లిక్కర్ మేటర్ వెరీ సీరియస్!
ఏపీ మద్యం స్కాం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఇప్పట్లో జైలు నుంచి బయట పడే అవకాశాలు కనిపించడం లేదు.
By: Tupaki Political Desk | 10 Feb 2026 3:53 PM ISTఏపీ మద్యం స్కాం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ఇప్పట్లో జైలు నుంచి బయట పడే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో రాజ్ కేసిరెడ్డి ముందు ఉన్న దారులు అన్నీ మూసుకుపోయినట్లేనని భావిస్తున్నారు. సుమారు పది నెలలుగా రాజ్ కేసిరెడ్డి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనతోపాటు అరెస్టు అయిన నిందితులు ఒక్కొక్కరు వరుసగా బెయిలుపై బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు కూడా బెయిలు లభిస్తుందన్న ఆశతో కేసిరెడ్డి ఇప్పటివరకు న్యాయపోరాటం చేశారు. అయితే ఆయనపై ఉన్న అభియోగాల తీవ్రత దృష్ట్యా బెయిలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సమ్మతించలేదు.
మద్యం స్కాంలో ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కేసిరెడ్డి బెయిలు పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజ్ కేసిరెడ్డికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. సుమారు రూ.732 కోట్ల నగదు లావాదేవీల్లో కేసిరెడ్డికి సంబంధం ఉందంటూ సుప్రీం వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. సహచర నిందితులకు బెయిలు ఇచ్చినందున తనను విడుదల చేయాలని కేసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంలో సవాల్ చేశారు.
తాజాగా సుప్రీంకోర్టులో కేసిరెడ్డి బెయిలుపై వాడివేడి వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాలయ్యా బగ్చీ, జస్టిస్ ఎస్.వీ.అంజరియా ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. నేరం రుజువు కాకుండా ఒక వ్యక్తిని పది నెలలుగా జైలులో ఉంచడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని కేసిరెడ్డి తరఫు న్యాయవాది నాగముత్తు వాదించారు. కేసులో ఏ6 నుంచి ఏ 37 వరకు అందరికి బెయిలు మంజూరైందని, ఏ7తో ఉన్న బంధుత్వం కారణంగా ఏ1 కేసిరెడ్డికి బెయిలు తిరస్కరించడం భావ్యం కాదని న్యాయవాది నాగముత్తు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
అయితే, కేసిరెడ్డి న్యాయవాది వాదనలను ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లుద్రా, సిద్ధార్థ్ అగర్వాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. నిందితుడు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అని, ఆయన బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టుకు నివేదించారు. ఇతర నిందితులతో సమానంగా కేసిరెడ్డిని చూడొద్దని విన్నవించారు. ప్రభుత్వ న్యాయవాదులతో ఏకీభవించిన ధర్మాసనం నిందితుడు కేసిరెడ్డి బెయిలు పిటిషన్ ను తోసిపుచ్చింది. రూ.732 కోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసిరెడ్డిని ఇతర నిందితులతో కలిపి చూడలేమని స్పష్టం చేసింది.
సుప్రీం తీర్పుతో కేసిరెడ్డికి మరో గత్యంతరం కనిపించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు ముగిసేంత వరకు కేసిరెడ్డికి బెయిలు లభించే అవకాశాలు లేవని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కాంపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి ఏ1గా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డి లిక్కర్ పాలసీని మార్చడంతోపాటు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తాను చెప్పిన బ్రాండ్లే విక్రయించేలా పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనతోపాటు వైసీపీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా ఈ కేసులో అరెస్టు అయ్యారు. అయితే కోర్టులు వారికి బెయిలు మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం వైసీపీకి చెందిన నాయకుల్లో కేసిరెడ్డి ఒక్కరే జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారని చెబుతున్నారు.
