Begin typing your search above and press return to search.

కేఏ పాల్ కు క్లాస్ పీకిన సుప్రీంకోర్టు

కేఏ పాల్ తరచూ వివిధ అంశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. ప్రతి సందర్భంలోనూ కోర్టు మొట్టికాయలు వేయడం పరిపాటిగా మారింది. ఈ పిటిషన్ల పరంపరపై కోర్టు గతంలోనూ కీలక వ్యాఖ్యలు చేసింది.

By:  A.N.Kumar   |   10 Nov 2025 7:39 PM IST
కేఏ పాల్ కు క్లాస్ పీకిన సుప్రీంకోర్టు
X

ఆంధ్రప్రదేశ్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సుప్రీంకోర్టులో మరోసారి తీవ్ర చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై (పిల్) అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్ల ఉద్దేశం ప్రజా ప్రయోజనం కాదు.. కేవలం మీడియా ప్రచారం కోసమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఏపీ మెడికల్ కాలేజీలపై పిటిషన్.. కోర్టు ఆగ్రహం

తాజాగా ఏపీలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో మెడికల్ కాలేజీలను నిర్మించడాన్ని సవాల్ చేస్తూ కేఏ పాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. "మీరు ప్రజా ప్రయోజనం పేరుతో పిటిషన్లు వేస్తున్నా.. వాస్తవానికి ఇవి మీడియా ప్రచారం కోసం దాఖలు చేస్తున్న పిల్స్‌లా కనిపిస్తున్నాయి. మీరు చట్టపరమైన అంశాలను పరిశీలించకుండా ప్రతి దానిపై కోర్టుకు వస్తున్నారు." ఈ అంశం రాష్ట్ర పరిధిలోకి వస్తుందని ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం కేఏ పాల్‌ను ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇది మొదటిసారి కాదు: పదే పదే చీవాట్లు

కేఏ పాల్ తరచూ వివిధ అంశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. ప్రతి సందర్భంలోనూ కోర్టు మొట్టికాయలు వేయడం పరిపాటిగా మారింది. ఈ పిటిషన్ల పరంపరపై కోర్టు గతంలోనూ కీలక వ్యాఖ్యలు చేసింది. 2024 ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్‌ను వాడాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఘాటుగా స్పందించింది. "మీరు గెలిస్తే ఈవీఎంలు బాగున్నాయి, ఓడిపోయినప్పుడు ట్యాంపరింగ్ ఆరోపణలు వస్తాయా?" అని ప్రశ్నించింది. 2024లో తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ చేసిన విజ్ఞప్తిని డిస్మిస్ చేస్తూ "దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ప్రతి ఒక్కదానిపై ఇలాంటి పిటిషన్లు వేయలేము. మీ విజ్ఞప్తి అంగీకరిస్తే ప్రతి ఆలయానికీ ఇదే డిమాండ్ వస్తుంది." అని ఘాటుగా బదులిచ్చింది. 2023లో తెలంగాణ సచివాలయ అగ్నిప్రమాదంపై సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ "ప్రతి అగ్నిప్రమాదాన్ని సీబీఐ విచారణకు అప్పగించాలా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజా తీర్పుతో సుప్రీంకోర్టు కేఏ పాల్‌కు "లెఫ్ట్ అండ్ రైట్" ఇచ్చిపడేసింది అనడంలో సందేహం లేదు. ప్రచార ఆకాంక్షతో కాకుండా చట్టపరమైన అర్హత ఉన్న అంశాలను మాత్రమే న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలని అత్యున్నత ధర్మాసనం కేఏ పాల్ కు గట్టిగా హితవు పలికింది.